వైరల్ ఫీవర్తో మా చెల్లెలు చనిపోయింది!
జ్వరాల విషయంలో తెలంగణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీంతో ఈ ప్రాంతం కాస్తా అనారోగ్య తెలంగాణగా మారుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డెంగ్యూ, వైరల్ ఫీవర్లు ప్రజలను పట్టి పీడిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైరల్ ఫీవర్ కారణంగా తన సొంత చెల్లెలు చనిపోయారని, డెంగ్యూ కారణంగా భద్రాచలం ఆర్ఎంవో చనిపోయారని ఆయన చెప్పారు.
అయినా కూడా ప్రభుత్వం మాత్రం ప్రజారోగ్యానికి నిధులు విడుదల చేయట్లేదని మండిపడ్డారు. డీజిల్ లేక 108, 104 వాహనాలు నడవడం లేదని, గిరిజనులకు హెలికాప్టర్ ద్వారా వైద్యసాయం అందిస్తానన్న కేసీఆర్ మాటలు.. నీటిమూటలుగానే మిగిలిపోయాయని చెప్పారు. విషజ్వరాలతో గత నాలుగు నెలల్లో దాదాపు 120 మంది చనిపోయారని అన్నారు. ఆస్పత్రులలో చికిత్స కోసం గతంలో ఇచ్చిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు చెల్లుబాటు కావట్లేదని విక్రమార్క తెలిపారు.