గ్రేటర్ హైదరాబాద్‌పై వలసల ఒత్తిడిని, ట్రాఫిక్ రద్దీ, కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) మధ్య శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మించాలని నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో ఔటర్, ట్రిపుల్ ఆర్ మధ్య లే–అవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలు వస్తాయని.. వాటికి రహదారులను అనుసంధానం చేస్తే అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. – సాక్షి, హైదరాబాద్
11 ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా..
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ మేడ్చల్, సంగారెడ్డి, షాద్‌నగర్, ఘట్‌కేసర్ తదితర మార్గాల్లోని 11 ప్రాంతాల్లో మినీ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి ‘హైదరాబాద్ నగరాభివృద్ది సంస్థ (హెచ్‌ఎండీఏ)’ ప్రతిపాదించింది. పైలట్ ప్రాజెక్ట్ కింద తుర్కపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను మినీ నగరాలుగా నిర్మిస్తే బాగుంటుందని సూచించింది.
ఈ ప్రాంతాల్లో మినీ నగరాలను నిర్మించేందుకు విధివిధానాలను కూడా రూపొందించినట్టు సమాచారం. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో వీటిని చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. భూసేకరణ పనులను హెచ్‌ఎండీఏ చేయాలని.. మౌలిక సదుపాయాల కల్పన వంటివాటిని ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయించినట్టు సమాచారం.
గ్రోత్ ఇంజిన్‌లా మార్చాలి
ట్రిపుల్ ఆర్‌ను రవాణాపరమైన రోడ్డుగానే కాకుండా ఒక గ్రోత్ ఇంజిన్‌లా మార్చాలి. ఇరువైపులా పరిశ్రమల ఏర్పాటుతో ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేయాలి. ట్రిపుల్ ఆర్ ప్రవేశించే జిల్లాల్లో మూడు నుంచి పదెకరాల విస్తీర్ణాలలో నైపుణ్య కేంద్రాలు, వసతి గృహాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలి. దీంతో కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. – జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
మినీ నగరాలలో ఏమేం ఉంటాయంటే..!
ఒక్కో శాటిలైట్ టౌన్‌షిప్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, సుమారు 10 లక్షల జనాభా నివాసం ఉండేందుకు వీలుగా నిర్మించనున్నారు. 100 అడుగుల అప్రోచ్ రహదారి, 30 నుంచి 60 అడుగుల అంతర్గత రహదారులు ఉంటాయి. ఈ టౌన్‌షిప్‌లలో బహుళ అవసరాల కోసం భూమిని అందుబాటులో ఉంచుతారు.
సామాన్య, మధ్యతరగతి వర్గాలకు గృహాలు, బ్యాంకులు, మార్కెట్లు, హోటళ్ల, ఇతర వాణిజ్య సదుపాయాలతోపాటు విద్యా, వైద్య అవసరాలు, పౌర సేవలు, ప్రజారవాణా, క్రీడా సదుపాయాలు, పార్కులు, ఆట స్థలాలు ఉంటాయి. కాలుష్యాన్ని విడుదల చేయని, అంతగా ప్రమాదకరంకాని పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment