ఒంగోలు టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టింది. పదిహేనేళ్లుగా దీన్నే నమ్ముకొని బతుకుతున్న నిర్వాహకుల కడుపు కొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్రం నిధుల్లో కోత విధించడమే ఆలస్యం.. దానిని సాకుగా చూపి రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకువేసి ఈ పథకాన్ని ఏకంగా ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కేంద్రం 90శాతం, రాష్ట్రం 10శాతం నిధులు నిధులు కేటాయిస్తూ వచ్చింది. ప్రస్తుతం కేంద్రం 60శాతం నిధులు ఇస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేట్ ఏజెన్సీల పరం చేసేసింది. ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలను ఒక క్లస్టర్‌గా చేసి ఢిల్లీకి చెందిన ఏక్తా శక్తి ఏజెన్సీకి మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. 20 కిలోమీటర్ల దూరంలో వంటశాలను ఏర్పాటుచేసి ఒకేసారి 25వేల మంది విద్యార్థులకు ఆహారం వండి ప్యాకెట్ల రూపంలో అందించనున్నారు. ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏక్తా శక్తి ఏజెన్సీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
2003 నుంచి అమలు..
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని 2003లో సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. ఈ పథకం అమలు ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంతో పాటు డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు వీలవుతుందని çసుప్రీంకోర్టు సూచించింది.
ఈ నేపథ్యంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళలకు మధ్యాహ్న భోజన నిర్వహణ బాధ్యతలను అప్పగించాడు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డ్వాక్రా మహిళలను మధ్యాహ్న భోజన నిర్వాహకులుగా మార్చేశారు. ప్రకాశం జిల్లాలో కూడా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని డ్వాక్రా మహిళలే నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి మధ్యాహ్న భోజనం వడ్డించి పెట్టినందుకు రూ.1.25 చొప్పున ఇస్తూ వచ్చారు. అయితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటంతో ఈ పథకం నిర్వహణ తమవల్ల కాదంటూ నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో ఒక్కో విద్యార్థికి రూ.3.25 చొప్పున ప్రభుత్వం పెంచింది.
తమకు వేతనాలు నిర్ణయించాలని ఉద్యమించడంతో 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1000 చొప్పున వేతనాన్ని నిర్ణయించింది. ప్రభుత్వం బియ్యం, కోడిగుడ్లు మాత్రమే నిర్వాహకులకు అందిస్తే కందిపప్పు, కూరగాయలు, పోపుదినుసులు, వంట గ్యాస్ ఇలా ప్రతిదీ నిర్వాహకులే కొనుగోలు చేయాల్సి ఉండటంతో మధ్యాహ్న భోజనం వారికి భారంగా మారింది. దానికితోడు గత ఏడాది నవంబర్ నుంచి వేతనాలు పెండింగ్‌లో ఉండటం, ఈ ఏడాది మార్చి నుంచి నిర్వహణ బిల్లులు నిలిపివేసినా ప్రభుత్వం తమను గుర్తిస్తుందన్న ఆశతో మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఎదురుచూస్తున్న తరుణంలో ప్రైవేట్ ఏజెన్సీకి నిర్వహణ బాధ్యతలను అప్పగించి వారిని సాగనంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
నెలకు రూ,3వేలు ఖర్చవుతోంది: ఒంగోలులోని వెంకటేశ్వరకాలనీలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు నెలకు రూ.3వేల ఖర్చవుతోంది. ప్రభుత్వం రూ.1000 గౌరవ వేతనం ఇస్తోంది. అది ఏమాత్రం చాలదు. ఒక్కో విద్యార్ధికి 3.25రూపాయల చొప్పున ఇస్తున్నా అది కూడా చాలడం లేదు. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తోందని ఎదురు చూస్తున్న సమయంలో ఏజెన్సీకి అప్పగించింది.– మక్కెన మాణిక్యం
Comments
Please login to add a commentAdd a comment