ఔటర్‌పై డౌట్‌! | HMDA ORR Waiting For Hyderabad Police Permission | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై డౌట్‌!

Published Wed, May 20 2020 9:20 AM | Last Updated on Wed, May 20 2020 9:20 AM

HMDA ORR Waiting For Hyderabad Police Permission - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘లాక్‌డౌన్‌కు ముందు శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వరకు ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లి కార్యాలయంలో విధులకు హాజరయ్యేవాణ్ని. తిరిగి అదే మార్గం మీదుగా ఇంటికి చేరుకునేవాణ్ని. ఇప్పుడు ఓఆర్‌ఆర్‌లో రాకపోకలకు అనుమతివ్వకపోవడంతో వేరే మార్గాల ద్వారా వ్యయ ప్రయాసలకోర్చి కార్యాలయానికి, ఇంటికి చేరుకోవాల్సి ఉంటుంది’ అని మైండ్‌స్పేస్‌లోని ఓ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి వేణు ఆవేదన వ్యక్తంచేశారు. సాఫీ జర్నీ కోసం ఓఆర్‌ఆర్‌లో రాకపోకలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజారవాణా వ్యవస్థ మొదలుకావడంతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లోనూ అన్ని వాహనాల ప్రయాణానికి అనుమతినిచ్చే విషయంలో రెండు విభాగాల ఎదురుచూపులు వాహనదారులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా మంగళవారం నుంచే అన్ని రకాల వాహనాల రాకపోకలకు అనుమతిస్తారనుకుంటే.. ఆ బాధ్యతలు చూసేది హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)నేనని.. సైబరాబాద్, రాచకొండ పోలీసులు అంటున్నారు. హెచ్‌ఎండీఏ అధికారులు మాత్రం వాహన రాకపోకలపై నిర్ణయం తీసుకోవాల్సింది ఇరు కమిషనరేట్ల పోలీసు అధికారులేనని చెబుతున్నారు. వాహన రాకపోకలు మొదలైతే టోల్‌ఫీజు రూపంలో సంస్థ ఖాజానాకు ఆదాయం వస్తుందని, పోలీసుల నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నామని హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ విభాగాధికారులు అంటున్నారు. అయితే.. వాహన రాకపోకలపై ఒకరు నిర్ణయం తీసుకుంటామని మరొకరు వేచిచూసే ధోరణి ప్రదర్శిస్తుండడం వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అన్ని సంస్థల కార్యకలాపాలకు లాక్‌డౌన్‌ సడలింపులో అనుమతినివ్వడంతో నగరంతో పాటు శివారు ప్రాంత రోడ్లపై ప్రయాణం చేస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయని వాహనచోదకులు మండిపడుతున్నారు. ఓఆర్‌ఆర్‌ మీదుగా అనుమతిస్తే సమయంతో పాటు ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తవని చెబుతున్నారు.  

అనుమతిస్తే అందరికీ మంచిదే..  
ఓఆర్‌ఆర్‌లో ప్రస్తుతం నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్య సేవల వాహన రాకపోకలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో మంగళవారం నుంచే ఓఆర్‌ఆర్‌లో అన్నిరకాల వాహనాలకు అనుమతిస్తారని అనుకున్నారు. ప్రజారవాణా వ్యవస్థకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఓఆర్‌ఆర్‌లోనూ అనుమతి ఉంటుందని వేలాది మంది వాహనదారులు వచ్చారు. కానీ పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో చేసేదేమీ లేక నగర, శివారు ప్రాంత రోడ్ల మీదుగా వారివారి కార్యాలయాలు, గమ్యస్థానాలకు నానా అవస్థలతో వెళ్లాల్సి వచ్చింది. ఓఆర్‌ఆర్‌లో వాహన రాకపోకలకు అనుమతివ్వడం ద్వారా పోలీసులకు ట్రాఫిక్‌ నియంత్రణ కొంతమేర తగ్గుతుందని, టోల్‌ఫీజు రూపంలో హెచ్‌ఎండీఏకు ఆదాయం వస్తుందని వాహనదారులు అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement