సాక్షి, సంగారెడ్డి: దోమ కాటేస్తోంది. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, పైలేరియా, డెంగీ జ్వరాలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా మలేరియా జ్వరం వణికిస్తోంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది జిల్లాలో 52 మలేరియా కేసులు, రెండు ఫైలేరియా(బోధకాలు), ఒక డెంగీ కేసులు నిర్ధారణయ్యాయి. ఇక అధికారుల లెక్కలకు అందని కేసులు ఇంతకు మించే ఉన్నాయి. పాపన్నపేట, కొడిచెన్‌పల్లి, కొల్చారం, కంది, కొండాపూర్, సంగారెడ్డి ప్రాంతాల్లో మలేరియా ప్రభావం తీవ్రంగా ఉంది.
ఈ ఏడాది కురి సిన భారీ వర్షాలతో చెరువులు, కుంటల్లో నీళ్లు నిల్వ చేరడంతో.. దోమలు అసాధారణ రీతిలో వ్యాప్తి చెందాయి. ఈ నేపథ్యంలో దోమల లార్వలను నిర్మూలించడానికి జిల్లా మలేరియా విభాగం ఇటీవల వెల్దుర్తి, పాపన్నపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో లార్వాలను తినే గంబూషియా చేపలను విడిచి పెట్టింది. అయితే, దోమల నివారణకు గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల ఆధ్వర్యంలో చర్యల్లేకపోవడంతో జన ఆవాసాల్లో దోమల వృద్ధి తీవ్రమైంది. దోమ కాటుకు గురై ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.
కంటిమీద కునుకు కరువు
గతేడాది డెంగీ.. జిల్లా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ ఏడాది మలేరియా వణికిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 50 మందికి పైగా మలేరియా బారిన పడినట్లు వెల్లడి కాగా.. వాస్తవానికి ఈ సంఖ్య ఎన్నో రేట్లు ఎక్కువేనని పరిస్థితుల ద్వారా తెలుస్తోంది. కానీ, ఇప్పటి వరకు ఒక్క మరణాన్ని ప్రభుత్వం నిర్ధారించలేదు. బాధితులంతా చికిత్స పొంది కోలుకున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఆడ అనాఫిలిక్స్ దోమ కాటుకు గురైతే 14 రోజుల్లో తీవ్రమైన చలి జ్వరం వస్తుంది. కళ్లు ఎర్రబడడంతో పాటు నీళ్లు వస్తుంటాయి.
ఈ లక్షణాలుంటే రక్త పరీక్ష జరిపి మలేరియాగా గుర్తిస్తారు. శుభ్రమైన నీటి నిల్వల్లో ఈ దోమలు లార్వాలు పెట్టి సంతతిని వృద్ధి చేస్తాయి. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త పడడం ద్వారా ఈ దోమలను నివారించవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చిన్నకోడూరు పీహెచ్‌సీ పరిధిలో ఓ చిన్నారికి డెంగీ సోకినట్లు వైద్య శాఖ గుర్తించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అధికారికంగా డెంగీ నిర్ధారణ కాలేదు. ఆడ ఎడిస్ దోమ కాటుకు గురైతే అకస్మాత్తుగా కీళ్ల నొప్పులతో జ్వరం వస్తుంది. శరీరంపై దుద్దర్లు వస్తాయి. నోటి చిగుర్లలో రక్తం వస్తుంది.
ఈ లక్షణాలుంటే డెంగీగా అనుమానిస్తారు. రక్తంలో1.47లక్షల నుంచి 4.5లక్షల మధ్య ఉండాల్సిన ప్లేట్ లేట్ల సంఖ్య.. డెంగీ ముదిరిపోవడంతో 20 వేలకు తగ్గిపోతుంది. రోగి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకుంటాడు. డెంగీ లక్షణాలతో చాలా మంది బాధితులు ప్రైవేటు ఆస్పత్రుల పాలయ్యారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు వైద్య పరీక్షలు నిర్వహించి డెంగీగా నిర్థారించాయి కూడా. కానీ, ఐదు మాత్రమే డెంగీ అనుమానిత కేసులున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఈ ఏడాది సిద్దిపేట ప్రాంతంలో రెండు బోధకాలు(ఫైలేరియా) కేసులు నిర్ధారణయ్యాయి. తరుచుగా జ్వరం, చంకలు, గజ్జల్లో గడ్డలు ఏర్పడి రానురాను వాపుగా మారుతాయి. ఈ లక్షణాల కనిపిస్తే రాత్రి 8 గంటల తర్వాత రక్త పరీక్ష జరిపి పైలేరియాగా గుర్తిస్తారు.
దోమతో దడ
Published Fri, Dec 6 2013 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement
Advertisement