= విమ్స్ కాంట్రాక్టు పారిశుద్ధ్య సిబ్బందికి నాలుగు నెలలుగా అందని వేతనాలు
= పట్టించుకోని యంత్రాంగం
సాక్షి, బళ్లారి : పేరుకు పెద్దాస్పత్రి అయినప్పటికీ దిన కూలీలకు జీతాలు ఇవ్వని దుస్థితిలో విమ్స్ అధికారులు ఉన్నారు. నాలుగు నెలలుగా వేతనాలు అందక కూలీలు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వెయ్యి పడకలతో కర్ణాటకలోనే పెద్దాసుపత్రిగా పేరుగాంచిన విమ్స్‌కు బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి రోజు వేలాది మంది రోగులు ఇక్కడకు వచ్చి చికిత్సలు చేయించుకుంటారు. ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు.
ఈ ఏజెన్సీ కింద దాదాపు 150 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరిలో కొందరికి రూ.3వేలు, మరికొందరికి రూ.4,500 వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది. పడకల వద్దనుంచి మరుగుదొడ్ల వరకూ శుభ్రం చేస్తూ ఆస్పత్రిని అద్దంలా చేస్తుంటారు. వీరందరూ ఒక్క రోజు విధులకు హాజరు కాకుంటే ఆస్పత్రి బందలదొడ్డే. అంతటి ప్రాధాన్యం ఉన్న పారిశుద్ధ్య కార్మికులపట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చేది అరకొర జీతాలే. అయితే ఆ వేతనాలను నెలనెల సక్రమంగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం నాలుగు నెలలుగా జీతాలు అందక కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.
కూరగాయలనుంచి బియ్యం, నూనె వరకు ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితుల్లో వీరికి విమ్స్ యంత్రాంగం వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో గత్యంతరం లేక కార్మికులు బుతకుబండిని లాగించేందుకు అప్పులు సైతం చేస్తున్నారు. అయినప్పటికీ విమ్స్ యంత్రాంగం కరుణించలేదు. దుర్వాసనను ఓర్చుకుంటూ ఆరోగ్యాలను సైతం పణంగా పెట్టి ఆస్పత్రిని శుభ్రం చేస్తుంటే వేతనాలు ఇవ్వకుండా ఆస్పత్రి అధికారులు మొండికేస్తున్నారని కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
రోగులు ఎక్కడ ఇబ్బందులు పడుతారోనని వేతనాలు అందకపోయినా పస్తులుంటూ విధులకు హాజరవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలకు నిధులు అందక వేతనాలు ఇవ్వడంలేదని పేరు చెప్పలేని ఓ దినకూలీ పేర్కొన్నాడు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విమ్స్‌లో పని చేసే దినకూలీ కార్మికులకు నెలనెలా సక్రమంగా జీతాలు అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జీతాలో రామచంద్రా..
Published Sun, Dec 15 2013 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement