private agency
-
ప్రైవేటు చేతుల్లోకి ప్రభుత్వ డేటా!
సాక్షి, అమరావతి:‘ప్రపంచంలో అత్యంత ఖరీదైన సంపద ఏదైనా ఉంది అంటే.. అది ఒక్క డేటా మాత్రమే. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వారే అత్యంత ధనికులు’ అమరావతి డ్రోన్ సదస్సులో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి. నూతన టెక్నాలజీ పరుగులు పెడుతున్న తరుణంలో డేటా అత్యంత విలువైనదని సీఎం చంద్రబాబు చెబుతూనే.. అత్యంత విలువైన ప్రభుత్వ డేటాను ప్రైవేటు ఏజెన్సీల చేతిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంగళగిరిలోని ‘పై డేటా సెంటర్’లో గల స్టేట్ డేటా సెంటర్ నిర్వహణ బాధ్యతలను థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. రెండేళ్ల లీజు కాలానికి స్టేట్ డేటా సెంటర్ నిర్వహణకు రాష్ట్ర ఐటీ శాఖకు చెందిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్ఎల్) బిడ్లు పిలిచింది. ప్రముఖ సిస్టమ్ ఇంటిగ్రేటర్, డేటా సెంటర్ మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లు టెండర్లలో పాల్గొనవచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పేరుతో ఈ–గవర్నెన్స్‌ను ప్రోత్సహిస్తోందని, దీన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలను కొనసాగించడం కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ డేటాసెంటర్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు టెండర్ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ప్రాధాన్యతను గుర్తించిందని, ఐటీ సేవలను విస్తరించడం ద్వారా ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు అక్టోబర్ 30 మధ్యాహ్నం 3గంటలలోపు టెండర్ దాఖలు చేయాల్సి ఉంటుందని, కాంట్రాక్టు గెలిచిన సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి రెండేళ్ల పాటు సేవలను అందించాల్సి ఉంటుందని బిడ్ డాక్యుమెంట్లో పేర్కొంది.ఐటీ నిపుణుల ఆందోళనడేటా చౌర్యంతో సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ డేటా నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై ఐటీ నిపుణలతో పాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా సెంటర్ నిర్వహణను ప్రభుత్వమే చేపట్టడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీ గ్రిడ్ పేరుతో డేటా చౌర్యం జరగడంపై తీవ్ర దుమారమే రేగిందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ డేటా సెంటర్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
ఔటర్ లీజుపై రాష్ట్రపతికి లేఖ
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడాన్ని కట్టడి చేయాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాస్తామని, కోర్టుకు కూడా వెళ్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. నాలుగు నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓఆర్ఆర్ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి 30 ఏళ్ల పన్నులను ఒకేసారి తీసుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి? రాబోయే ప్రభుత్వాలు ఏం చేయాలని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. భట్టి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగుతోంది. బుధవారం ఆయన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. యాదగిరిగుట్టలో ఆటో కార్మికుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. అనంతరం యాదగిరిగుట్ట మండలం గొల్లగుడెసెలు, దాతరుపల్లి గ్రామాల మీదుగా యాత్ర భువనగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. బస్వాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న నృసింహసాగర్ రిజర్వాయర్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సమస్యలను ఆలకించారు. రిజర్వాయర్ కట్టపై మీడియాతో మాట్లాడుతూ ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా ఎకరానికి రూ.50–60 లక్షల ధర ఉంటుందని పేర్కొన్న సీఎం కేసీఆర్.. ప్రాజెక్టు నిర్వాసితులకు రూ.15 లక్షల చొప్పున పరిహారం ఎట్లా ఇస్తారని నిలదీశారు. భూసేకరణ చట్టం ప్రకారం ఎకరానికి కోటిన్నర పరిహారం ఇవ్వాలన్నారు. -
ఇటీవలే పెళ్లి, అంతలోనే ..
సాక్షి, హోసూరు: ఇటీవలే పెళ్లయింది, కానీ అనారోగ్యంతో బాధపడుతూ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్న ఘటన బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు హోసూరు సమీపంలోని కూస్తనపల్లి గ్రామానికి చెందిన అశోక్ (38). ఇతనికి గత ఏడు నెలల క్రితం పెళ్లి జరిగింది. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన అశోక్ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన బంధువులు అతన్ని చికిత్స కోసం హోసూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. (చదవండి: ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను వేధించిన ట్రాఫిక్ పోలీసులు.. సృహతప్పి పడిపోయిన భార్య..) -
ఏజెన్సీలకు రహదారుల నిర్వహణ బాధ్యతలు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ రహదారుల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనుంది. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ (సీఆర్ఎం) పేరుతో త్వరలోనే వీటికి టెండర్లు పిలవనుంది. నగర రోడ్ల దుస్థితిని మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కేటీఆర్ ఈ మేరకు వెల్లడించారు. మొత్తం 709 కిలోమీటర్ల రోడ్లను 7 యూనిట్లుగా విభజించి ఐదేళ్ల కాలానికి దీర్ఘకాలిక టెండర్లు పిలవనున్నారు. రోడ్ల నిర్వహణతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం, నిర్వహణ, క్లీనింగ్ అండ్ గ్రీనరీ పనులు కూడా కాంట్రాక్టు ఏజెన్సీనే నిర్వర్తించనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ రోడ్ల నిర్వహణ, రీకార్పెటింగ్, గుంతల పూడ్చివేత తదితర పనులకు వేర్వేరుగా టెండర్లు పిలుస్తోంది. ఒక్కో పనిని ఒక్కో ఏజెన్సీ చేస్తుండడంతో సమన్వయం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా దెబ్బతిన్న రోడ్ల గుర్తింపు, మరమ్మతులకు అంచనాల రూపకల్పన, టెండర్లు పిలవడం తదితర ప్రక్రియలకు ఎంతో సమయం పడుతోంది. సీఆర్‌ఎంతో ఈ ఇబ్బందులుండవు. అదే విధంగా ట్రాన్స్‌కో, జలమండలి, ప్రైవేట్ సంస్థలు, మాస్టర్ ప్లాన్ విస్తరణ తదితర అవసరాలకు రోడ్లు తవ్వేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీలే సహకరిస్తాయి. ఇందుకుగాను రోడ్ల కటింగ్‌లు అవసరమైన సంస్థలు తమ భవిష్యత్తు ప్రణాళికలను కనీసం 6 నెలల ముందుగానే తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా తవ్విన రోడ్లను వెంటనే పూడ్చి, తిరిగి యాథాతధ స్థితికి తెచ్చేందుకు ప్రస్తుతం వివిధ శాఖల మధ్యనున్న సమన్వయం లోపం, ఆలస్యం ఉండదు. ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యతల వల్ల పనులు నాణ్యతగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి టెండర్లను పిలవనున్న నేపథ్యంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా జోన్లలోని ప్రధాన రోడ్లను గుర్తించి సీఆర్ఎం కింద నిర్వహణకు టెండర్లు పిలవనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. రోడ్ల నిర్వహణతో పాటు ఇతర అంశాల్లోనూ ఉన్నత ప్రమాణాలు నిర్దేశించినట్లు మంత్రికి వివరించారు. కాంట్రాక్టు పొందిన ఏజెన్సీలు చేసే పనుల నాణ్యతపైనా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ంఎసీ కమిషనర్ లోకేశ్‌కూమార్, జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
నో గ్రాంట్..
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను పునః ప్రారంభించి రెండు నెలలు దాటినా నేటికీ ఈ ఏడాదికి సంబంధించి పాఠశాలల నిర్వహణకు నిధులను విడుదల చేయలేదు. గత ఏడాది ఖర్చు పెట్టకుండా ఉన్న రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తీసుకుంది. దీంతో పాఠాలు బోధించేందుకు సైతం చాక్‌పీస్‌లు లేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. నేటికీ అధిక శాతం పాఠశాలల్లో రిజిస్టర్లు నిర్వహించని పరిస్థితి. కొన్ని పాఠశాలల్లో విధిలేని పరిస్థితుల్లో ప్రధానోపాధ్యాయుల వేతనాల్లో నుంచి ఖర్చు చేస్తున్నారు. పాఠశాలల నిర్వహణకు ఎప్పుడో 2006లో ఇచ్చే గ్రాంట్లను నేటికీ ఇస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోని పాలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు(టౌన్): ప్రభుత్వ పాఠశాలల్లో రిజిష్టర్ల నిర్వహణకు, బోధన సామగ్రి కోసం ఖర్చు చేసేందుకు ఇప్పటివరకు నిధులు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 3,425 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిల్లో ప్రాథమిక 2,646, ప్రాథమికోన్నత 363, ఉన్నత 416 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 3,34,609 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రతి ఏటా విద్యా సంవత్సర ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ నిధులను విడుదల చేస్తుంది. ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి ఒక్కో స్కూల్‌కు రూ.5వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.12వేలు, ఉన్నత పాఠశాలలకు రూ.7వేల వంతున నిధులను కేటాయిస్తుంది. ఈ నిధులతో పాఠశాలల్లో చాక్‌పీస్‌లు, స్కేళ్లు, డస్టర్లు, రిజిస్టర్లు, కాగితాలు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగిస్తారు. ఇంతే మొత్తాన్ని గత 2006వ సంవత్సరం నుంచి విడుదల చేస్తున్నారు. అదే విధంగా స్కూల్ నిర్వహణా గ్రాంటు కింద మూడు తరగతి గదులు ఉన్న పాఠశాలకు రూ.5వేలు, అంతకంటే ఎక్కువ తరగతి గదులు ఉన్న పాఠశాలలకు రూ.10వేలు వంతున నిధులు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో మరుగుదొడ్ల, కుర్చీల రిపేర్లు, వాటర్‌పైపులు తదితర సమస్యల పరిష్కారం కోసం వినియోగించనున్నారు. దీంతో పాటు ప్రతి టీచర్‌కు రూ.5వేల చొప్పున నిధులును కేటాయించాల్సి ఉంది. వీటితో పాటు ప్రతి కాంప్లెక్స్‌కు రీసోర్స్ సెంటర్‌కు రూ. 22వేలు, మండల రీసోర్స్ సెంటర్‌కు రూ. 80వేలును కేటాయిస్తున్నారు. అయితే రెండేళ్లుగా టీచర్‌కు ఇచ్చే రూ.5వేల నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు ఏ మాత్రం సరిపోవడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. గ్రాంట్‌ను పెంచమని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రూ.10.80 కోట్ల నిధులు వెనక్కి ప్రతి ఏటా స్కూల్ గ్రాంట్ నిధులును ఆగస్టులోపు విడుదల చేయాల్సి ఉంది. గత ఏడాది కొన్ని పాఠశాలలకు అక్టోబర్, మరికొన్ని పాఠశాలలకు నవంబర్ నెలల్లో నిధులను విడుదల చేశారు. అయితే 2017–18కు సంబంధించి, అంతకంటే ముందు మిగిలి ఉన్న నిధుల్లో ఖర్చు చేయని రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పాఠశాలల నిర్వహణకు విడుదల చేసిన నిధులను సర్వశిక్ష అభియాన్ అధికారులు సకాలంలో ఖర్చు చేయడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాఠశాలల అవసరాలకు ఇచ్చే నిధులను ఇతర వాటికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రాంట్ నిధులు వెనక్కి పోవడంతో చాక్‌పీస్‌లు, రిజిష్టర్, తెల్ల కాగితాలు ఏవైనా కొనాలన్నా, పాఠశాలల్లో మరమ్మతులు నిర్వహించాలన్నా, చీపుర్లు సైతం కొనాలన్నా ప్రధానోపాధ్యాయుల జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరుగుదొడ్లు నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు.. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై విధి విధానాలను రూపొందించింది. త్వరలో దీనిపై ఉత్తర్వులు రానున్నట్లు సర్వశిక్ష అభియాన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి దాకా ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2015 విద్యా సంవత్సరం నుంచి నిధులు కేటాయిస్తుంది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే స్కావెంజర్లకు రూ.1500, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.2,500, ఉన్నత పాఠశాలల్లో రూ.4వేలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది నుంచి డీఆర్డీఏ ద్వార వేతనాలు అందజేసే వారు. ఈ విద్యా సంవత్సరం నుంచి డీఆర్డీఏ వేతనాలను నిలిపివేసింది. దీంతో సర్వశిక్ష అభియాన్, డీఆర్డీఏ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. మాకు సంబంధం లేదని ఎస్ఎస్ఏ అధికారులు చెబుతుంటే, తమకు సంబంధం లేదని డీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. నిధులు దారి మళ్లించడం దారుణం బడ్జెట్ ద్వారా మంజూరైన నిధులను వెనక్కి తీసుకోవడం, దారి మళ్లించడం చాలా దారుణం. ప్రభుత్వం చర్యలతో పాఠశాలల నిర్వహణ చాలా ఇ బ్బందిగా మారింది. ఉపాధ్యాయుల జేబుల్లో నుం చి డబ్బులు తీసి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్కావెంజర్స్‌కు జీతాలు ఇవ్వకపోవడంతో వాళ్లు రావడం లేదు. పాఠశాలల్లో నిర్వహణ సరి గాలేదని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం. –మోహన్‌దాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఏపీటీఎఫ్ ఈ ఏడాది నిధులు విడుదల కాలేదు పాఠశాలల నిర్వహణకు సంబంధించి ఇంకా నిధులు విడుదల కాలేదు. గత ఏడాది, అంతకు ముందు వివిధ పనులకు కేటాయించిన నిధులకు సంబంధించి ఖర్చు పెట్టకుండా మిగిలిన నిధులు రూ.10.80 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. పాఠశాలల నిర్వహణకు ఇబ్బందులు లేకుండా ఆయా హెచ్ఎంలు ఖర్చు పెడుతున్నారు. నిధులు వచ్చిన తరువాత వారికి తిరిగి ఇచ్చేస్తాం. –విశ్వనాథ్, ప్రాజెక్ట్ అధికారి, సర్వశిక్ష అభియాన్ -
కడుపు కొడుతున్నారు
ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టింది. పదిహేనేళ్లుగా దీన్నే నమ్ముకొని బతుకుతున్న నిర్వాహకుల కడుపు కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్రం నిధుల్లో కోత విధించడమే ఆలస్యం.. దానిని సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకువేసి ఈ పథకాన్ని ఏకంగా ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేంద్రం 90శాతం, రాష్ట్రం 10శాతం నిధులు నిధులు కేటాయిస్తూ వచ్చింది. ప్రస్తుతం కేంద్రం 60శాతం నిధులు ఇస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేట్ ఏజెన్సీల పరం చేసేసింది. ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలను ఒక క్లస్టర్‌గా చేసి ఢిల్లీకి చెందిన ఏక్తా శక్తి ఏజెన్సీకి మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. 20 కిలోమీటర్ల దూరంలో వంటశాలను ఏర్పాటుచేసి ఒకేసారి 25వేల మంది విద్యార్థులకు ఆహారం వండి ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏక్తా శక్తి ఏజెన్సీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2003 నుంచి అమలు.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని 2003లో సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ పథకం అమలు ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు వీలవుతుందని çసుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలను అప్పగించాడు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డ్వాక్రా మహిళలను మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా మార్చేశారు. ప్రకాశం జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని డ్వాక్రా మహిళలే నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి మధ్యాహ్న భోజనం వడ్డించి పెట్టినందుకు రూ.1.25 చొప్పున ఇస్తూ వచ్చారు. అయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో ఈ పథకం నిర్వహణ తమవల్ల కాదంటూ నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో ఒక్కో విద్యార్థికి రూ.3.25 చొప్పున ప్రభుత్వం పెంచింది. తమకు వేతనాలు నిర్ణయించాలని ఉద్యమించడంతో 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1000 చొప్పున వేతనాన్ని నిర్ణయించింది. ప్రభుత్వం బియ్యం, కోడిగుడ్లు మాత్రమే నిర్వాహకులకు అందిస్తే కందిపప్పు, కూరగాయలు, పోపుదినుసులు, వంట గ్యాస్ ఇలా ప్రతిదీ నిర్వాహకులే కొనుగోలు చేయాల్సి ఉండటంతో మధ్యాహ్న భోజనం వారికి భారంగా మారింది. దానికితోడు గత ఏడాది నవంబర్ నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉండటం, ఈ ఏడాది మార్చి నుంచి నిర్వహణ బిల్లులు నిలిపివేసినా ప్రభుత్వం తమను గుర్తిస్తుందన్న ఆశతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించి వారిని సాగనంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నెలకు రూ,3వేలు ఖర్చవుతోంది: ఒంగోలులోని వెంకటేశ్వరకాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నెలకు రూ.3వేల ఖర్చవుతోంది. ప్రభుత్వం రూ.1000 గౌరవ వేతనం ఇస్తోంది. అది ఏమాత్రం చాలదు. ఒక్కో విద్యార్ధికి 3.25రూపాయల చొప్పున ఇస్తున్నా అది కూడా చాలడం లేదు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందని ఎదురు చూస్తున్న సమయంలో ఏజెన్సీకి అప్పగించింది.– మక్కెన మాణిక్యం -
టీటీడీ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో వివాదం నెలకొంది. వేంకటేశ్వర స్వామి పరకామణి లెక్కింపు బాధ్యతను ప్రైవేట్ పరం చేసేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది. అయితే టీటీడీ నిర్ణయంపై భక్తులు మండిపడుతున్నారు. పరకామణి సేవలో దేవస్థానం ఉద్యోగులు ఆసక్తి చూపకపోవడంతోనే దేవస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టీటీడీ ఉద్యోగులు పరకామణి లెక్కింపుకు ఆసక్తి చూపకపోవడంతో.. 2012లో దేవస్థానం భక్తుల కోసం పరకామణి సేవను ప్రారంభించింది. అప్పటి నుంచి కేవలం ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పదవీవిరమణ చేసిన ఉద్యోగులను పరకామణి సేవలకు టీటీడీ వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో పరకామణిని ప్రైవేటీకరణ చేయాలని దేవస్థానం అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంది. దీంతో భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ప్రైవేటు ఏజెన్సీల జోక్యం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పరకామణి సేవపై టీటీడీ నిర్ణయాన్ని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే అలిపిరి భద్రతను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారని, ఇపుడు పరకామణి సేవ కూడా ప్రైవేటు పరం చేయడం ఏంటని ప్రశ్నించారు. శ్రీవారి పరకామణి సేవలో పాల్గొనడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారని, అలాంటి వారిని పరకామణి సేవకు దూరం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే విధంగా టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
‘ఓఆర్ఆర్’ ప్రైవేటుకు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కాసుల వర్షం కురిపించనుంది. నిర్వహణ భారం తొలగడంతోపాటు ఇతర అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు ఆదాయ వనరవబోతోంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ) పద్ధతిన టెండర్ పిలిచి 20–30 ఏళ్ల పాటు టోల్ వసూళ్లు, నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తే ఆప్ ఫ్రంట్ ఫీజు రూపంలో రూ.2,000 కోట్లు–రూ.3,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని హెచ్ఎండీఏ భావిస్తోంది. టీవోటీ పద్ధతితో.. ప్రస్తుతం టోల్ వసూళ్లను చూసుకుంటున్న ఈగల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.. హెచ్ఎండీఏకు ప్రతి నెలా రూ.16.5 కోట్లు చెల్లిస్తోంది. ఓఆర్ఆర్ నిర్వహణను మాత్రం హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తోంది. కానీ రింగ్ రోడ్డు నిర్వహణ నగరాభివృద్ధి సంస్థకు తలనొప్పిగా మారింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మార్గం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నిర్వహణను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనాలతో పాటు సిబ్బందికి ప్రతి నెలా రూ.30 లక్షలు హెచ్ఎండీఏ చెల్లిస్తోంది. ఇతర అవసరాలకు రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) అనుసరిస్తున్న టీవోటీ పద్ధతితో ఏకకాలంలో భారీగా డబ్బులు రావడంతో పాటు నిర్వహణ భారమూ తొలగుతుందని హెచ్ఎండీఏ భావిస్తోంది. దీనిపై అధ్యయనానికి ట్రాన్సాక్షన్ అడ్వైజర్ (లావాదేవీల సలహాదారులు)లుగా లీ అసోసియేట్స్ సౌత్ ఆసియా, క్రిసిల్‌ను నియమించింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సదరు సంస్థలు నివేదిక సమర్పించనున్నాయి. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అనుమతి రాగానే ముందుకెళ్లాలని భావిస్తోంది. వైఎస్సార్ దూరదృష్టి.. వైఎస్సార్ హయాంలో రూ.6,696 కోట్లు వెచ్చించి 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారు. ఆయన దూరదృష్టితో నిర్మించిన ఎనిమిది లేన్ల ఓఆర్ఆర్.. ఇప్పుడు హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచింది. శివారు ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిగా మారింది. నగరంపై సగం ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించింది. తాజాగా అదే ఓఆర్ఆర్ ప్రస్తుత ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చబోతోంది. ఇలా మరెన్నో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు ఆదాయ వనరవబోతోంది. -
పొగబెట్టారు..
ఘొల్లు మంటున్న ఎండీఎం నిర్వాహకులు ♦ 15ఏళ్లగా సేవలు చేయించుకుని గెంటేయడమేనా? ♦ ‘మధ్యాహ్న భోజన పథకం’ నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడంపై నిర్వాహకుల గగ్గోలు ♦ విజయవాడలో 22న మహాధర్నా చేపట్టాలని నిర్ణయం సాక్షి గోపాలపట్నం(విశాఖపశ్చిమ): ప్రభుత్వం నెలల తరబడి బిల్లులు మంజూరు చేయకపోయినా పుస్తెలు తాకట్టు పెట్టి మరీ మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపిస్తూ వచ్చారు. మరి కొందరైతే ఇపుడు కాకపోతే ఎపుడైనా ప్రభుత్వం తమను చూడకపోతుందా? అని ఆశించి అప్పులు చేసి పిల్లలకు సమయానికే భోజనం పెట్టేవారు. ఇలా 15 ఏళ్లు సేవలందించిన నిర్వాహకులు ఇపుడు ప్రభుత్వానికి పనికి రారట. వీరిని గెంటేసి మరో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో అన్ని చోట్లా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఘొల్లుమంటున్నారు. జిల్లాలో 3800 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, జెడ్పీ హైస్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లు ఉండగా, 7338 మంది మధ్యాహ్న భోజన పథకం నిర్వా హకులున్నారు. 15ఏళ్లగా నిర్వాహణ బాధ్యతలను మహిళలే చూస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కో విద్యార్థికి రూ.6.18పైసల చొప్పున భోజన ఖర్చుగా ప్రభుత్వం చెల్లించేది. గతంలో వారానికి మూడు సార్లు గుడ్లు పెట్టాలని సూచిస్తూ రూ8.53 ఇచ్చినా అదీ తీసేసి మళ్లీ పాత విధానాన్నే (రూ.6.18) అమలు చేసింది. గత ఆగస్టు ఒకటి నుంచి నుంచి పది రోజుల పాటు కాంట్రాక్టర్‌కు గుడ్ల పంపిణీ ప్రక్రియను అప్పగించినా అదీ కొద్ది రోజులే నడిచింది. తర్వాత నుంచి విద్యార్థులకు గుడ్డు పంపిణీనే ఏకంగా ఆపేశారు. ఇపుడు ఏకంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులనే తీసేస్తే పోలా?..అన్నట్టు ప్రభుత్వం వ్యవహరించింది. వారి బాధ్యతలను రెండు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. దీంతో తమను కాదని ఏవో సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తే తామేమైపోవాలంటూ నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం (ఎండీఎం) నిర్వాహకులంతా ఈ నెల 22న విజయవాడలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలో వివిధ మండలాల నుంచి ఆ నిర్వాహకులు ధర్నాకు సన్నద్ధమవుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ప్రచారాలు ప్రారంభించారు. పుస్తెలు తాకట్టు పెట్టి మరీ నిర్వహించాం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా నెలల తరబడి బిల్లులు రాకపోయినా పుస్తెలు తాకట్టు పెట్టి మరీ విద్యార్థులకు భోజనం పెట్టాం. నిత్యావసర ధరలు పెరిగినా, ప్రభుత్వం గ్యాస్, వంట పాత్రలు ఇవ్వకపోయినా భరించాం. అయినా ప్రభుత్వానికి కనికరం లేదా?. – చినతల్లి, ఎండీఎం నిర్వాహకురాలు, -గోపాలపట్నం బాలికల జెడ్పీ హైస్కూల్ -
ఎత్తిపోతల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకే!
• నీటిపారుదల శాఖ • సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నీటిపారుదల శాఖ సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. నిర్వహణ గడు వును పొడిగించేందుకు కాంట్రాక్టు ఏజెన్సీలు విముఖత చూపడం, బాధ్యత తీసుకునేం దుకు జెన్కో ముందుకు రాకపోవడంతో ప్రైవేటు మార్గమే సరైందనే భావనకు వచ్చిం ది. మే లోగా టెండర్ల ద్వారా నిర్వహణను అప్పగించేలా ప్రణాళిక వేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 19ఎత్తిపోతల పథకాలు కొనసాగు తున్నాయి. ఇందులో 12 పూర్తవగా, ఇప్ప టివరకు వీటి బాధ్యతను ఏజెన్సీలు చూస్తు న్నాయి. కాంట్రాక్టు సంస్థలు ఆ పథకాలు అమల్లోకి వచ్చిన మూడేళ్లు వాటి నిర్వహణ బాధ్యత చూసుకోవాలి. మొత్తం ప్రాజెక్టు క్యాపిటల్ కాస్ట్లో ఒక శాతం కాంట్రాక్టు సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే గడువు ముగిశాక నిర్వహణ ఎలా అని దానిపై ఆలోచించిన ప్రభుత్వం.. మరో రెండేళ్లు వాటి నిర్వహణ చూడాలని కాంట్రా క్టర్లను కోరింది. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నిర్వహణ చూస్తున్న జెన్కోకు చెల్లిస్తున్న మాదిరే తమకూ క్యాపిటల్ కాస్ట్‌పై 1.5 శాతం మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఇందుకు సానుకూలంగా లేని ప్రభుత్వం... నిర్వహణ బాధ్యతలను చూడా లని జెన్కోను సంప్రదించింది. అయితే సరిపడనంత సిబ్బంది లేనందున ఈ ప్రక్రియపై జెన్కో వెనుకడుగు వేసింది. దీంతో ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థల గడువు ముగిసిన 12 ఎత్తిపోతల పథకాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు నీటిపారుదల శాఖ అధికారులతో శనివారం సచివాయంలో సమీక్షించారు. ప్రైవేటు ఏజె న్సీలకే నిర్వహణ అప్పగించాలని సమావేశం లో నిర్ణయించారు. వీలైనంత త్వరగా టెం డర్ల ప్రక్రియపై మార్గదర్శకాలు రూపొందిం చి చీఫ్ ఇంజనీర్లకు పంపాలని సమావేశంలో నిర్ణయించాయి. -
డ్రోన్‌తో భూ సర్వే
♦ ఫార్మాసిటీ భూముల్లో సర్వే ముమ్మరం ♦ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే ♦ హద్దులను గుర్తిస్తున్న టీఎస్‌ఐఐసీఓ ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం కందుకూరు, యాచారం మండలాల్లో తీసుకోవడానికి నిర్ణయించిన 10 వేల ఎకరాల్లో టీఎస్ఐఐసీ సంస్థ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే చేయిస్తోంది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసుకున్న కందుకూరు - యాచారం మండలాల్లోని ముచ్చర్ల, మీరాఖాన్‌పేట, పంజగూడ, కుర్మిద్ద తదితర గ్రామాల్లో సర్వే పూర్తి చేసిన ఏజెన్సీ ప్రతినిధులు గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 తదితర సర్వే నంబర్లల్లో సర్వే చేశారు. రిమోట్‌తో డ్రోన్ (చిన్న విమానం) ను భూములపైకి పంపించి ఆ భూముల్లో రాళ్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, అటవీశాఖ భూములను సర్వే చేశారు. యాచారం : ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం తీసుకోవా లనుకున్న భూముల్లో టీఎస్‌ఐఐసీఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా డ్రోన్ సర్వే చేయిస్తోంది. కందుకూరు - యాచారం మండలాల్లోని పలు గ్రామాల్లో 10 వేల ఎకరాలకు పైగా అసైన్డ్, పట్టా భూములను తీసుకున్న టీఎస్‌ఐఐసీఓ.. ఇప్పటికే రెండు వేల ఎకరాలకు పైగా అర్హులైన రైతులకు పరిహారం చెక్కులను కూడా పంపిణీ చేసింది. తాజాగా మిగిలిన భూముల్లో సాంకేతిక పరంగా సర్వేలు చేయిస్తోంది. ఇప్పటికే కందుకూరు - యాచారం మండలాల్లోని ముచ్చర్ల, మీరాఖాన్‌పేట, పంజగూడ, కుర్మిద్ద తదితర గ్రామాల్లో ఏజెన్సీ ప్రతినిధులు సర్వే పూర్తి చేశారు. గురువారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని 184, 213, 247 తదితర సర్వే నంబర్లలో రిమోట్ సాయంతో డోన్ (చిన్న విమానం)ను ఉపరితలంపైకి పంపించి ఆ భూముల్లో రాళ్లు, గుట్టలు, చెరువులు, కుంటలు, అటవీశాఖ భూములను సర్వే చేయించారు. డ్రోన్ ప్రతిసారి రెండు కిలోమీటర్లకు పైగా దూరం వెళ్లీ ఆ భూముల హద్దులను తన కెమెరాలో రికార్డు చేసింది. సాంకేతిక సిబ్బంది డ్రోన్ తిరుగుతున్న ప్రదేశాన్ని ల్యాప్‌టాప్‌ల్లో చూస్తూ రికార్డు చేశారు. ఇదే విషయమై టీఎస్‌ఐఐసీఓ ప్రతినిధి పద్మజను సంప్రదించగా ఫార్మాసిటీ కోసం తీసుకోనున్న భూ ముల్లో అటవీ భూముల హద్దులు, అసైన్డ్, పట్టా భూముల హద్దులు తెలుసుకోవడానికి ఈ సర్వే చేయిస్తున్నట్లు ఆమె తెలిపారు. -
రోడ్ల నిర్వహణ ప్రైవేటుకు వద్దు: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రోడ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించొద్దని ప్రభుత్వాన్ని సీపీఎం డిమాండ్ చేసింది. ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు అవసరమైతే చట్టాల్లో మా ర్పులు తెస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొనడాన్ని ఖండించింది. రోడ్ల నిర్వహణలో అనుభవమున్న పీడబ్ల్యూడీ, ఆర్ అండ్‌బీ ఇంజనీర్లు, నిపుణులు ఉండగా ప్రైవేటు సంస్థలపై ఆధారపడటం రాష్ట్రానికి నష్టమని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసమగ్ర అభివృద్ధికి దారితీసిన పాతికేళ్ల ప్రైవేటీకరణ విధానాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరిస్తే బహుళజాతి కంపెనీలకు రాష్ర్ట సంపదను దోచిపెట్టడమే అవుతుందన్నారు. అందువల్ల ప్రమాదకరమైన ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజలపై పడబోయే భారాలను దృష్టిలో పెట్టుకుని రాజధా ని రోడ ్ల నిర్మాణంలో ప్రైవేటు ఏజెన్సీల భాగస్వామ్యాన్ని ఇంజనీర్లు, ఉద్యోగులు వ్యతిరేకించాలన్నారు. -
ప్రజలపై విద్యుత్ బిల్లుల పిడుగు!
షాక్ కొడుతున్న కరెంటు బిల్లులు బిల్లింగ్ ఏజెన్సీల నిర్లక్ష్యం రెండు బల్బులు వాడే వారికి వేలల్లో బిల్లు లబోదిబోమంటున్న వినియోగదారులు పలమనేరు: గంగవరం మండలం డ్రైవ ర్స్ కాలనీకి చెందిన సావిత్రమ్మ ఇంట్లో రెండు బల్బులు మాత్రమే వాడుతోంది. ఆమెకు ప్రతినెలా కరెంటు బిల్లు రూ.120 దాకా వచ్చేది. ఈనెలకు సంబంధించి ఆమె పూర్వపు రీడింగ్ 2,732 కాగా, ప్రస్తుత రీడింగ్ 2750గా ఉంది. ఆ లెక్కన ఆమె 18 యూనిట్లు వాడినట్టు. కానీ బిల్లు మాత్రం రూ.6,741గా వచ్చింది. ఈ బిల్లును తీసుకొని ఆమె ట్రాన్స్‌కో కార్యాలయానికి వెళితే మొత్తం చెల్లించాల్సిందేనని అధికారులు చెప్పారు. అంత డబ్బు ఎలా కట్టేదని బాధితురాలు వాపోతోంది. ఈ ఒక్క కాలనీలోనే దాదా పు వందమందికి అధిక మొత్తంలో బిల్లులొచ్చాయి. ఇలాంటి కేసులు జిల్లాలో వేలల్లోనే ఉన్నాయి. మూడు నెలలుగా జిల్లాలో కరెంటు బిల్లులు వినియోగదారులకు షాక్ కొడుతున్నాయి. ప్రతినెలా ఇళ్ల వద్ద మీటర్ రీడింగ్ తీసుకొనే బిల్లింగ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వినియోగదారులతో ఆడుకుంటున్నాయి. రెండు బల్బులు మాత్రమే వాడుకునే వారికి సైతం వీరి నిర్లక్ష్యం కారణంగా వేలల్లో బిల్లులొస్తున్నాయి. జిల్లాలోని ఏడు డివి జన్లలో 12 లక్షల దాకా డొమెస్టిక్ మీటర్లున్నాయి. ఇందుకు సంబంధించి బిల్లింగ్ ప్రక్రియను పలు ప్రైవేటు ఏజెన్సీలు చేపడుతున్నాయి. వీరికి ట్రాన్స్‌కో పట్టణాల్లో రూ.1.75 పైస లు, పల్లెల్లో రూ.2.40 పైసల లెక్కన ఒక్కో మీటర్ రీడింగ్‌కు అందిస్తోంది. పట్టణాల్లో గృహ సర్వీసులకు ప్రతినెలా, పల్లెల్లో రెండు నెలలకోసారి రీడింగ్ (బైమంత్ బిల్లింగ్) తీస్తున్నారు. ఏజెన్సీల నిర్లక్ష్యంతో ప్రతినెలా రూ.3 నుంచి రూ.5 కోట్ల దాకా అదనపు భారం వినియోగదారులపై పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఏజెన్సీల నిర్లక్ష్యమే కారణం.. ప్రతి ఇంటి వద్దకూ వెళ్లి పూర్వపు రీడింగ్, ప్రస్తుత రీడింగ్‌ను కచ్చితంగా నమోదు చేయాల్సిన ఏజెన్సీ వ్యక్తులు పలుచోట్ల అందుకు విరుద్ధంగా చేస్తున్నారు. డోర్‌లాక్ అయిన ఇళ్లలో రీడింగ్ చూడకుండానే ఇష్టానుసారంగా రీడింగ్ వేస్తున్నట్లు విమర్శలున్నాయి. -
జీతాలో రామచంద్రా..
= విమ్స్ కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బందికి నాలుగు నెలలుగా అందని వేతనాలు = పట్టించుకోని యంత్రాంగం సాక్షి, బళ్లారి : పేరుకు పెద్దాస్పత్రి అయినప్పటికీ దిన కూలీలకు జీతాలు ఇవ్వని దుస్థితిలో విమ్స్ అధికారులు ఉన్నారు. నాలుగు నెలలుగా వేతనాలు అందక కూలీలు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వెయ్యి పడకలతో కర్ణాటకలోనే పెద్దాసుపత్రిగా పేరుగాంచిన విమ్స్‌కు బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి రోజు వేలాది మంది రోగులు ఇక్కడకు వచ్చి చికిత్సలు చేయించుకుంటారు. ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. ఈ ఏజెన్సీ కింద దాదాపు 150 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిలో కొందరికి రూ.3వేలు, మరికొందరికి రూ.4,500 వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. పడకల వద్దనుంచి మరుగుదొడ్ల వరకూ శుభ్రం చేస్తూ ఆస్పత్రిని అద్దంలా చేస్తుంటారు. వీరందరూ ఒక్క రోజు విధులకు హాజరు కాకుంటే ఆస్పత్రి బందలదొడ్డే. అంతటి ప్రాధాన్యం ఉన్న పారిశుద్ధ్య కార్మికులపట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చేది అరకొర జీతాలే. అయితే ఆ వేతనాలను నెలనెల సక్రమంగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం నాలుగు నెలలుగా జీతాలు అందక కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. కూరగాయలనుంచి బియ్యం, నూనె వరకు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితుల్లో వీరికి విమ్స్ యంత్రాంగం వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో గత్యంతరం లేక కార్మికులు బుతకుబండిని లాగించేందుకు అప్పులు సైతం చేస్తున్నారు. అయినప్పటికీ విమ్స్ యంత్రాంగం కరుణించలేదు. దుర్వాసనను ఓర్చుకుంటూ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి ఆస్పత్రిని శుభ్రం చేస్తుంటే వేతనాలు ఇవ్వకుండా ఆస్పత్రి అధికారులు మొండికేస్తున్నారని కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రోగులు ఎక్కడ ఇబ్బందులు పడుతారోనని వేతనాలు అందకపోయినా పస్తులుంటూ విధులకు హాజరవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలకు నిధులు అందక వేతనాలు ఇవ్వడంలేదని పేరు చెప్పలేని ఓ దినకూలీ పేర్కొన్నాడు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విమ్స్‌లో పని చేసే దినకూలీ కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
భూ పందేరంపై కొరడా!
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి...రూ.160 కోట్ల విలువైన స్థలం ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. గుట్టుగా సాగిన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ శ్రీధర్... బాధ్యుడైన రాజేంద్రనగర్ ఆర్డీఓ నాగేందర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి...శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం నవ్‌ఖల్సా సర్వేనంబర్ 66లోని ప్రభుత్వ భూమిలో 8 ఎకరాలను ఓ ప్రైవేట్ వ్యక్తికి కౌలుదారు హక్కుచట్టం(38ఈ) కింద ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టారు. 2011లో కౌలుదారులకు అనుకూలంగా అప్పటి తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ఆర్డీఓ నాగేందర్ సమర్థిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన పక్షం రోజుల్లోనే ఈ ఫైలుకు మోక్షం కల్పించినట్లు విచారణలో తేలింది. కాగా ఇటీవల తనిఖీల్లో భాగంగా సదరు భూమిని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఈ అవినీతి బాగోతాన్ని వెలికి తీశారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందిపోయి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఆర్డీఓ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన సీరియస్‌గా పరిగణించారు. ప్రైవేట్ వ్యక్తులకు విలువైన భూమిని కట్టబెట్టినట్లు కలెక్టర్ సోమవారం ఆర్డీఓ నాగేందర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అలాగే అప్పటి తహశీల్దార్ పద్మశ్రీపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ లేఖరాశారు. అలాగే అప్పటి స్థానిక సర్వేయర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. -
ఢిల్లీలో గూఢచారులకు యమక్రేజ్
ఎన్నికల ముందు రాజకీయ’ గూఢచర్యం కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న నేతలు దీంతో డిటెక్టివ్ నారదలకు చేతి నిండా పని.. జేబు నిండా డబ్బు న్యూఢిల్లీ: ఇందు గలదు అందు లేదని సందేహం వలదు. ఎందెందు చూసినా అందందే గూఢచారి అవసరం ఉండు. ఇప్పుడు ఢిల్లీలో ప్రైవేటు గూఢచారులకు యమ క్రేజ్ వచ్చింది. అక్కడి రాజకీయ నాయకుల వల్లే ఇదంతా. త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలోనే టికెట్ కోసం పోటీపడే ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచడానికి నాయకులు గూఢచారుల్ని ఆశ్రయిస్తున్నారు. టికెట్ సాధనలో ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఇదంతా చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉంటే 1,600 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, వెయ్యికి పైగా బీజేపీ అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఇంతమంది పోటీలో ఉండడంతో టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి. దీంతో పార్టీలోని ప్రత్యర్థుల ఎత్తులు తెలుసుకోవడానికి టికెట్లు ఆశించే వాళ్లు గూఢచారులను ఆశ్రయిస్తున్నారు. మరోపక్క అభ్యర్థుల సత్తాను తెలుసుకోవడానికి, టికెట్ దక్కనివాళ్లు ఎలాంటి చర్యలకు దిగుతారనే అంచనా వేయడానికి రాజకీయ పార్టీలు కూడా గూఢచారులనే నియమిస్తున్నాయి. దీంతో డిటెక్టివ్ నారదలకు చేతినిండా పని, జేబు నిండా డబ్బు. నియోజకవర్గాన్ని, పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి డిటెక్టివ్ ఏజెన్సీలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తం రూ. 5 లక్షలు దాటే ఉంటుం దని సమాచారం. ఢిల్లీలో 150 డిటెక్టివ్ ఏజెన్సీలు ఉండగా.. వాటిలో 13 మాత్రం రాజకీయ గూఢచర్యంలో నైపుణ్యం ఉన్న వి. ‘ఇప్పటికే మా చేతినిండా పని ఉంది. ఇకపై వచ్చే వాళ్లని తిప్పి పంపేస్తున్నాం’ అని జీడీఎక్స్ ఏజెన్సీ ఎండీ మహేశ్ చంద్ర శర్మ తెలిపారు. ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలపై గూఢచర్యం సాధారణమేనని, అయితే పార్టీలోని ప్రత్యర్థుల టికెట్ చాన్స్‌లు తెలుసుకోండంటూ అభ్యర్థులు కోరడం కొత్త ట్రెండ్ అని చెప్పా రు. టికెట్ రాని అభ్యర్థి పార్టీలోని తన ప్రత్యర్థులను ఎన్నికల్లో దెబ్బకొట్టడానికి కూడా గూఢచారుల్ని నియమించుకుంటున్నారని ఏపీడీ ఏజెన్సీ చైర్మన్ విక్రం సింగ్ చెప్పారు. -
దుకాణం మూసుకోండి..
అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అనంతపురంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ పనితీరు వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. సిలిండర్లు సక్రమంగా పంపిణీ చేయడం చేతకాకపోతే కార్యాలయాన్ని మూసివేసి ప్రైవేట్ ఏజెన్సీలకు బదలాయించాలని అనంతపురంలోని సివిల్ సప్లై హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు మండిపడుతున్నారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్న అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రైవేట్ ఏజెన్సీలు సిలిండర్లను సక్రమంగా పంపిణీ చేస్తున్నప్పుడు.. మీరెందుకు పంపిణీ చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి అవినీతికి నిలయమైన ఈ ఏజెన్సీలో ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయం లేదని, వినియోగదారుల సమస్యలను పరిష్కరించాల్సిన వీరు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమె పేరు అంజినమ్మ. జనశక్తినగర్‌లో నివాసం ఉంటోంది. సివిల్సప్లై హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. సెప్టెంబర్ 16వ తేదీ సిలిండర్ కోసం బుక్ చేసింది. మూడు రోజుల్లో అందాల్సిన రీఫిల్ (సిలిండర్) నెల రోజులైనా అందకపోవడంతో గ్యాస్ ఆఫీస్‌కు వచ్చి ఆరా తీసింది. మీ సిలిండర్ రద్దయింది. మళ్లీ బుక్ చేసుకోమని సలహా ఇచ్చారు. దీంతో చేసేది లేక మళ్లీ ఈ నెల 15న బుక్ చేసింది. 29న గ్యాస్ ఆఫీస్‌కు వచ్చి గ్యాస్ ఎప్పుడు వస్తుందని ఆరా తీయగా ఇంకో వారం రోజులు పడుతుందని సిబ్బంది చెప్పారు. బుద్ధి లేక ఇక్కడ కనెక్షన్ తీసుకున్నామని, అటోలో రాను పోనూ రూ.60 ఖర్చయిందని, మా ఖర్మ ఇలా కాలిందని తిట్టుకుంటూ ఇంటి ముఖం పట్టింది. వినాయక్నగర్కి చెందిన జిలాన్‌బాషాకు ఇక్కడే కనెక్షన్ ఉంది. సెప్టెంబర్ 21వ తేదీ రీఫిల్ కోసం బుక్ చేసుకున్నాడు. పది రోజుల అనంతరం గ్యాస్ కార్యాలయానికి వచ్చి ఆరా తీయగా మీ రీఫిల్ సిలిండర్ బుకింగ్ రద్దు అయింది. మళ్లీ బుక్ చేసుకోమని సిబ్బంది చెప్పారు. మళ్లీ ఈ నెల 18న బుక్ చేశాడు. సిలిండర్ ఇంకా రాకపోవడంతో 29న (మంగళవారం) గ్యాస్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆరా తీయగా నాలుగైదు రోజులు పడుతుందని సమాధానం చెప్పారు. బుకింగ్ రద్దు అయిన విషయం ఆఫీసుకు వచ్చి అడిగితే తప్ప చెప్పడంలేదని వాపోయాడు. ఇది.. అంజనమ్మ, జిలాన్బాషాలకే పరిమితమైన ఆవేదన కాదు. అత్యంత అత్యవసరమైన సిలిండర్ల కోసం ప్రతి రోజు గ్యాస్ ఆఫీసుకు వస్తున్న వందలాది వినియోగదారుల నిస్సహాయ ఘోష.. ఎవరు బాధ్యులు.. సిలిండర్ల సమాచారం కోసం వెళ్లిన వినియోగదారులకు ఆఫీసులో సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. సిలిండర్ల బుకింగ్ రద్దు చేసినప్పుడు సమాచారం ఎందుకు తెలియజేయలేదని ఓ వినియోగదారుడు అడిగితే.. ‘మమ్మల్ని అడిగితే మేమేం చెబుతాం..? ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రద్దు చేశాం.. వెళ్లి జేసీని అడగండి.. డీఎస్ఓను అడగండి..’ అని చీదరించుకుంటున్నారు. అంటే ఆఫీసుకు వచ్చిన ప్రతి వినియోగదారుడు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం సాధ్యమమేనా? వినియోగదారులు సివిల్సప్లై హెచ్‌పీ గ్యాస్ అంటేనే హడలెత్తిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారు. అంతా కనికట్టు సివిల్సప్లై ఆఫీసులో బుక్ చేసుకున్న వినియోగదారులను మాయ చేస్తున్నారు. రీఫిల్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారుల సెల్‌కు మీ సిలిండర్ డెలివరీ అయిందని మెసేజ్ వస్తుంది. కాని సిలిండర్ మాత్రం డెలివరీ అయి ఉండదు. కంగుతున్న వినియోగదారులు సదరు కార్యాలయం వద్దకు వెళ్లి ఆరా తీస్తే ఆ తేదీ వరకు బిల్స్ క్లియర్ అయినట్లు అర్థం అని చెప్పి పంపుతున్నారు. బిల్స్ క్లియర్ అయి 20 రోజులు దాటినా సిలిండర్ మాత్రం అందడం లేదు. ఇలాంటి మెసేజ్‌లతో అంతా కనికట్టు చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. పెండింగ్‌లో 5 వేల గ్యాస్ సిలిండర్లు సివిల్సప్లై కార్యాలయ పరిధిలో 19 వేల గ్యాస్ కనెక్షన్లున్నాయి. సిలిండర్ డెలివరికి నెలల తరబడి సమయం తీసుకుంటుండటంతో బ్యాక్లాగ్ సంఖ్య పెరిగిపోతోంది. గతంలో దసరా పండుగ ముందు ఇలాంటి వాటికి ప్రత్యేక డ్రైవ్ పెట్టి పంపిణీ చేసినా అప్పుడు బుక్ చేసుకున్న వందలాది వినియోగదారులకు నేటికీ అందని పరిస్థితి నెలకొంది. ఈ నెల 11 వరకు బిల్స్ తీసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో పక్క బ్యాక్లాగ్ సిలిండర్ల సంఖ్య భారీగా పేరుకుపోయింది. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మంది సిలిండర్ల కోసం వేచి చూస్తున్నారు. దృష్టి సారించని జిల్లా ఉన్నతాధికారులు సివిల్సప్లై హెచ్‌పీ కార్యాలయంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో సిలిండర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సిలిండర్ రవాణాకు తక్కువ ధరకే టెండర్ దక్కించుకుని ఇలా పక్కదారి పట్టిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీని చూసి అయినా.. నగరంలో హెచ్‌పీ గ్యాస్‌కు సంబంధించిన ప్రైవేట్ ఏజెన్సీ ఒకటుంది. ఆ ఏజెన్సీ నిర్వాహకులు.. బుక్ చేసిన వారం రోజుల్లోగానే సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. సివిల్ సప్లై వారి ఏజెన్సీలో మాత్రం నెలల కొద్ది సిలిండర్లు పంపిణీ చేయలేకపోతున్నారు. ఒకే కంపెనీ పరిధిలోని రెండు ఏజెన్సీల్లో ఇంత తేడా ఎందుకు వస్తుందో సివిల్ సప్లై అధికారులకే తెలియాలని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. లారీల ఆలస్యమే కారణం.. సిలిండర్ల లారీలు రావడం ఆలస్యం కావడంతోనే పంపిణీ ఆలస్యమవుతుందని సివిల్ సప్లై హెచ్‌పీ గ్యాస్ పర్యవేక్షణాధికారి గురుప్రసాద్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రోజుకొక లారీ చొప్పున రావాల్సిన లోడ్ ఆరు రోజులుగా రాలేదన్నారు. సెప్టెంబర్‌లో బుక్ చేసుకున్నవారందరూ మళ్లీ బుక్ చేసుకోవాలని సూచించాం. బుక్ చేసుకున్న వారందరికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
నేడు పర్యాటకభవన్ హోటల్‌ను ప్రారంభించనున్న ఏపీటీడీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్మించిన మూడు నక్షత్రాల హోటల్ ఎట్టకేలకు పర్యాటక శాఖ చేతికి వచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున కీలక ప్రాంతంలో ఉన్నప్పటికీ దీని నిర్వహణలో ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా చేయటంతో హోటల్‌ను సొంతంగా నిర్వహించేందుకు పర్యాటకశాఖ నిర్ణయించింది. ప్రపంచ పర్యాటక దినోత్సం సందర్భంగా శుక్రవారం దీన్ని తిరిగి ప్రారంభిస్తోంది. బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్ ప్రాంతంలో ఉన్న ఈ త్రీస్టార్ హోటల్‌ను 2007లో ప్రముఖ హోటల్ గ్రూపు ఖత్రియా లీజుకు తీసుకుంది. కానీ లాభాలు రావటం లేదంటూ అనతికాలంలోనే వైదొలిగింది. నిర్వహణ సమయంలో ఆ సంస్థ సరిగా వ్యవహరించటం లేదని పేర్కొంటూ వచ్చిన పర్యాటక శాఖ, తనకు ఆ సంస్థ కోట్ల రూపాయలు బకాయిపడిందని పేర్కొంటూ కోర్టుకెక్కింది. ఏడాదిపాటు ఖాళీగా ఉన్న తర్వాత 2011లో అమోగ్ గ్రూపు ముందుకురావటంతో 15 ఏళ్లు లీజుకిచ్చింది. కానీ ఆ సంస్థ ఒప్పందం మేరకు తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని జమకట్టడంలేదని పర్యాటకాభివృద్ధి సంస్థ లీజు ఒప్పందాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకుంది. ఇప్పుడు రోజువారీ నిర్వహణ లేకపోవడంతో హోటల్లో ఎక్కడికక్కడ దుమ్ముపేరుకుపోయింది. చివరికి మెరుగ్గా నిర్వహించే ప్రైవేటు సంస్థలు రావని తేల్చుకున్న పర్యాటకాభివృద్ధి సంస్థ.. కనీసం భవనం నిర్వహణకు సరిపడా మొత్తాన్నయినా సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో సొంతంగానే హోటల్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. హోటల్ నిర్వహణకు ఓ విశ్రాంత అధికారిని నియమించింది. 84 గదులున్న ఈ హోటల్లో అవసరమైన సిబ్బందిని నియమించే పని ప్రారంభించింది. ప్రైవేటు సంస్థ నిర్వహణ సమయంలో పనిచేసిన సిబ్బందికి మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహించి వారినే తిరిగి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. -
రూ.30 లక్షలతో డ్రైవర్ పరార్
నాగోలు, న్యూస్‌లైన్: ఏటీఎం కేంద్రా ల్లో జమ చేయాల్సిన రూ.30 లక్షల నగదుతో ఓ డ్రైవర్ ఉడాయించాడు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌లో లాగి క్యాష్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వివిధ ఏటీఎంలలో నగదు జమ చేస్తారు. నేరేడ్మెట్లో ఉండే నల్లగొం డ జిల్లా వాసి ఎల్క సత్యనారాయణ తన క్వాలిస్ (ఏపీ 29 ఈ 2988)ను లాగి ఏజెన్సీకు అద్దెకివ్వడమే కాకుండా డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ ఇండియన్ బ్యాంకులో రూ.60 లక్షలు డ్రా చేసుకొని ఏటీఎంలలో డబ్బు జ మ చేసే టెక్నీషియన్స్ రామ్‌కుమార్, వినయ్, సెక్యూరిటీ గార్డు ఖాసీం వలి (రిటైర్డ్ సీఆర్పీఎఫ్ జవాన్)తో క్వాలిస్ లో బయల్దేరారు. అత్తాపూర్, అశోక్‌నగర్, చౌటుప్పల్ ఏటీఎంలలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. కడ్తాల్‌లోని ఇండియన్ బ్యాంకులో రూ.20 లక్షలు డ్రా చేసి, అక్కడే ఉన్న ఏటీఎంలో జమ చేశారు. కర్మన్‌ఘాట్ గాయత్రినగర్, ఈసీఐఎల్, సైదాబాద్‌లలోని ఏటీఎంలలో రూ.10 లక్షల చొప్పున జమ చేయాల్సి ఉంది. అయితే, కర్మన్‌ఘాట్‌కు వచ్చేసరికి రాత్రి అయింది. దీంతో సత్యనారాయణ బైరామల్‌గూ డ మాధవనగర్‌లో ఉండే తన స్నేహితుడు శ్రీనివాస్‌కు ఫోన్ చేసి భోజనానికి ఇంటికి వస్తున్నామని తెలిపాడు. మధ్యలో బిర్యానీ తీసుకొన్నారు. ఇం టి ముందు కారును పార్క్ చేసి, రెం డో ఫ్లోర్లో ఉన్న శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. బిర్యా నీ తిన్నాక, సిగరెట్ తాగి వస్తానని కిందకు దిగిన సత్యనారాయణ క్వాలి స్తో సహా పరారయ్యాడు. కొంతసేపటి తర్వా త కిందకు దిగిన సిబ్బందికి వాహనం కనిపించక పోవడంతో సత్యనారాయణకు ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో బ్యాంకు మేనేజర్‌కు సమాచారమిచ్చిన సిబ్బంది.. వనస్థలిపురం ఠా ణాలో ఫిర్యాదు చేశారు. తమ పరిధిలోకి రాదని వారు చెప్పడంతో శనివా రం రాత్రి ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యా దు చేశారు. కేసు నమోదు చేసిన పోలీ సులు సిబ్బంది రామ్‌కుమార్, వినయ్, ఖాసీంవలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
మధ్యాహ్న భోజనంతో మినరల్ వాటర్
సాక్షి, సిటీబ్యూరో : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు మినరల్ వాటర్ బాటిళ్లను అందించే అవకాశాలను పరిశీలించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై టాస్క్‌ఫోర్స్ సభ్యులతో గురువారం కలెక్టరేట్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మీనా మాట్లాడుతూ.. పాఠశాలలకు నాంది ఫౌండేషన్ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం రుచి, నాణ్యత, పరిమాణం.. తదితర అంశాలను ప్రతిరోజూ పర్యవేక్షించే బాధ్యతను ప్రత్యేకంగా ఒక టీచర్‌కు అప్పగించాలని డీఈవోకు సూచించారు. ప్రైవేటు ఏజెన్సీకి నాణ్యత పరిశీలన ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తోన్న ఆహారం, మంచినీటి నాణ్యతను పరిశీలించేందుకు అవసరమైన శాంపిల్స్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, మెట్రోవాటర్ వర్క్స్ సంస్థలకు పంపాలని కలెక్టర్ సూచించారు. అవసరమైతే ఈ బాధ్యతలను ప్రైవేటు ఏజన్సీకి అప్పగించే ప్రతిపాదనను పరిశీలించాలన్నారు. మధ్యాహ్న భోజనం అమలు తీరుపై సోషల్ ఆడిట్(సామాజిక సర్వే) బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి ప్రజల స్పందనను తెలుసుకోవాలని కలెక్టర్ మీనా డీఈవోకు సూచించారు. సమావేశంలో ఆర్వీఎం పీవో సుబ్బరాయుడు, డీఈవో సుబ్బారెడ్డి, ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ, జలమండలి అధికారులు పాల్గొన్నారు.