డేటా సెంటర్ నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించేందుకు టెండర్లు
రెండేళ్లకు బిడ్లు పిలిచిన ప్రభుత్వం
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఐటీ నిపుణులు
సాక్షి, అమరావతి:‘ప్రపంచంలో అత్యంత ఖరీదైన సంపద ఏదైనా ఉంది అంటే.. అది ఒక్క డేటా మాత్రమే. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వారే అత్యంత ధనికులు’ అమరావతి డ్రోన్ సదస్సులో సీఎం చంద్రబాబు చెప్పిన మాటలివి. నూతన టెక్నాలజీ పరుగులు పెడుతున్న తరుణంలో డేటా అత్యంత విలువైనదని సీఎం చంద్రబాబు చెబుతూనే.. అత్యంత విలువైన ప్రభుత్వ డేటాను ప్రైవేటు ఏజెన్సీల చేతిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంగళగిరిలోని ‘పై డేటా సెంటర్’లో గల స్టేట్ డేటా సెంటర్ నిర్వహణ బాధ్యతలను థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది.
రెండేళ్ల లీజు కాలానికి స్టేట్ డేటా సెంటర్ నిర్వహణకు రాష్ట్ర ఐటీ శాఖకు చెందిన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (ఏపీటీఎస్‌ఎల్) బిడ్లు పిలిచింది. ప్రముఖ సిస్టమ్ ఇంటిగ్రేటర్, డేటా సెంటర్ మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్లు టెండర్లలో పాల్గొనవచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా పేరుతో ఈ–గవర్నెన్స్‌ను ప్రోత్సహిస్తోందని, దీన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఈ–గవర్నెన్స్ కార్యక్రమాలను కొనసాగించడం కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఈ డేటాసెంటర్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు టెండర్ నోటీసులో పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ప్రాధాన్యతను గుర్తించిందని, ఐటీ సేవలను విస్తరించడం ద్వారా ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయనున్నట్టు పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు అక్టోబర్ 30 మధ్యాహ్నం 3గంటలలోపు టెండర్ దాఖలు చేయాల్సి ఉంటుందని, కాంట్రాక్టు గెలిచిన సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి రెండేళ్ల పాటు సేవలను అందించాల్సి ఉంటుందని బిడ్ డాక్యుమెంట్‌లో పేర్కొంది.
ఐటీ నిపుణుల ఆందోళన
డేటా చౌర్యంతో సైబర్ నేరాలు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వ డేటా నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై ఐటీ నిపుణలతో పాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా సెంటర్ నిర్వహణను ప్రభుత్వమే చేపట్టడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీ గ్రిడ్ పేరుతో డేటా చౌర్యం జరగడంపై తీవ్ర దుమారమే రేగిందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ డేటా సెంటర్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment