విష జ్వరాలతో గిరిపుత్రుల విలవిల | viral fever in agency areas of telangana | Sakshi
Sakshi News home page

విష జ్వరాలతో గిరిపుత్రుల విలవిల

Published Mon, Oct 27 2014 1:48 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

విష జ్వరాలతో గిరిపుత్రుల విలవిల - Sakshi

విష జ్వరాలతో గిరిపుత్రుల విలవిల

 డెంగీ, మలేరియాతో ఏజెన్సీల్లో మృత్యుఘోష
 
 సాక్షి, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం: తెలంగాణలో తండాలు, గూడేలు విష జ్వరాల కోరల్లో చిక్కుకున్నాయి. ఊళ్లకు ఊళ్లే మంచానపడ్డాయి. డెంగీ, మలేరియా, ఇతర వైరల్ ఫీవర్లతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న జ్వరాలతో మృత్యువు కరాళ నృత్యం చేస్తోంది. గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. వారాల తరబడి జ్వరం పీడిస్తున్నా దేవుడిపై భారం వేసి పేదలంతా మంచాలకే పరిమితమవుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులకు జ్వరంతోడై మరణాలు నిత్యకృత్యమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని కుటుంబాలన్నీ మాడిన కడుపులతోనే జ్వరాలను కాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి.  గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, అడవిబిడ్డల్లో అవగాహనా లేమికితోడు వైద్యసేవలు కరువై మారుమూల ప్రాంతాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు దారుణంగా ఉన్నా కంటితుడుపు చర్యలతోనే అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే వైద్య సేవల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం తీరు అధ్వాన్నంగా ఉంది. వరంగల్ కేంద్రానికి 15 కిలోమీటర్ల సమీపంలో ఉన్న తండాలోనూ డెంగీ మరణాలు నమోదయ్యాయి. జూన్ నుంచి వివిధ రకాల జ్వరాలతో జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 128 మంది చనిపోయారు.
 
 ఒక్క ఈ నెలలోనే 17 మందికిపైగాా మృత్యువాతపడ్డారు. జిల్లావ్యాప్తంగా 53 డెంగీ, 85 మలేరియా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. ఈ లెక్కల్లో చేరని బాధితులే ఎక్కువ మంది ఉన్నారు. ఇక ఖమ్మం ఏజెన్సీలో రెండు నెలల్లో దాదాపు 20 మంది మృత్యువాత పడ్డారు. భద్రాచలం సమీపంలోని గుండాల కాలనీలోనే ఏకంగాఏడుగురు మరణించారు. జ్వరాల నివారణకు ఏజెన్సీలో క్యాంపులు నిర్వహించిన భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యుడు రత్నప్రసాద్ సైతం డెంగీతో చనిపోవడం తీవ్రతకు అద్దంపడుతోంది. అడవిబిడ్డలు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్‌లోనూ పల్లెలన్నీ పడకేశాయి. గిరిజన ఆవాసాల్లో చావుకళ కనిపిస్తోంది. అయితే జిల్లాల్లో ఇలాంటి మరణాలను నిర్ధారించడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ సంఖ్యను తక్కువగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో సంభవిస్తున్న చాలా మరణాలు అధికారిక గణాంకాల్లోకి చేరడం లేదు. దీంతో బాధిత కుటుంబాలకు ఎలాంటి ఆసరా లభించడం లేదు. అష్టకష్టాలు పడి ప్రైవేట్‌గా చికిత్స పొందుతున్న వారి కుటుంబాలేమో ఆర్థికంగా కుదేలై వీధిన పడుతున్నాయి.
 
 తండాల్లో ఇదీ పరిస్థితి..
 
 వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, తాడ్వాయి, గూడురు, కొత్తగూడ, ములుగు తదితర మండలాల్లో గిరిజన పల్లెలు, గొత్తికోయ గూడేల్లో ఆరోగ్య సేవలు కరువయ్యాయి. అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు జ్వరాలు వస్తే చెట్ల పసర్లు, భూత వైద్యాలు, నాటు మందులతోనే సరిపెట్టుకుంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో 108 సేవలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో రవాణా విషయంలోనూ ఇక్కడి వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తీవ్రంగా జబ్బుపడిన వారిని మంచంలో పడుకోబెట్టో, డొల్లల ద్వారానో తరలించాల్సి వస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ములుగు మండలంలో ఇద్దరు, ఏటూరునాగారంలో ముగ్గురు, మంగపేట మండలంలో ముగ్గురు, కొత్తగూడ మండలంలో ఒకరితో కలిపి మొత్తం 9 మంది జ్వరాలతో చనిపోయారు. కొందరు ఆసపత్రులకు తిరిగినా, డబ్బు ఖర్చుపెట్టినా ప్రాణాలు దక్కలేదు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు వైద్యశాఖ అధికారులు ఎలాంటి క్యాంపులు నిర్వహించ డంలేదు. ఇక ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జామిని గోండు గూడెం, పొలాస బిల్లునాయక్ తండాలో ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పట్టారు. ఈ రెండు ఆవాసాల్లో సుమారు 150 వరకు కుటుంబాలుంటే వందకుపైగా గిరిజనులు మంచానికే పరిమితమయ్యారు. ఇలా జిల్లాలోని వందలాది మారుమూల గ్రామాలన్నింటిలో విష జ్వరాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. జ్వరాలను తలచుకుంటేనే జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) పరిధిలో అత్యధికంగా జ్వరాలు సోకే నివాసిత ప్రాంతాలను(హ్యాబిటేషన్లు) ఏటా సీజన్‌కు ముందే వైద్య,ఆరోగ్య శాఖ గుర్తిస్తుంది. ఏజెన్సీ ఏరియాలోని జైనూర్ పీహెచ్‌సీ పరిధిలో మొత్తం 84 హ్యాబిటేషన్లు ఉండగా, ఈసారి 28 హ్యాబిటేషన్లలో జ్వరాలు సోకే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. కానీ ఈసారి 33 ఆవాసాల్లో జ్వరాలు విజృంభించాయి. జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీ పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులన్నీ జ్వర పీడితులతో కిటకిట లాడుతున్నాయి. నాలుగు మారుమూల మండలాలకు కేంద్ర బిందువైన జైనూరు 30 పడకల ఆసుత్రికి సాధారణంగా రోజుకు వంద నుంచి రెండు వందల మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. ప్రస్తుతం ఈ సంఖ్య నాలుగు వందలకు చేరిందని స్థానిక వైద్యాధికారి తెలిపారు.
 
 విలవిల్లాడుతున్న ఏజెన్సీలు
 
 ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం జ్వరాలతో మంచం పట్టింది. రెండు నెలలుగా విషజ్వరాలతో ఇక్కడి ప్రజలు విలవిల్లాడుతున్నారు.  జిల్లాలోని చండ్రుగొండ మండలం రావికంపాడు వాసుల గోడు ఎంత వర్ణించినా తక్కువే. 2500 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో రెండు నెలలుగా ఇంటికొకరు మంచమెక్కుతున్నారు. రాష్ర్టంలోని మారుమూల ప్రాంతాల్లో పారిశుద్ధ్యలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో దోమల ఉధృతి పెరిగి మలేరియా, డెంగీ వంటి విషజ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీనికితోడు సరైన వైద్య సేవలు లేక గిరిజనులు మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. అధికారులు మొక్కుబడి చర్యలతో చేతులు దులుపుకొంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో వైద్య సేవలందించాల్సిన పీహెచ్‌సీలు రిఫరల్ కేంద్రాలుగా మారాయి. జ్వరం కాస్త ఎక్కువైతే చాలు స్థానిక వైద్యులు పెద్దాసుపత్రికి తీసుకెళ్లమంటున్నారు. అంత దూరం వెళ్లి వైద్యం చేయించుకోలేని గిరిజనులు దేవుడిపైనే భారం వేస్తున్నారు. ఏరియా ఆసుపత్రులకు కొందరు వెళుతున్నా ఎలాంటి ఫలితం ఉండటం లేదు. వైద్యులు, మందుల కొరత, సౌకర్యాల లేమితో ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్య సేవలు అందడం లేదు. కాగా, జ్వరాల బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలుతుంటే వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం డెంగీ మరణాలు లేవని పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
 
 
 ఇలాంటి  కుటుంబాలకు దిక్కెవరు?
 
 వరంగల్ జిల్లా ములుగు మండలం అన్నంపల్లి గ్రామానికి చెందిన పాడియా ప్రేమ్‌సింగ్(45)కు ఈ నెల 14న జ్వరం వచ్చింది. స్థోమతను బట్టి స్థానిక ప్రైవేటు ఆసుపత్రుల్లో 16 వరకు చికిత్స చేయించారు. 17న జ్వరం ఎక్కువైంది. దీంతో అదేరోజు అతన్ని వరంగల్‌లోని ప్రభుత్వాసుపత్రి ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 23న మృతి చెందాడు. రూ. 30 వేలు ఖర్చయిందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రేమ్‌సింగ్ భార్య నాగమ్మ వికలాంగురాలు. కొడుకు పరిస్థితి దాదాపు అంతే. ఈ కుటుంబం ఇప్పుడు వీధినపడింది.
 
 హరిశ్చంద్రనాయక్ తండా దుస్థితి
 
 వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలంలోని బైరాన్‌పల్లికి అనుబంధంగా ఉన్న గిరిజన పల్లె హరిశ్చంద్రనాయక్ తండా విషజ్వరం కోరల్లో చిక్కి అల్లాడుతోంది. 150 కుటుంబాలున్న ఈ తండాలో దాదాపు వంద కుటుంబాలు ఈ జ్వరం బారిన పడ్డాయి. సగానికిపైగా ఇళ్లలో ఒకరి కంటే ఎక్కువ మంది జ్వరపీడితులున్నారు. ఇదే తండాలో పది రోజుల క్రితం నునావత్ రాజు(35) డెంగీతో మరణించాడు. మూడేళ్లుగా ఈ తండాలో ఇప్పటివరకు 42 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారే.  
 
 జ్వరమే శాపమై.. వీధిన పడిన కుటుంబం     
 
 భద్రాచలం మండలంలోని గుండాల కాలనీలో ఒకే ఒక్క రోజు తీవ్ర జ్వరంతో బాధపడి మరణించిన కొత్తపల్లి రాంబాబు(32) కుటుంబం ఇప్పుడు దయనీయ పరిస్థితిలో ఉంది. టాక్సీ డ్రైవర్‌గా బీదరికాన్ని అనుభవిస్తున్న రాంబాబును జ్వరం రూపంలో మృత్యువు మింగేసింది. రాంబాబుకు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు కాగా, ఆయన చనిపోయే నాటికి భార్య సుజాత నిండు గర్భిణి. ఇప్పుడు ఆమెకు మరో పాప పుట్టింది. ఇంటికి పెద్ద దిక్కు చనిపోవడంతో ఈ కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరిని ఆదుకునేందుకు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గ్రామస్థులే చందాలు వేసుకుని రాంబాబు కుటుంబానికి కాస్త అండగా నిలిచారు.
 
 డెంగీతో ఇద్దరి మృతి         
 
 నిర్మల్ రూరల్/మంచిర్యాల టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో డెంగీ బారిన పడి తాజాగా ఇద్దరు మరణించారు. నిర్మల్ మండలంలోని రత్నాపూర్‌కాండ్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు ఎస్.తార(35) వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ శనివారం రాత్రి చనిపోయారు. మూడు రోజులుగా ఇక్కడి రిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో ప్రాణాలు విడిచారు. అలాగే మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడకు చెందిన కొడిపాక అభిసాయి(15) కూడా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. ఇప్పటికే తలసేమియా వ్యాధి ఉన్న అభిసాయికి వారం క్రితం డెంగీ జ్వరం వచ్చింది. మూడు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement