మధ్యాహ్న భోజనంతో మినరల్ వాటర్
సాక్షి, సిటీబ్యూరో : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు మినరల్ వాటర్ బాటిళ్లను అందించే అవకాశాలను పరిశీలించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. కలుషిత నీరు, ఆహారం కారణంగా విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు.
జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై టాస్క్‌ఫోర్స్ సభ్యులతో గురువారం కలెక్టరేట్లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మీనా మాట్లాడుతూ.. పాఠశాలలకు నాంది ఫౌండేషన్ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం రుచి, నాణ్యత, పరిమాణం.. తదితర అంశాలను ప్రతిరోజూ పర్యవేక్షించే బాధ్యతను ప్రత్యేకంగా ఒక టీచర్‌కు అప్పగించాలని డీఈవోకు సూచించారు.
ప్రైవేటు ఏజెన్సీకి నాణ్యత పరిశీలన
ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తోన్న ఆహారం, మంచినీటి నాణ్యతను పరిశీలించేందుకు అవసరమైన శాంపిల్స్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, మెట్రోవాటర్ వర్క్స్ సంస్థలకు పంపాలని కలెక్టర్ సూచించారు.
అవసరమైతే ఈ బాధ్యతలను ప్రైవేటు ఏజన్సీకి అప్పగించే ప్రతిపాదనను పరిశీలించాలన్నారు. మధ్యాహ్న భోజనం అమలు తీరుపై సోషల్ ఆడిట్(సామాజిక సర్వే) బాధ్యతలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించి ప్రజల స్పందనను తెలుసుకోవాలని కలెక్టర్ మీనా డీఈవోకు సూచించారు. సమావేశంలో ఆర్వీఎం పీవో సుబ్బరాయుడు, డీఈవో సుబ్బారెడ్డి, ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖ, జలమండలి అధికారులు పాల్గొన్నారు.