ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి...రూ.160 కోట్ల విలువైన స్థలం ప్రైవేట్ వ్యక్తుల పరమైంది.
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి...రూ.160 కోట్ల విలువైన స్థలం ప్రైవేట్ వ్యక్తుల పరమైంది. గుట్టుగా సాగిన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ శ్రీధర్... బాధ్యుడైన రాజేంద్రనగర్ ఆర్డీఓ నాగేందర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి...శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం నవ్‌ఖల్సా సర్వేనంబర్ 66లోని ప్రభుత్వ భూమిలో 8 ఎకరాలను ఓ ప్రైవేట్ వ్యక్తికి కౌలుదారు హక్కుచట్టం(38ఈ) కింద ప్రైవేట్ వ్యక్తులకు అప్పనంగా కట్టబెట్టారు. 2011లో కౌలుదారులకు అనుకూలంగా అప్పటి తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత ఆర్డీఓ నాగేందర్ సమర్థిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన పక్షం రోజుల్లోనే ఈ ఫైలుకు మోక్షం కల్పించినట్లు విచారణలో తేలింది. కాగా ఇటీవల తనిఖీల్లో భాగంగా సదరు భూమిని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఈ అవినీతి బాగోతాన్ని వెలికి తీశారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందిపోయి ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా ఆర్డీఓ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన సీరియస్‌గా పరిగణించారు. ప్రైవేట్ వ్యక్తులకు విలువైన భూమిని కట్టబెట్టినట్లు కలెక్టర్ సోమవారం ఆర్డీఓ నాగేందర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అలాగే అప్పటి తహశీల్దార్ పద్మశ్రీపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ లేఖరాశారు. అలాగే అప్పటి స్థానిక సర్వేయర్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు.