మద్దిలో విద్యార్థులు తినకుండా వదిలేసిన అన్నం మద్దిలో పాచిపోవడంతో వేసుకోకుండా వదిలేసిన సాంబారు
విశాఖపట్నం, పద్మనాభం(భీమిలి): ఉడకని అన్నం... పాచిపోయిన సాంబారు సరఫరా చేస్తూ విద్యార్థులతో ఆడుకుంటోంది నవ ప్రయాస్ ఏజెన్సీ. మండలంలోని పలు పాఠశాలలకు మంగళవారం నవ ప్రయాస్ ఏజెన్సీ సరఫరా చేసిన సాంబారు పాచెక్కి దుర్వాసన వచ్చింది. దీంతో ఆ సాంబారుతో అన్నం తినలేక విద్యార్థులు అర్ధాకలితో అలమటించారు. మండలంలోని మద్ది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 215 మందికి సరిపడా అన్నం, సాంబారు నవ ప్రయాస్ ఏజెన్సీ నిర్వాహకులు మంగళవారం తీసుకొచ్చారు.
అన్నంలో సోమవారం మాదిరిగా మంగళవారం కూడా రాళ్లు, బెడ్డలు, ధాన్యం ఉన్నాయి. అన్నం సరిగా ఉడక్కపోవడంతో పలుకుగా ఉంది. పురుగులు కూడా ఉన్నా యి. వీటన్నింటికీ తోడు సాంబారు పాచెక్కడంతో చాలా మంది విద్యార్థులు తినలేక పారేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతం లేక మధ్యాహ్నం 1.30 గంటలకు ఉపాధ్యాయులు టమోటా అన్నం చేయించి విద్యార్థులకు పెట్టారు. అదేవిధంగా పద్మనాభం మండలంలోని కురపల్లి, భద్రయ్యపేట, బొత్సపేట, లింగన్నపేట, పద్మనాభం, ఇసకలపాలెం ప్రాథమిక పాఠశాలలకు, రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సరఫరా చేసిన సాంబార్ పాచెక్కడంతో విద్యార్థులు అన్నం తినడానికి అయిష్టత చూపారు. ఇవి కూడా నిర్ణీత సమయానికి కాకుండా ఆలస్యంగా తీసుకొచ్చారు.
విద్యార్థుల ఆరోగ్యంతోచెలగాటం
రెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాలలో భోజనాన్ని వైఎస్సార్‌సీపీ భీమునిపట్నం నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పరిశీలించారు. సాంబారు దు ర్వాసన వస్తున్నట్టు గుర్తిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకుండా వారి ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నంలో రాళ్లు, ధాన్యం
అన్నంలో సోమవారం వలే మంగళవారం కూడా రాళ్లు, ధాన్యం ఉన్నాయి. అన్నం ఉడకపోవడంతో తినడానికి పనికి రాలేదు. తినలేక అన్నాన్ని పారేశాం. ఈ అన్నాన్ని తింటే అనారోగ్యం బారిన పడతాం. అన్నం బాగుండేటట్టు జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలి.– కె.మణికంఠ, మద్ది
పాచిపోయిన సాంబారు
సాంబారు పాచెక్కిపోయింది. దీని వల్ల దుర్వాసన వచ్చింది. దీంతో అన్నం తింటే వాంతులయ్యే ప్రమాదం ఉంది. ఈ సాంబారుతో అన్నం తినలేక వదిలేశాం. ఉపాధ్యాయులు టమోటా అన్నం చేయించడంతో అది తిని కడుపు నింపుకున్నాం.– జి.ప్రసాద్, మద్ది
Comments
Please login to add a commentAdd a comment