ఆదిపూడిలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు
కారంచేడు: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని వండి వడ్డించాలనే ప్రభుత్వం సంకల్పం రోజురోజుకూ నీరుగారుతోంది. పెరుగుతున్న నిత్యవసరాల ధరలతో నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు నెలనెలా విడుదల కాని బిల్లులు.. వీటన్నింటితో పిల్లలకు రుచికరమైన ఆహారం అందడం భారమవుతోంది. మండలంలోని 14 గ్రామాల పరిధిలో మొత్తం 28 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత, 7 ఉన్నత ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్న పాఠశాలల్లో 1016 మంది, ఉన్నత పాఠశాలల్లో 875 మంది మొత్తం 1891 మంది విద్యార్థులున్నారు. ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులతో కలిపి మొత్తం 2275 మంది విద్యార్థులున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రూ.4.13లు, 100 గ్రాముల బియ్యం, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.6.18లు, 150 గ్రాముల బియ్యంతో రోజూ ఆహారాన్ని వండి వడ్డించాలి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో పెరుగుతున్న నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వ మెనూ గుట్టుచప్పుడు కాకుండా గాడి తప్పుతోంది. అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
నిర్వాహకులకు తప్పని తిప్పలు
అన్ని పాఠశాలల్లో 38 ఏజెన్సీల్లో హెల్పర్స్‌తో కలిపి 57 మంది పని చేస్తున్నారు. కష్టపడి అప్పులు చేసి మరీ వండి వడ్డిస్తున్నా బిల్లులు కూడా ప్రతి నెలా సక్రమంగా రావడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇంకా రెండు నెలల బిల్లులు రావాల్సి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లలను పస్తులు ఉంచలేక అప్పోసొప్పో చేసి అతికష్టం మీద భోజనం వడ్డిస్తున్నామని ఆవదేన వ్యక్తం చేస్తున్నారు. బియ్యం కూడా అస్సలు బాగుండటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. 50 కేజీల బస్తాలో 47 కేజీలు మాత్రమే బియ్యం ఉంటుంన్నాయన్నాని ఆరోపిస్తున్నారు.
వంట గదులు కూడా లేవు
37 పాఠశాలలగాను కేవలం కారంచేడు సీవీసీ, దగ్గుబాడు మెయిన్ పాఠశాలలకు మాత్రమే వంటగదులున్నాయి. అవి కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. మిగిలిన 35 పాఠశాలల్లో ప్రస్తుతం 9 మంజూరయ్యాయి. వీటిలో కేవలం 4 పూర్తయ్యాయి. మిగిలినవి నిధులు సరిపోక నిలిచిపోయాయి. వాటిని కట్టేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఆరుబయటే వంటలు చేసి వడ్డించాల్సి వస్తోందని వాపోతున్నారు. చాలామంది నిర్వాహకులు భోజనం ఇంటి వద్ద వండుకొని స్కూల్‌కు తీసుకొచ్చి పెడుతున్నారు.
ఆరుబయటే వంట, వార్పు
ప్రబుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడం, వంట గదులు లేకపోవడంతో వంట, వార్పు ఆరుబయటే చేసుకోవాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెబుతుందేగానీ ఇంత వరకు అలాంటి చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఆరుబయట వంటలు చేయడం, వరండాల్లో భోజనాలు పెట్టడంతో దుమ్ము, ధూళి పడి విద్యార్థులు రోగాల బారిన పడే అవకాశాలున్నాయని వాపోతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదికలిచ్చాం: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులను ఉన్నతాధికారులకు పంపించాం. మంజూరు కావాల్సి ఉంది. విడుదలైన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేస్తాం. ఇక కుకింగ్ షెడ్స్ విషయం కూడా ఉన్నతాధికారులకు తెలిపాం. కొన్ని చోట్ల స్థలాల సమస్య, మరికొన్ని చోట్ల నిధుల లేమి లుంది. మిగిలిన పాఠశాలల్లో కూడా షెడ్స్ నిర్మించేందుకు కృషి చేస్తున్నాం.
– ఎంవీ సత్యనారాయణ, ఎంఈఓ, కారంచేడు
Comments
Please login to add a commentAdd a comment