సాక్షి,హైదరాబాద్: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు రాష్ట్ర నీటి వాటా హక్కులకు సంబంధించి సీఎం కేసీఆర్ రాసిన లేఖ వెనుక కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. నీటివాటా హక్కుల్ని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ లేఖ రాయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ నీటి వాటా హక్కులు సాధించుకోవడానికి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వినియోగించుకుంటారా? లేక కేంద్రంపై రాజకీయ విమర్శలకు వేదికగా వాడుకుంటారా? చెప్పాలన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి రెండ్రోజుల ముందు కేంద్రానికి లేఖ రాయడం వెనుక కారణం ఏంటని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ప్రాజెక్టును ఆపడానికి కేంద్రానికి సీఎం కేసీఆర్ ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని, షెకావత్‌కు తాను లేఖ రాస్తే రాయలసీమ ప్రాజెక్టును ఆపమని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి సూచించిందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరడం ద్వారా ఏపీ ప్రభుత్వం టెండర్ ప్రక్రియ పూర్తి కావడానికి అవకాశం కల్పించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment