పశ్చిమ కృష్ణాపై డెంగీ పంజా
పశ్చిమ కృష్ణాపై డెంగీ పంజా విసిరింది. ఒక రోజు వ్యవధిలో ముగ్గురిని పొట్టనపెట్టుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కాగా, ఒక ఉప సర్పంచ్ ఉన్నారు. గ్రామాల్లో డెంగీ లక్షణాలతో మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో అధికారులు స్పందించి జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి,మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉంది.
చాట్రాయి : మండలంలోని మర్లపాలెం గ్రామ ఉప సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు పర్వతనేని శ్రీనివాసరావు(58) డెంగీ జ్వరం బాధపడుతూ గురువారం మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు తండ్రి పర్వతనేని సూర్యనారాయణ ప్రస్తుతం కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులకు అన్ని రకాలుగా సేవలు అందిస్తున్న శ్రీనివాసరావు అకాల మరణంపై స్థానికులు విచారం వ్యక్తంచేశారు.
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి
పెనుగంచిప్రోలు : డెంగీ వ్యాధి లక్షణాలతో పది నెలల వయసు గల ఓ చిన్నారి మృతిచెందింది. పెనుగంచిప్రోలులోని తుపాను కాలనీకి చెందిన అలవాల రాము, కవిత దంపతుల కుమార్తె శిరీష(10 నెలలు) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఆ చిన్నారికి స్థానిక ఆర్‌ఎంపీల వద్ద, నందిగామలో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో విజయవాడలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ప్లేట్‌లెట్స్ తగ్గి చిన్నారి మృతి చెందిందని వైద్యులు చెప్పారని శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెనుగంచిప్రోలుతోపాటు లింగగూడెం, గుమ్మడిదూర్రు గ్రామాల్లో కూడా విషజ్వరాలు ప్రబలడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
వీరులపాడు మండలంలో...
తాటిగుమ్మి(వీరులపాడు) : డెంగీ లక్షణాలతో వీరులపాడు మండలం తాటిగుమ్మి గ్రామంలో ఓ బాలిక మరణించింది. గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగ సునీత కుమార్తె హైమావతి (7) వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ నందిగామ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం రాత్రి రక్త కణాల సంఖ్య తగ్గిపోవడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలిస్తుండగా... మార్గమధ్యంలో మృతిచెందింది. విష జ్వరాలతో గ్రామాలు అల్లాడుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.