పండుగ వేళ పిండివంటలకు దూరమవుతున్న సామాన్యులు
పట్టించుకోని కూటమి ప్రభుత్వం
లీటర్‌పై 40–60 శాతం మేర పెరిగిన వంట నూనెల ధరలు
ఓ వైపు నిత్యావసరాలు, మరో వైపు కూరగాయల ధరలూ మోత
కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై కొరవడిన నిఘా
గతంలో సబ్సిడీపై వంటనూనెలు, కూరగాయల విక్రయాలు
ఆ ఊసెత్తని కూటమి సర్కార్
కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత నిత్యావసరాల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఓ వైపు పప్పుల ధరలు చుక్కలనంటుతుంటే.. మరోవైపు వంటæనూనెల ధరలు తారాజువ్వల్లా దూసుకెళ్తుండడంతో పండుగ వేళ పిండివంటలు చేసుకోవాలంటేనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. – సాక్షి, అమరావతి
చిరువ్యాపారులపై తీవ్ర ప్రభావం
వంటనూనెల ధరల పెరుగుదల ప్రభావం సామాన్య, మధ్యతరగతులపైనే కాదు.. హోటల్ ఇండస్ట్రీస్‌పై కూడా తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా రోడ్‌సైడ్ చిన్న చిన్న తోపుడు పండ్లపై చిరువ్యాపారులు చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. కృత్రిమ కొరత సృష్టిస్తోన్న వ్యాపారులపై నిఘా కొరవడింది. సుంకం సాకుతో ధరలు పెంచిన తర్వాత మొక్కుబడి తంతుగా నాలుగైదు రోజులు విజిలెన్స్ అధికారులు హడావుడి చేశారు. అయితే కూటమి పెద్దల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు.
చూసీ చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం..
క్రూడ్ పామ్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాలు 5.5 శాతం నుంచి 27.5 శాతానికి కేంద్రం పెంచేసింది. శుద్ధి చేసి తినదగిన నూనెలపై 13.7 శాతం నుంచి 35.7 శాతానికి దిగుమతి సుంకాలు పెరిగాయి. ఈ పెంపు సెపె్టంబర్ 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చీ రాగానే దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దలు మామూళ్ల మత్తులో చూసీచూడనట్టు వ్యవహరించడంతో కంపెనీలు ఉన్నఫళాన రేట్లను అమాంతం పెంచేసాయి.
ధరలు పెరిగిన సందర్భంలో పౌరసరఫరాల మంత్రి హడావుడి చేసినా ఆ తర్వాత ధరల పెంపుపై నోరు మెదపడం లేదు. వంటనూనెలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు 20–30 శాతం పెరగగా, కూరగాయల ధరలు 40–60 శాతం మేర పెరిగాయి. చివరికి కాఫీ ధరలు 60 శాతం, టీ ధరలు 25 శాతం పెరిగాయి. ప్రధానంగా బియ్యం ధర 15 శాతం, పప్పుల ధరలు 50–67 శాతం మేర పెరిగాయి.
5 నెలల్లో 60% పెరిగిన ధరలు
పామాయిల్ ధర సరిగ్గా ఐదు నెలల క్రితం మే 29న బ్రాండ్‌ను బట్టి లీటర్ రూ.88–90 మధ్య ఉండగా, ప్రస్తుతం రూ.128–140కు చేరుకుంది. రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.108–113 నుంచి రూ.149–160 పెరిగిపోయింది. వేరుశనగ నూనె గతంలో రూ.157 ఉండగా, ప్రస్తుతం రూ.170–200 వరకు ఉంది. సన్‌డ్రాప్, ప్రియా, ఫ్రీడమ్ వంటి కంపెనీల ఆయిల్స్ అయితే ఏకంగా రూ.200కు పైగానే ఉన్నాయి. గత నెలతో పోలిస్తే 29–37 శాతం మేర పెరగగా, మేతో పోలిస్తే వంట నూనె ధరలు 40–60 శాతం మేర పెరిగాయి. ఇళ్లల్లో వాడే ఆవనూనె ధర సైతం నెల రోజుల్లో ఏకంగా 29శాతం పెరిగింది. గత నెలలో ముడిపామ్, సోయా బీన్, పొద్దుతిరుగుడు నూనెల ధరలు వరుసగా 10.6 శాతం, 12.3 శాతం, 16.8 శాతం చొప్పున పెరిగినందున.. ఆ ప్రభావం ధరలపై పడుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం
గతంలో ఉక్రేయన్ యుద్ధం నేపథ్యంలో 2022లో ఇదే రీతిలో పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ ధరలు అనూహ్యంగా పెరిగిన సందర్భంలో వైఎస్ జగన్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వినియోగదారులకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపట్టింది. ఆయిల్ ఫెడ్ ఉత్పత్తి అయిన విజయా బ్రాండ్ ఆయిల్స్‌ను రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ ధరలపై అందుబాటులోకి ఉంచింది.
ఆ సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే కాదు.. కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేసి సుమారు 3.5లక్షల లీటర్ల ఆయిల్స్‌ను సబ్సిడీ ధరలకు అందించారు. అదే విధంగా టమాటా, ఉల్లిపాయలను సబ్సిడీపై అందించి అండగా నిలిచింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment