సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) కాసుల వర్షం కురిపించనుంది. నిర్వహణ భారం తొలగడంతోపాటు ఇతర అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు ఆదాయ వనరవబోతోంది. టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) పద్ధతిన టెండర్ పిలిచి 20–30 ఏళ్ల పాటు టోల్ వసూళ్లు, నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగిస్తే ఆప్ ఫ్రంట్ ఫీజు రూపంలో రూ.2,000 కోట్లు–రూ.3,000 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని హెచ్‌ఎండీఏ భావిస్తోంది.
టీవోటీ పద్ధతితో..
ప్రస్తుతం టోల్ వసూళ్లను చూసుకుంటున్న ఈగల్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.. హెచ్‌ఎండీఏకు ప్రతి నెలా రూ.16.5 కోట్లు చెల్లిస్తోంది. ఓఆర్‌ఆర్ నిర్వహణను మాత్రం హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తోంది. కానీ రింగ్ రోడ్డు నిర్వహణ నగరాభివృద్ధి సంస్థకు తలనొప్పిగా మారింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మార్గం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దీంతో నిర్వహణను ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించి అంబులెన్స్, పెట్రోలింగ్ వాహనాలతో పాటు సిబ్బందికి ప్రతి నెలా రూ.30 లక్షలు హెచ్‌ఎండీఏ చెల్లిస్తోంది. ఇతర అవసరాలకు రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) అనుసరిస్తున్న టీవోటీ పద్ధతితో ఏకకాలంలో భారీగా డబ్బులు రావడంతో పాటు నిర్వహణ భారమూ తొలగుతుందని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. దీనిపై అధ్యయనానికి ట్రాన్సాక్షన్ అడ్వైజర్ (లావాదేవీల సలహాదారులు)లుగా లీ అసోసియేట్స్ సౌత్ ఆసియా, క్రిసిల్‌ను నియమించింది. ఫిబ్రవరి నెలాఖరుకల్లా సదరు సంస్థలు నివేదిక సమర్పించనున్నాయి. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అనుమతి రాగానే ముందుకెళ్లాలని భావిస్తోంది.
వైఎస్సార్ దూరదృష్టి..
వైఎస్సార్ హయాంలో రూ.6,696 కోట్లు వెచ్చించి 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించారు. ఆయన దూరదృష్టితో నిర్మించిన ఎనిమిది లేన్ల ఓఆర్‌ఆర్.. ఇప్పుడు హైదరాబాద్‌కు తలమానికంగా నిలిచింది. శివారు ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిగా మారింది. నగరంపై సగం ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించింది. తాజాగా అదే ఓఆర్‌ఆర్ ప్రస్తుత ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర్చబోతోంది. ఇలా మరెన్నో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు ఆదాయ వనరవబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment