ఢిల్లీలో గూఢచారులకు యమక్రేజ్
ఎన్నికల ముందు రాజకీయ’ గూఢచర్యం
కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్న నేతలు
దీంతో డిటెక్టివ్ నారదలకు చేతి నిండా పని.. జేబు నిండా డబ్బు
న్యూఢిల్లీ: ఇందు గలదు అందు లేదని సందేహం వలదు. ఎందెందు చూసినా అందందే గూఢచారి అవసరం ఉండు. ఇప్పుడు ఢిల్లీలో ప్రైవేటు గూఢచారులకు యమ క్రేజ్ వచ్చింది. అక్కడి రాజకీయ నాయకుల వల్లే ఇదంతా. త్వరలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీలోనే టికెట్ కోసం పోటీపడే ప్రత్యర్థులపై ఓ కన్నేసి ఉంచడానికి నాయకులు గూఢచారుల్ని ఆశ్రయిస్తున్నారు.
టికెట్ సాధనలో ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి ఇదంతా చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 70 సీట్లు ఉంటే 1,600 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, వెయ్యికి పైగా బీజేపీ అభ్యర్థులు టికెట్ కోసం పోటీపడుతున్నారు. ఇంతమంది పోటీలో ఉండడంతో టికెట్ ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి. దీంతో పార్టీలోని ప్రత్యర్థుల ఎత్తులు తెలుసుకోవడానికి టికెట్లు ఆశించే వాళ్లు గూఢచారులను ఆశ్రయిస్తున్నారు. మరోపక్క అభ్యర్థుల సత్తాను తెలుసుకోవడానికి, టికెట్ దక్కనివాళ్లు ఎలాంటి చర్యలకు దిగుతారనే అంచనా వేయడానికి రాజకీయ పార్టీలు కూడా గూఢచారులనే నియమిస్తున్నాయి.
దీంతో డిటెక్టివ్ నారదలకు చేతినిండా పని, జేబు నిండా డబ్బు. నియోజకవర్గాన్ని, పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి డిటెక్టివ్ ఏజెన్సీలు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తం రూ. 5 లక్షలు దాటే ఉంటుం దని సమాచారం. ఢిల్లీలో 150 డిటెక్టివ్ ఏజెన్సీలు ఉండగా.. వాటిలో 13 మాత్రం రాజకీయ గూఢచర్యంలో నైపుణ్యం ఉన్న వి. ‘ఇప్పటికే మా చేతినిండా పని ఉంది. ఇకపై వచ్చే వాళ్లని తిప్పి పంపేస్తున్నాం’ అని జీడీఎక్స్ ఏజెన్సీ ఎండీ మహేశ్ చంద్ర శర్మ తెలిపారు. ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలపై గూఢచర్యం సాధారణమేనని, అయితే పార్టీలోని ప్రత్యర్థుల టికెట్ చాన్స్‌లు తెలుసుకోండంటూ అభ్యర్థులు కోరడం కొత్త ట్రెండ్ అని చెప్పా రు. టికెట్ రాని అభ్యర్థి పార్టీలోని తన ప్రత్యర్థులను ఎన్నికల్లో దెబ్బకొట్టడానికి కూడా గూఢచారుల్ని నియమించుకుంటున్నారని ఏపీడీ ఏజెన్సీ చైర్మన్ విక్రం సింగ్ చెప్పారు.