నారాయణపేట జిల్లామాగనూర్ స్కూళ్లో ఘటన
భోజనం చేసిన వెంటనే విద్యార్థులకుతీవ్ర కడుపునొప్పి
విషయం చెప్పినా పట్టించుకోని టీచర్లు
పరిస్థితి విషమించటంతోఆస్పత్రులకు తరలింపు
ఘటనపై సీఎం రేవంత్ సీరియస్..సమగ్ర విచారణకు ఆదేశం
పాఠశాలలా? ప్రాణాలు తీసే విషవలయాలా?: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్/మాగనూర్: మధ్యాహ్న భోజనం విషతుల్యం కావటంతో100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మాగనూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు వడ్డించారు. ఆహారం తిన్న కొద్దిసేపటికే సుమారు వందమంది విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. ఆ విషయం టీచర్లకు చెప్పగా ‘మీరు రోజూ ఇలాగే చెప్తున్నారు’అని బెదిరించినట్లు తెలిసింది.
కానీ, కడుపునొప్పి మరింత తీవ్రం కావటంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొందరు విద్యార్థులు వాంతులు చేసుకొన్నారు. దీంతో టీచర్లు స్థానిక ఆస్పత్రికి సమాచారమిచ్చారు. స్థానిక ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు స్కూలుకు వచ్చి విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించినా కొందరి పరిస్థితి మెరుగుపడకపోవటంతో మండల వైద్యాధికారి అఫ్రోజ్‌కు సమాచారం అందించారు. ఆయన స్కూలుకు వచ్చి విద్యార్థులను పరీక్షించారు.
తొలుత 10 మందిని మక్తల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి ప్రైవేట్ అంబులెన్స్‌లో మరో 9 మంది విద్యార్థులను మక్తల్ ఆస్పత్రికి పంపించారు. వీరిలో 15 మందిని మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రియాంక, అనిల్, నందిని పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి కొంచం మెరుగ్గా ఉన్న ఇతర గ్రామాల విద్యార్థులను టీచర్లు ఇంటికి పంపించివేశారు.
ఇళ్లకు చేరుకున్న తర్వాత కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురికాగా.. తల్లిదండ్రులు వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మొత్తం వందమంది విద్యార్థులకు ఫుడ్‌పాయిజన్ అయినట్లు గుర్తించారు. కాగా, కడుపులో నొప్పిగా ఉందని చెప్పిన కొందరు విద్యార్థులను టీచర్లు కొట్టినట్లు చెపుతున్నారు.
ఇక్కడ ఫుడ్‌పాయిజన్ మొదటిసారి కాదు!
విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకొన్న డీఈఓ అబ్దుల్ ఘనీ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఈ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం ఇది మూడోసారి అని విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓతో వాగ్వాదానికి దిగారు. వంట ఏజెన్సీ, పాఠశాల హెచ్‌ఎం (ఇన్‌చార్జ్ ఎంఈఓ) నిర్లక్ష్యం కారణంగానే ఫుడ్ పాయిజన్ అయ్యిందని ఆరోపించారు.
విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని వంట ఏజెన్సీని తక్షణమే మార్చాలని హెచ్‌ఎంతో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కూడా పాఠశాలకు చేరుకుని ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈఓను, ఎస్‌ఐ అశోక్‌బాబును ఆదేశించారు. ఎమ్మెల్యే తన వాహనంతోపాటు ప్రైవేట్ అంబులెన్స్‌లో విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
సీఎం సీరియస్: మాగనూర్ ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. విద్యార్థుల అస్వస్థత విషయం తెలియగానే వారి ఆరోగ్య పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకొన్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సంఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని సీఎంవో అధికారులకు సూచించారు.
ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని సీఎం హెచ్చరించారు. విద్యార్థుల అస్వస్థతపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠాలు నేర్చుకోవడం కాదు.. ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చందని ఆరోపించారు. ‘గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా?’అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment