మాగనూర్ ప్రభుత్వ స్కూల్‌లో మారని తీరు
ఫుడ్ పాయిజన్ అయిన మరుసటి రోజే పురుగుల అన్నం
విద్యార్థుల ఆందోళన.. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
డీఈఓ, ఎంఈఓ, ఇన్‌చార్జి హెచ్‌ఎంలపై సస్పెన్షన్ వేటు
ఆర్డీఓ, ఎంపీడీఓ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు
నారాయణపేట/జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మధ్యాహ్న భోజనం విషతుల్యమై ఒకేసారి వంద మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైనా అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం కూడా అదే పురుగుల అన్నం వడ్డించారు. బుధవారం ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రుల్లో చేరిన విద్యార్థులు ఇంకా పూర్తిగా కోలుకోకముందే.. ఆ మరుసటి రోజే మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి.
గురువారం ఉదయం నారాయణపేట కలెక్టర్ సిక్తా పటా్నయక్ స్వయంగా పాఠశాలను సందర్శించి వంట గది, స్టాక్ రూమ్‌లను పరిశీలించి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో వేర్వేరుగా మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా వండించా లని డీఈఓ అబ్దుల్ ఘనీ, ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఎంపీడీఓ రహమత్ ఉద్దీన్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నీలిమను ఆదేశించారు. దీంతో మాగనూర్‌లోని ఎస్సీ విద్యార్థుల వసతి గృహం నుంచి వంట మనుషులను పిలిపించి.. అన్నం, సాంబార్, కూరలు వండించి విద్యార్థులకు వడ్డించారు.
ఆ అన్నంలో కూడా పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్.. అదనపు కలెక్టర్ బేన్‌షాలం (రెవెన్యూ)ను పాఠశాలకు పంపారు. పురుగుల అన్నం వడ్డించింది వాస్తవమేనని అదనపు కలెక్టర్ నిర్ధారించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్.. డీఈఓ అబ్దుల్‌ఘనీపై సస్పెన్షన్ వేటు వేశారు.
అంతకు ముందే ఎంఈఓ హెచ్‌ఎం మురళీధర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం బాబురెడ్డిని సస్పెండ్ చేశారు.ఆర్డీఓ రాంచందర్ నాయక్, ఎంపీడీఓ రహమత్ ఉద్దీన్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నీలిమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వంట ఏజెన్సీ నిర్వాహకులను విధుల నుంచి తొలగించారు.
విద్యార్థులకు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శ
ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రిపాలైన విద్యార్థులను మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ గురువారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి ఘటన వివరాలు అడిగి తెలుసుకొన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని ఆరోపించారు. విషాహారం తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఇక్కడ కూడా పురుగులు ఉన్న టిఫిన్ పెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment