సాక్షి, హైదరాబాద్: దేశాభివృద్ధిలో మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రణబ్ మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకున్ని కోల్పోయిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో ప్రణబ్ నిలిచిపోయారని కొనియాడారు. సోమవారం శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచన మేరకు సీఎం కేసీఆర్.. ప్రణబ్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రణబ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
సీఎం మాట్లాడుతూ, ‘ప్రణబ్ మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన మరణంతో దేశం శిఖర సమానుడైన నాయకుడిని కోల్పోయింది. అర్ధ శతాబ్దం పాటు భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన కర్మయోగి ప్రణబ్. 1970 తర్వాత దేశ అభివృద్ధిలో ఆయన లేని పేజీ ఉండదంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావంతో ఎదిగారు. సంకీర్ణ ప్రభుత్వాల శకం మొదలయ్యాక పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధనలో ఆయనది అమోఘమైనపాత్ర. మిత్రపక్షాలను కలుపుకొనిపోవడంలో కుడిఎడమలను సమన్వయం చేసిన సవ్యసాచిలా మన్ననలు పొందారు. పార్లమెంట్ విలువలకు నిలువెత్తు ప్రతీక’అని పేర్కొన్నారు.
తెలంగాణ చరిత్రలో ప్రణబ్..
తెలంగాణతో ప్రణబ్‌కు ఉన్న సంబంధాన్ని సీఎం గుర్తు చేశారు. ‘రాష్ట్ర ఏర్పాటుపై పార్టీల అభిప్రాయ సేకరణకు నియమించిన కమిటీకి ఆయన సారథ్యం వహించడమే కాకుండా, ప్రజల ఆకాంక్షను అధ్యయనం చేసి పరిష్కారానికై అధిష్టానానికి మార్గదర్శనం చేశారు. రాష్ట్ర అవతరణకు సహాయపడిన వారిగానే కాకుండా, రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు’అని సీఎం పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులేశారు: భట్టి
‘ప్రణబ్ దేశం గర్వించదగ్గ నాయకుడు. దేశంలో ఉత్పన్నమైన అనేక సమస్యలను ట్రబుల్ షూటర్‌గా పరిష్కరించేవారు. లోక్‌సభ, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారు.తెలంగాణ సాధనకు మార్గదర్శనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎదిగి, దేశానికి విశేష సేవలు అందించినందుకు గర్విస్తున్నాం’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొ న్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ప్రణబ్ సేవలను గుర్తుచేసుకున్నారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, సుధీర్‌రెడ్డి మాట్లాడి సంతాప తీర్మానాలను బలపరిచారు. అనం తరం ప్రణబ్ సేవలను స్పీకర్ పోచారం గుర్తు చేశారు. సభ ప్రణబ్ ముఖర్జీ మృతికి తీవ్ర సంతాపాన్ని తెలిపింది. 2 నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించింది. ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర శాసనమండలి నివాళులర్పించింది. సమావేశాలు ప్రారంభమైన అనం తరం సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి ప్రణబ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment