ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్లో అన్నం, కూరలు సరిపోక ఎదురు చూస్తున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. కోడిగుడ్లు, కందిపప్పు, నూనె సరఫరాలో కాంట్రాక్టర్ల కక్కుర్తి.. అధికారుల ఉదాసీనత కారణంగావిద్యార్థులు నాణ్యత లేని భోజనాన్ని తినాల్సి వస్తోంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంతో అన్నం వండగానే ముద్దగా మారుతుండటంతో జిల్లాలోని 90 శాతం పాఠశాల్లో విద్యార్థులు ఇంటి నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. అరకొరగా ఇస్తున్న మెస్ చార్జీలతో వండి వడ్డించలేకపోతున్నామని కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులు నెత్తీనోరు బాదుకుంటున్నా సర్కారు కనికరించడం లేదు. కనీసం వారికి గౌరవ వేతనం కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. జిల్లాలోని కుకింగ్‌ఏజెన్సీలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు బకాయి పడింది. ఈ నేపథ్యంలోవిద్యార్థులకు నాణ్యమైన భోజనం
మిథ్యగా మారింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుతీరుపై శుక్రవారం ‘సాక్షి’ విజిట్‌లో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి.
సాక్షి నెట్‌వర్క్/ఒంగోలు టౌన్: అది ఒంగోలులోని పీవీఆర్ ఉన్నత పాఠశాల.. శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బెల్ కొట్టారు. విద్యార్థులు భోజనం చేసేందుకు ఉపక్రమించారు. లంచ్ బాక్స్‌లు ఓపెన్ చేసి భోజనం తింటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కదా అని అడిగితే ‘ఉడకని బియ్యం, నీళ్ల చారు, గోలీ సైజులో కోడిగుడ్డు.. ఆ అన్నం తిని ఆరోగ్యంగా ఉంటామా?’ అంటూ సమాధానమిచ్చారు. దీనిని బట్టి మధ్యాçహ్న భోజన పథకం అమలు తీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు విద్యార్థులైతే అన్న క్యాంటిన్‌కు వెళ్లి 5 రూపాయలిచ్చి అన్నం తింటున్నామంటూ చెప్పుకొచ్చారు. మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆ నిధులు నీళ్లపాలవుతున్నాయి.
జైలు కూడే నయం
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కంటే జైలు కూడే నయమంటూ విద్యార్థులు చెప్పడం గమనార్హం. వాస్తవానికి జైలు ఎలా ఉంటుందో విద్యార్థులకు తెలియదు. అయినప్పటికీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై విసుగెత్తి పైవిధంగా వ్యాఖ్యానించారు.
పాఠశాలల్లో లంచ్ బాక్సులు!
జిల్లాలో 3353 పాఠశాలలు, 31 జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మొత్తం 2,79,892 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 2,12,377 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తింటున్నారు. మిగిలిన వారంతా ఇళ్ల వద్ద నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు.
హైకోర్టు హెచ్చరించినా మారని తీరు
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. మధ్యాహ్న భోజనం జంతువులు కూడా తినవంటూ వ్యాఖ్యానించింది. అయినప్పటికీ జిల్లా విద్యాశాఖకు కనీసం చీమకుట్టినట్లు కూడా లేదు. పాఠశాలల్లో భోజనాన్ని తనిఖీ చేసి సక్రమంగా వండి వడ్డించేలా చర్యలు తీసుకోలేదు.
నిలిచిపోయిన బిల్లులు
జిల్లాలో 5,500 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు. వీరికి నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అక్టోబర్, నవంబర్ నెలల బిల్లులు చెల్లించాల్సి ఉంది. బిల్లుల కోసం ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులను ప్రైవేట్ ఏజెన్సీ పేరుతో సర్కారు భయపెడుతోంది.
నీళ్ల చారు.. మురిగిన గుడ్లు
కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 456 ప్రభుత్వ పాఠశాలుండగా 29,226 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కనిగిరి మండలం చింతలపాలెం ఉన్నత, ప్రాథమిక జనరల్, శంఖవరం హెచ్‌పీ, చింతపాలెం హెచ్‌పీ, హెచ్‌ఎంపాడులోని వాలిచర్ల ఉన్నత పాఠశాల, మొహ్మదాపురం, ముసలంపల్లి, వేముల పాడు, ప్రాథమిక పాఠశాలలను, వెలిగండ్లలో వెలిగండ్ల ప్రాథమిక పాఠశాలను, సీఎస్‌పురంలో సీఎస్‌పురం వడ్డెరపాలెం, ఎస్టీ ప్రాథమిక పాఠశాలను, పామూరులో ఉన్నత పాఠశాల, అంకాళమ్మవీధి పాఠశాల, గోపాలపురం, మోట్రాలపాడు పాఠశాలలను ‘సాక్షి’ విజిట్ చేసింది. చింతలపాలెం పాఠశాలలో విద్యార్థులు నీటి వసతి లేక బోరింగ్ నీరు తాగుతున్నారు. కొందరు ఇంటి నుంచి నీళ్ల బాటిళ్లు తెచ్చుకున్నారు. ఉన్నత పాఠశాలలో మెనూ అమలు కావడం లేదు. వెలిగండ్ల పాఠశాలలో పిల్లలకు గుడ్డు లేకుండా భోజనం వడ్డించారు. రెండు రోజుల నుంచి కోడిగుడ్డు పెట్టడం లేదని విద్యార్థులు చెప్పారు. అంకాళమ్మ వీధిలో సాంబారు నీళ్ల చారులా ఉండటంతో విద్యార్థులు తినడానికి ఇబ్బంది పడ్డారు. నాణ్యత లేని గుడ్లు సరఫరా చేయడం వల్ల అవి ఉడకబెట్టగానే రంగులు మారుతున్నాయి. ఎక్కువ శాతం స్కూళ్లలో వంటశాలలు లేక ఇంట్లో వండి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ గ్యాస్‌పై వంటలు వండాలని చెబుతోంది కానీ సిలిండర్‌పై సబ్సిడీ ఇవ్వడం లేదు. దీంతో కట్టెల పొయ్యిపైనే వంటలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment