పొగబెట్టారు..
ఘొల్లు మంటున్న ఎండీఎం నిర్వాహకులు
♦ 15ఏళ్లగా సేవలు చేయించుకుని గెంటేయడమేనా?
♦ ‘మధ్యాహ్న భోజన పథకం’ నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడంపై నిర్వాహకుల గగ్గోలు
♦ విజయవాడలో 22న మహాధర్నా చేపట్టాలని నిర్ణయం
సాక్షి గోపాలపట్నం(విశాఖపశ్చిమ):
ప్రభుత్వం నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోయినా పుస్తెలు తాకట్టు పెట్టి మరీ మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపిస్తూ వచ్చారు. మరి కొందరైతే ఇపుడు కాకపోతే ఎపుడైనా ప్రభుత్వం తమను చూడకపోతుందా? అని ఆశించి అప్పులు చేసి పిల్లలకు సమయానికే భోజనం పెట్టేవారు. ఇలా 15 ఏళ్లు సేవలందించిన నిర్వాహకులు ఇపుడు ప్రభుత్వానికి పనికి రారట. వీరిని గెంటేసి మరో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో అన్ని చోట్లా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఘొల్లుమంటున్నారు. జిల్లాలో 3800 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, జెడ్పీ హైస్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, 7338 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వా
హకులున్నారు. 15ఏళ్లగా నిర్వాహణ బాధ్యతలను మహిళలే చూస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో విద్యార్థికి రూ.6.18పైసల చొప్పున భోజన ఖర్చుగా ప్రభుత్వం చెల్లించేది. గతంలో వారానికి మూడు సార్లు గుడ్లు పెట్టాలని సూచిస్తూ రూ8.53 ఇచ్చినా అదీ తీసేసి మళ్లీ పాత విధానాన్నే (రూ.6.18) అమలు చేసింది. గత ఆగస్టు ఒకటి నుంచి నుంచి పది రోజుల పాటు కాంట్రాక్టర్‌కు గుడ్ల పంపిణీ ప్రక్రియను అప్పగించినా అదీ కొద్ది రోజులే నడిచింది. తర్వాత నుంచి విద్యార్థులకు గుడ్డు పంపిణీనే ఏకంగా ఆపేశారు.
ఇపుడు ఏకంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులనే తీసేస్తే పోలా?..అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించింది. వారి బాధ్యతలను రెండు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. దీంతో తమను కాదని ఏవో సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే తామేమైపోవాలంటూ నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) నిర్వాహకులంతా ఈ నెల 22న విజయవాడలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ మండలాల నుంచి ఆ నిర్వాహకులు ధర్నాకు సన్నద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ప్రచారాలు ప్రారంభించారు.
పుస్తెలు తాకట్టు పెట్టి మరీ నిర్వహించాం
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నెలల తరబడి బిల్లులు రాకపోయినా పుస్తెలు తాకట్టు పెట్టి మరీ విద్యార్థులకు భోజనం పెట్టాం. నిత్యావసర ధరలు పెరిగినా, ప్రభుత్వం గ్యాస్, వంట పాత్రలు ఇవ్వకపోయినా భరించాం. అయినా ప్రభుత్వానికి కనికరం లేదా?. – చినతల్లి, ఎండీఎం నిర్వాహకురాలు, -గోపాలపట్నం బాలికల జెడ్పీ హైస్కూల్