దుకాణం మూసుకోండి.. | gas to customers under the auspices of the Department HP gas | Sakshi
Sakshi News home page

దుకాణం మూసుకోండి..

Published Wed, Oct 30 2013 2:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

gas to customers under the auspices of the Department HP gas

అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అనంతపురంలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ పనితీరు వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. సిలిండర్లు సక్రమంగా పంపిణీ చేయడం చేతకాకపోతే కార్యాలయాన్ని మూసివేసి ప్రైవేట్ ఏజెన్సీలకు బదలాయించాలని అనంతపురంలోని సివిల్ సప్లై హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు మండిపడుతున్నారు.
 
 ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్న అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రైవేట్ ఏజెన్సీలు సిలిండర్లను సక్రమంగా పంపిణీ చేస్తున్నప్పుడు.. మీరెందుకు పంపిణీ చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. మొదటి నుంచి అవినీతికి నిలయమైన ఈ ఏజెన్సీలో ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయం లేదని, వినియోగదారుల సమస్యలను పరిష్కరించాల్సిన వీరు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఈమె పేరు అంజినమ్మ. జనశక్తినగర్‌లో నివాసం ఉంటోంది. సివిల్‌సప్లై హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. సెప్టెంబర్ 16వ తేదీ సిలిండర్ కోసం బుక్ చేసింది. మూడు రోజుల్లో అందాల్సిన రీఫిల్ (సిలిండర్) నెల రోజులైనా అందకపోవడంతో గ్యాస్ ఆఫీస్‌కు వచ్చి ఆరా తీసింది. మీ సిలిండర్ రద్దయింది. మళ్లీ బుక్ చేసుకోమని సలహా ఇచ్చారు. దీంతో చేసేది లేక మళ్లీ ఈ నెల 15న బుక్ చేసింది. 29న గ్యాస్ ఆఫీస్‌కు వచ్చి గ్యాస్ ఎప్పుడు వస్తుందని ఆరా తీయగా ఇంకో వారం రోజులు పడుతుందని సిబ్బంది చెప్పారు. బుద్ధి లేక ఇక్కడ కనెక్షన్ తీసుకున్నామని, అటోలో రాను పోనూ రూ.60 ఖర్చయిందని, మా ఖర్మ ఇలా కాలిందని తిట్టుకుంటూ ఇంటి ముఖం పట్టింది.
 
 వినాయక్‌నగర్‌కి చెందిన జిలాన్‌బాషాకు ఇక్కడే కనెక్షన్ ఉంది. సెప్టెంబర్ 21వ తేదీ రీఫిల్ కోసం బుక్ చేసుకున్నాడు. పది రోజుల అనంతరం గ్యాస్ కార్యాలయానికి వచ్చి ఆరా తీయగా మీ రీఫిల్ సిలిండర్ బుకింగ్ రద్దు అయింది. మళ్లీ బుక్ చేసుకోమని సిబ్బంది చెప్పారు. మళ్లీ ఈ నెల 18న బుక్ చేశాడు. సిలిండర్ ఇంకా రాకపోవడంతో 29న (మంగళవారం) గ్యాస్ ఆఫీస్ వద్దకు వచ్చి ఆరా తీయగా నాలుగైదు రోజులు పడుతుందని సమాధానం చెప్పారు. బుకింగ్ రద్దు అయిన విషయం ఆఫీసుకు వచ్చి అడిగితే తప్ప చెప్పడంలేదని వాపోయాడు.

 ఇది.. అంజనమ్మ, జిలాన్‌బాషాలకే పరిమితమైన ఆవేదన కాదు. అత్యంత అత్యవసరమైన సిలిండర్ల కోసం ప్రతి రోజు గ్యాస్ ఆఫీసుకు వస్తున్న వందలాది వినియోగదారుల నిస్సహాయ ఘోష..
 
 ఎవరు బాధ్యులు..
 సిలిండర్ల సమాచారం కోసం వెళ్లిన వినియోగదారులకు ఆఫీసులో సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. సిలిండర్ల బుకింగ్ రద్దు చేసినప్పుడు సమాచారం ఎందుకు తెలియజేయలేదని ఓ వినియోగదారుడు అడిగితే.. ‘మమ్మల్ని అడిగితే మేమేం చెబుతాం..? ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రద్దు చేశాం.. వెళ్లి జేసీని అడగండి.. డీఎస్‌ఓను అడగండి..’ అని చీదరించుకుంటున్నారు. అంటే ఆఫీసుకు వచ్చిన ప్రతి వినియోగదారుడు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం సాధ్యమమేనా? వినియోగదారులు సివిల్‌సప్లై హెచ్‌పీ గ్యాస్ అంటేనే హడలెత్తిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారు.
 
 అంతా కనికట్టు
 సివిల్‌సప్లై ఆఫీసులో బుక్ చేసుకున్న వినియోగదారులను మాయ చేస్తున్నారు. రీఫిల్ సిలిండర్ బుక్ చేసుకున్న వినియోగదారుల సెల్‌కు మీ సిలిండర్ డెలివరీ అయిందని మెసేజ్ వస్తుంది. కాని సిలిండర్ మాత్రం డెలివరీ అయి ఉండదు. కంగుతున్న వినియోగదారులు సదరు కార్యాలయం వద్దకు వెళ్లి ఆరా తీస్తే ఆ తేదీ వరకు బిల్స్ క్లియర్ అయినట్లు అర్థం అని చెప్పి పంపుతున్నారు.
 
 బిల్స్ క్లియర్ అయి 20 రోజులు దాటినా సిలిండర్ మాత్రం అందడం లేదు. ఇలాంటి మెసేజ్‌లతో అంతా కనికట్టు చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు.
 
 పెండింగ్‌లో 5 వేల గ్యాస్ సిలిండర్లు
 సివిల్‌సప్లై కార్యాలయ పరిధిలో 19 వేల గ్యాస్ కనెక్షన్‌లున్నాయి. సిలిండర్ డెలివరికి నెలల తరబడి సమయం తీసుకుంటుండటంతో బ్యాక్‌లాగ్ సంఖ్య పెరిగిపోతోంది. గతంలో దసరా పండుగ ముందు ఇలాంటి వాటికి ప్రత్యేక డ్రైవ్ పెట్టి పంపిణీ చేసినా అప్పుడు బుక్ చేసుకున్న వందలాది వినియోగదారులకు నేటికీ అందని పరిస్థితి నెలకొంది. ఈ నెల 11 వరకు బిల్స్ తీసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో పక్క బ్యాక్‌లాగ్ సిలిండర్ల సంఖ్య భారీగా పేరుకుపోయింది. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మంది సిలిండర్ల కోసం వేచి చూస్తున్నారు.
 
 దృష్టి సారించని జిల్లా ఉన్నతాధికారులు
 సివిల్‌సప్లై హెచ్‌పీ కార్యాలయంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంతో సిలిండర్లు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సిలిండర్ రవాణాకు తక్కువ ధరకే టెండర్ దక్కించుకుని ఇలా పక్కదారి పట్టిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
 
 ప్రైవేట్ ఏజెన్సీని చూసి అయినా..
 నగరంలో హెచ్‌పీ గ్యాస్‌కు సంబంధించిన ప్రైవేట్ ఏజెన్సీ ఒకటుంది. ఆ ఏజెన్సీ నిర్వాహకులు.. బుక్ చేసిన వారం రోజుల్లోగానే సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. సివిల్ సప్లై వారి ఏజెన్సీలో మాత్రం నెలల కొద్ది సిలిండర్లు పంపిణీ చేయలేకపోతున్నారు. ఒకే కంపెనీ పరిధిలోని రెండు ఏజెన్సీల్లో ఇంత తేడా ఎందుకు వస్తుందో సివిల్ సప్లై అధికారులకే తెలియాలని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు.
 
 లారీల ఆలస్యమే కారణం..
 సిలిండర్ల లారీలు రావడం ఆలస్యం కావడంతోనే పంపిణీ ఆలస్యమవుతుందని సివిల్ సప్లై హెచ్‌పీ గ్యాస్ పర్యవేక్షణాధికారి గురుప్రసాద్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రోజుకొక లారీ చొప్పున రావాల్సిన లోడ్ ఆరు రోజులుగా రాలేదన్నారు. సెప్టెంబర్‌లో బుక్ చేసుకున్నవారందరూ మళ్లీ బుక్ చేసుకోవాలని సూచించాం. బుక్ చేసుకున్న వారందరికీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement