గులియన్‌ బరి డేంజర్‌ మరి | Guillain Barre is a very dangerous Virus | Sakshi
Sakshi News home page

గులియన్‌ బరి డేంజర్‌ మరి

Published Sat, Aug 24 2019 2:25 AM | Last Updated on Sat, Aug 24 2019 2:25 AM

Guillain Barre is a very dangerous Virus - Sakshi

పెద్దపల్లి జిల్లాలో ఆయనో వైద్యుడు. రెండ్రోజులుగా  రొటావైరస్‌ వ్యాక్సిన్‌పై వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాడు. ఏడాదిలోపు పిల్లలకు వేసే ఆ వ్యాక్సిన్‌ను ఎలా వేయాలో తనకుతానే నోట్లో వేసుకొని చూపించాడు. ఏమైందో ఏమోకానీ ఆ రాత్రికి ఆయనకు విరోచనాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున లేద్దామనుకునే సరికి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో కంగారుపడిన వైద్యుడి కుటుంబసభ్యులు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తదుపరి వైద్యం కోసం ఆయన్ను నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడక్కడ చికిత్స పొందుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

ఆయన రాష్ట్రంలో అత్యంత సీనియర్‌ మంత్రి. స్వయానా ఆయన తోడల్లుడి కుమారుడికి ఒక్కసారిగా కాళ్లు, చేతులు పడిపోయాయి. శరీరానికి అది వ్యాపిస్తోంది. కంగారుపడిన తోడల్లుడు వెంటనే మంత్రికి సమాచారం ఇచ్చారు. దీనిపై సంబంధిత మంత్రి వైద్యులను సంప్రదించారు. దీనికి కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు.  
 –సాక్షి, హైదరాబాద్‌

ఈ రెండే కాదు రాష్ట్రంలో ఇలాంటి కేసులు పలుచోట్ల నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య వర్గాలు గుర్తించాయి. ఈ వ్యాధిని గులియన్‌ బరి సిండ్రోమ్‌ (జీబీ సిండ్రోమ్‌) అంటారు. కాళ్లు, చేతులు చివరకు శరీరం మొత్తం వ్యాపించి నరాలు పనిచేయకుండా చచ్చుపడిపోతాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం సంభవించే అవకాశముందని వైద్య ఆరోగ్య వర్గాలు అంటున్నాయి.   

విష జ్వరాల తర్వాత వచ్చే అవకాశం.. 
ప్రస్తుతం వైరల్‌ ఫీవర్లు గణనీయంగా ఉంటుండటంతో వాటితోపాటు అక్కడక్కడా జీబీ సిండ్రోమ్‌ ఛాయలు కనిపిస్తున్నాయి. విషజ్వరాలు వచ్చిపోయాక మనిషిలో నీరసం ఉంటుంది. ఆ సమయంలో జీబీ సిండ్రోమ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి రోగికి తక్షణమే స్టిరాయిడ్స్‌ ఎక్కించాలి. పరిస్థితి చేయిదాటకముందే ఈ వైద్యం చేయడం వల్ల ప్రమాదం ఉండదంటున్నారు. ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరల్‌ ఫీవర్‌ వచ్చిన వారిలో ఎవరికో ఒకరికి మాత్రమే వ్యాప్తిచెందే అవకాశముందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.  

రొటా వికటించిందా..? : ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీన్ని మొదటిసారిగా వేయాలని సర్కారు నిర్ణయించింది. రొటా వైరస్‌ వికటించడం వల్లే ఆ డాక్టర్‌కు జీబీ సిండ్రోమ్‌ సోకిందన్న చర్చ జరుగుతోంది. అయితే అటువంటిది జరిగే అవకాశం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి.  

జీబీ సిండ్రోమ్‌ తీవ్రతపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు సహా పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. దీని వ్యాప్తి జరగకుండా అప్రమత్తం కావాలని ఆదేశించారు. 

రెండు, మూడు శాతం కేసుల్లో ప్రాణాపాయం
వైరల్‌ ఫీవర్లు వచ్చి పోయాక జీబీ సిండ్రోమ్‌ రావడానికి అవకాశముంది. ప్రస్తుతం వైరల్‌ సీజన్‌ ఉండటం వల్ల ఈ రెండు, మూడు నెలల్లో ఎవరికో ఒకరికి జీబీ సిండ్రోమ్‌ రావడానికి కొంతమేర అవకాశం ఉంది. అత్యంత తక్కువ మందిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. 7 నుంచి 10 రోజులపాటు క్రమంగా పెరిగి, తదుపరి చేసే వైద్యంతో తగ్గిపోతుంది. రెండు, మూడు శాతం కేసుల్లో మాత్రమే ప్రాణాపాయం ఉంటుంది. 
– డాక్టర్‌ చంద్రశేఖర్,చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో ఆస్పత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement