నేడు పర్యాటకభవన్ హోటల్‌ను ప్రారంభించనున్న ఏపీటీడీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్మించిన మూడు నక్షత్రాల హోటల్ ఎట్టకేలకు పర్యాటక శాఖ చేతికి వచ్చింది. హైదరాబాద్ నడిబొడ్డున కీలక ప్రాంతంలో ఉన్నప్పటికీ దీని నిర్వహణలో ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా చేయటంతో హోటల్‌ను సొంతంగా నిర్వహించేందుకు పర్యాటకశాఖ నిర్ణయించింది. ప్రపంచ పర్యాటక దినోత్సం సందర్భంగా శుక్రవారం దీన్ని తిరిగి ప్రారంభిస్తోంది. బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్ ప్రాంతంలో ఉన్న ఈ త్రీస్టార్ హోటల్‌ను 2007లో ప్రముఖ హోటల్ గ్రూపు ఖత్రియా లీజుకు తీసుకుంది. కానీ లాభాలు రావటం లేదంటూ అనతికాలంలోనే వైదొలిగింది. నిర్వహణ సమయంలో ఆ సంస్థ సరిగా వ్యవహరించటం లేదని పేర్కొంటూ వచ్చిన పర్యాటక శాఖ, తనకు ఆ సంస్థ కోట్ల రూపాయలు బకాయిపడిందని పేర్కొంటూ కోర్టుకెక్కింది. ఏడాదిపాటు ఖాళీగా ఉన్న తర్వాత 2011లో అమోగ్ గ్రూపు ముందుకురావటంతో 15 ఏళ్లు లీజుకిచ్చింది. కానీ ఆ సంస్థ ఒప్పందం మేరకు తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని జమకట్టడంలేదని పర్యాటకాభివృద్ధి సంస్థ లీజు ఒప్పందాన్ని అర్ధంతరంగా రద్దు చేసుకుంది.
ఇప్పుడు రోజువారీ నిర్వహణ లేకపోవడంతో హోటల్‌లో ఎక్కడికక్కడ దుమ్ముపేరుకుపోయింది. చివరికి మెరుగ్గా నిర్వహించే ప్రైవేటు సంస్థలు రావని తేల్చుకున్న పర్యాటకాభివృద్ధి సంస్థ.. కనీసం భవనం నిర్వహణకు సరిపడా మొత్తాన్నయినా సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో సొంతంగానే హోటల్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. హోటల్ నిర్వహణకు ఓ విశ్రాంత అధికారిని నియమించింది. 84 గదులున్న ఈ హోటల్‌లో అవసరమైన సిబ్బందిని నియమించే పని ప్రారంభించింది. ప్రైవేటు సంస్థ నిర్వహణ సమయంలో పనిచేసిన సిబ్బందికి మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహించి వారినే తిరిగి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.