సోమవారం తెలంగాణ భవన్‌లో సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో పార్టీ నేతలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో రాజకీయ నాయకత్వ శూన్యత ఉందని, అయితే ఇప్పట్లో తనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సొంత పార్టీ నేతలకు స్పష్టతనిచ్చారు. 2023లోనూ రాష్ట్రంలో తిరిగి టీఆర్‌ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. శాసనసభ వాయిదా అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి దివంగత దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా పార్టీ శాసనసభా పక్షాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ సుమారు గంటపాటు ప్రసంగించారు. ‘కేంద్రంలో బీజేపీ చేస్తున్న తప్పిదాలను ఆయుధాలుగా మలచుకోవడంలో కాంగ్రెస్ పదేపదే విఫలమవుతోంది. జాతీయ పార్టీలు అభివృద్ధి, సంక్షేమాన్ని మరిచి పాకిస్తాన్ వంటి ఇతర అంశాలను బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే మీ అందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటా. జాతీయ రాజకీయాలకు సంబంధించి త్వరలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీతోనూ సమావేశం నిర్వహిస్తా. ప్రస్తుతం ఇక్కడ చేయాల్సింది ఎంతో ఉంది’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ప్రపంచంలోనే అత్యుత్తమ రెవెన్యూ చట్టం
‘బ్రిటిష్ పాలన కాలంలో తయారైన రెవెన్యూ చట్టాలే ఇంకా చెల్లుబాటులో ఉన్నాయి, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత లోపించడంతో భూ వివాదాలు పెరిగిపోతున్నాయి. సుమారు రెండు, మూడేళ్లుగా కసరత్తు చేసి దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైన రెవెన్యూ చట్టాన్ని తయారు చేశాం. ఇకపై వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగిస్తాం. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతను రిజిస్ట్రార్లు నిర్వహిస్తారు. కొత్త రెవెన్యూ చట్టం నిబంధనలకు లోబడి కొత్త పాస్‌పుస్తకాలు కూడా జారీ చేస్తాం. వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి, వారిని ఇతర చోట్ల సర్దుబాటు చేస్తాం’అని చట్టంలోని అంశాల గురించి సీఎం సుదీర్ఘంగా వివరించారు. అసెంబ్లీలో రెవెన్యూ చట్టం ఆమోదం పొందిన తర్వాత ఊరూరా బాణసంచా పేల్చి సంబురాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
దుబ్బాకను గెలుచుకుంటాం..
‘సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలుచుకుంటాం. బస్సు కిరాయిలు లేని స్థితిలో ఉన్న రామలింగారెడ్డిని రాజకీయంగా ఎంతో ప్రోత్సహించా. ఆయన కూడా ఎంతో కష్టపడి రాజకీయాల్లో రాణించాడు. ఆయన కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాం. దుబ్బాకలో గెలుస్తామంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డబ్బాలో రాళ్లు వేసినట్లు హడావుడి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో హడావుడి చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని సీఎం వ్యాఖ్యానించారు.
జీహెచ్‌ఎంసీలో వందకు పైగా సీట్లు
‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు మూడు రకాల సర్వేలు నిర్వహించగా 92 నుంచి 110 స్థానాలు వస్తాయని తేలింది. అంతమాత్రాన స్థానిక ఎమ్మెల్యేలు ఆషామాషీగా వ్యవహరించకుండా సమన్వయంతో పనిచేస్తూ, మనం చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇతర జిల్లాల ఎమ్మెల్యేల సహకారం కూడా తీసుకుంటాం’అని కేసీఆర్ ప్రకటించారు.
కరోనా పోరులో కేంద్ర సాయం శూన్యం
‘కరోనా ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పూటకో మాట చెప్తుండటంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.300 కోట్లకు పడిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. వలస కార్మికుల వెతలు చూసి ఎంతో చలించిపోయా, వారు స్వస్థలాలకు చేరుకునేందుకు కొంత గడువు ఇవ్వాలనే వినతిని కేంద్రం పట్టించుకోకుండా లాక్‌డౌన్ విధించడంతో అనేక ఇబ్బందులు పడ్డారు. కేంద్రం నుంచి సాయం అందకున్నా బీజేపీ మాత్రం దుష్ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ 18 రోజుల పాటు కొనసాగుతున్నందున సభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలను సభా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి‘అని సీఎం కేసీఆర్ శాసనసభా పక్ష సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment