పట్టు జారకుండా కట్టు తప్పకుండా | CM KCR Appoints TRS District Presidents In Telangana | Sakshi
Sakshi News home page

పట్టు జారకుండా కట్టు తప్పకుండా

Published Thu, Jan 27 2022 2:41 AM | Last Updated on Thu, Jan 27 2022 5:56 AM

CM KCR Appoints TRS District Presidents In Telangana - Sakshi

మంత్రులు, కొత్త అధ్యక్షులతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుల నియామకంలో అధినేత కేసీఆర్‌ అంచనాలకు భిన్నంగా వ్యవహరించారు. ప్రజా ప్రతినిధులు కాని వారికి జిల్లా అధ్యక్ష పదవులు దక్కుతాయని గతంలో సంకేతాలిచ్చినా, అందుకు పూర్తి విరుద్ధంగా ఎంపికచేశారు. 33 జిల్లాల అధ్యక్ష పదవుల్లో 19 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎం పీలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లకు అవకాశం దక్కింది. వీరితోపాటు అధ్యక్ష పదవి దక్కిన మరో ఆరుగురిలో ఓ మాజీ ఎమ్మెల్యే, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్, ఆయిల్‌ఫెడ్, సుడా, మున్సిపల్‌ చైర్మన్లతోపాటు మాజీ ఎంపీపీ ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవి పొందిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు మాజీ మంత్రులు కాగా.. ప్రభుత్వ చీఫ్‌ విప్, విప్‌ కూడా ఉండటం గమనార్హం. హైదరాబాద్‌ జిల్లాకు ప్రత్యేకంగా పార్టీ అధ్యక్ష పదవిని చ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులైతేనే జిల్లాల్లో పార్టీ పట్టు సడలకుండా ఉంటుం దని అధినేత భావించినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల దృష్ట్యా కూడా వీరైతేనే సమన్వయం బాగుంటుందని, పార్టీని ముందుకు తీసుకెళ్లగలరనేది సీఎం అభిప్రాయంగా చెబుతున్నారు.  

ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత
ఓవైపు వివిధ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటూనే టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవుల్లో ఎమ్మెల్యేలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కేసీఆర్‌ కసరత్తు చేశారు. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కనుండటంతో చిన్న జిల్లాల్లో స్థానిక నేతలకు అవకాశమిస్తే ఎదురయ్యే లాభనష్టాలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు అవకాశమిచ్చారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవులు దక్కిన వారి నుంచి భవిష్యత్తులో పదవుల కోసం ఎదురయ్యే డిమాండ్లనూ దృష్టిలో ఉంచుకుని ఎంపికచేశారు. పార్టీ ప్రజా ప్రతినిధులను కాకుండా ఇతరులకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే వారు ఎన్నికల సమయంలో చేజారితే ఎదురయ్యే తలనొప్పులు కూడా గమనంలో ఉంచుకుని జాబితా రూపొందించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.  

ఉద్యమ ప్రస్థానంలో వెంట ఉన్న వారికీ..
టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న వారితో పాటు ఉద్యమ సమయంలో పార్టీలో చేరినవారికి అధ్యక్ష పదవుల్లో కేసీఆర్‌ పెద్దపీట వేశారు. 2014 తర్వాత వివిధ సందర్భాల్లో ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కూడా అక్కడక్కడా జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. అలాగే పార్టీ కార్యకలాపాల్లో, అసెంబ్లీలో చురుకుగా వ్యవహరించే నేతలకు జిల్లా అధ్యక్ష పదవుల్లో ప్రాధాన్యత దక్కినట్లు జాబితా వెల్లడిస్తోంది. బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, వినయ్‌భాస్కర్, మెతుకు ఆనంద్, శంభీపూర్‌ రాజు, గువ్వల బాలరాజు తదితర యువ నేతలకు జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి.

మహిళల కోటాలో పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్‌), మాలోత్‌ కవిత (మహబూబాబాద్‌), గండ్ర జ్యోతి (భూపాలపల్లి)కి అవకాశం వచ్చింది. మాజీ మంత్రులు జోగు రామన్న (ఆదిలాబాద్‌), సి.లక్ష్మారెడ్డి (మహబూబ్‌నగర్‌) జిల్లా అధ్యక్షుల జాబితాలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీచేస్తారని భావిస్తున్న మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

వైవిధ్యంగా కార్యవర్గ కూర్పు!
జిల్లా అధ్యక్ష పదవుల నియామకం పూర్తికావడంతో పార్టీ రాష్ట్ర కార్యవర్గం కూర్పుపై టీఆర్‌ఎస్‌ అధినేత దృష్టి సారించారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర కార్యవర్గ కూర్పు అత్యంత వైవిధ్యంగా ఉండబోతోందని పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడిం చారు. ముఖ్యనేతలు, రాష్ట్ర రాజకీయాల్లో అనుభవం, సామాజిక సమీకరణల మేరకు రాష్ట్ర కార్యవర్గం ఉండబోతోందని చెబుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement