Rota virus vaccine
-
టాడ్లర్స్ డయేరియా.. చంటి పిల్లల్లో నీళ్ల విరేచనాలు
పోరాడే వయసు పిల్లలు... అంటే ఆర్నెల్ల వయసు నుంచి రెండు, మూడేళ్ల లోపు పిల్లల్ని టాడ్లర్స్ అంటారు. ఆ వయసు పిల్లల్లో వచ్చే నీళ్లవిరేచనాల్ని ‘టాడ్లర్స్ డయేరియా అంటారు. ఈ కండిషన్ చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఇలాంటి పిల్లలకు ఇచ్చే ఆహారంలో కాస్తంత పీచుపదార్థాల మోతాదులు తగ్గించాలి. వాళ్లు తాగే ΄పాలలో తీపిదనం ఎక్కువవుతున్నందున ఇలా జరిగే అవకాశముంది. అందుకే పాలలో (జ్యూస్‌ల వంటి వాటిల్లోనూ) చక్కెరని కొంతకలం పాటు మానేయాలి. పాలు తాగే పిల్లలకు పూర్తిగా తల్లి పాలే ఇవ్వాలి. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ పదార్థాలు ఉండే ఆహారాలు ఇవ్వాలి. అప్పటికీ తగ్గకపోతే వారికి రొటావైరస్ వల్లగానీ లేదా ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలా అవుతుందేమోనని అనుమానించి, వైద్యనిపుణులకు చూపించాలి. అప్పుడు వారి విరేచనాల సమస్యకు తగిన కారణాన్ని కనుగొని, అందుకు అనుగుణంగా డాక్టర్లు చికిత్స అందిస్తారు. -
దేశంలో అట్టడుగు స్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్ : పిల్లలకు టీకాలు వేయడంలో తెలంగాణ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 35వ స్థానంలో నిలిచినట్లు తెలిపింది. 2019–20లో ఇప్పటివరకు దేశంలో టీకాలు వేయడంలో తమిళనాడు 148 శాతంతో మొదటిస్థానంలో నిలవగా, అట్టడుగు స్థానంలో సిక్కిం 53.60 శాతం, ఆ తర్వాత తెలంగాణ 54.30 శాతంతో వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా, టీకాలు సరఫరా చేస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది. 2018–19లో మాత్రం తెలంగాణ 95.98 శాతం టీకాలు వేసింది. 2017–18లో 88.96 శాతం కవర్ చేసింది. కానీ ఈ ఏడాది వెనుకబడినట్లు కేంద్రం తెలిపింది.(6 నుంచి బడ్జెట్ సమావేశాలు) విటమిన్ ఏ టీకాలే తక్కువగా... యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద గిరిజనులు, ఇతర మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు వేస్తారు. మిషన్ ఇంద్రధనుష్, ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్, గ్రామ్ స్వరాజ్ అభియాన్ (జీఎస్ఏ) పథకాల కింద ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. బీసీజీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్ బీ వ్యాక్సిన్, పెంటావాలెంట్ వ్యాక్సిన్, క్రియారహిత పోలియో వైరస్ వ్యాక్సిన్ (ఐపీవీ), మీజిల్స్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్, డిఫ్తీరియా, పెర్టుసిస్–టెటానస్ (టీపీటీ), రోటావైరస్ వ్యాక్సిన్ (ఆర్వీవీ) తదితరమైనవి వేయాల్సి ఉంటుంది. ఆ టీకాలు వేయడం వల్ల సంబంధిత రోగాల నియంత్రణే లక్ష్యంగా కేంద్రం ఈ కార్యక్రమాలను చేపట్టింది. అయితే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం వ్యాక్సిన్లపై పెద్దగా శ్రద్ధ చూపించడం లేదని కేంద్ర నివేదిక చెబుతోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు 80.3 శాతమే పోలియో వ్యాక్సిన్లు వేసినట్లు తేల్చింది. అలాగే తట్టు (మీజిల్స్) టీకాలు 81.9 శాతమే వేశారు. బీసీజీ టీకాలు 83.6 శాతం మందికి వేశారు. ఇవిగాక విటమిన్ ఏ టీకాలు మూడు దశలకు సంబంధించి కేవలం 15 నుంచి 36 శాతం మధ్యే వేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పోలియో వంటి టీకాలను ఇంటింటికీ తిరిగి వేస్తున్నామని, బస్టాండ్లు, స్కూళ్లు, ఆరుబయట ఎక్కడ కనిపిస్తే అక్కడ చిన్న పిల్లలకు వేస్తున్నామని చెబుతున్నా, ఆచరణలో మాత్రం తేడా కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో టీకాలు అందుబాటులో ఉంచకపోవడం కూడా ఇంత వెనుకబాటుకు ఒక కారణంగా వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిన్న పిల్లలకు బీసీజీ, ఓరల్ పోలియో వ్యాక్సిన్, హెపటైటిస్ బీ వ్యాక్సిన్, పెంటావాలెంట్ వ్యాక్సిన్, క్రియారహిత పోలియో వైరస్ వ్యాక్సిన్ (ఐపీవీ), మీజిల్స్ రుబెల్లా (ఎంఆర్) వ్యాక్సిన్, డిఫ్తీరియా, పెర్టుసిస్–టెటానస్ (టీపీటీ), రోటావైరస్ వ్యాక్సిన్ (ఆర్వీవీ) తదితర టీకాలు వేయాల్సి ఉంటుంది. -
గులియన్ బరి డేంజర్ మరి
పెద్దపల్లి జిల్లాలో ఆయనో వైద్యుడు. రెండ్రోజులుగా రొటావైరస్ వ్యాక్సిన్‌పై వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాడు. ఏడాదిలోపు పిల్లలకు వేసే ఆ వ్యాక్సిన్‌ను ఎలా వేయాలో తనకుతానే నోట్లో వేసుకొని చూపించాడు. ఏమైందో ఏమోకానీ ఆ రాత్రికి ఆయనకు విరోచనాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున లేద్దామనుకునే సరికి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. దీంతో కంగారుపడిన వైద్యుడి కుటుంబసభ్యులు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తదుపరి వైద్యం కోసం ఆయన్ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడక్కడ చికిత్స పొందుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రాష్ట్రంలో అత్యంత సీనియర్ మంత్రి. స్వయానా ఆయన తోడల్లుడి కుమారుడికి ఒక్కసారిగా కాళ్లు, చేతులు పడిపోయాయి. శరీరానికి అది వ్యాపిస్తోంది. కంగారుపడిన తోడల్లుడు వెంటనే మంత్రికి సమాచారం ఇచ్చారు. దీనిపై సంబంధిత మంత్రి వైద్యులను సంప్రదించారు. దీనికి కారణాలేంటో అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. –సాక్షి, హైదరాబాద్ ఈ రెండే కాదు రాష్ట్రంలో ఇలాంటి కేసులు పలుచోట్ల నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య వర్గాలు గుర్తించాయి. ఈ వ్యాధిని గులియన్ బరి సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్) అంటారు. కాళ్లు, చేతులు చివరకు శరీరం మొత్తం వ్యాపించి నరాలు పనిచేయకుండా చచ్చుపడిపోతాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం సంభవించే అవకాశముందని వైద్య ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. విష జ్వరాల తర్వాత వచ్చే అవకాశం.. ప్రస్తుతం వైరల్ ఫీవర్లు గణనీయంగా ఉంటుండటంతో వాటితోపాటు అక్కడక్కడా జీబీ సిండ్రోమ్ ఛాయలు కనిపిస్తున్నాయి. విషజ్వరాలు వచ్చిపోయాక మనిషిలో నీరసం ఉంటుంది. ఆ సమయంలో జీబీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి రోగికి తక్షణమే స్టిరాయిడ్స్ ఎక్కించాలి. పరిస్థితి చేయిదాటకముందే ఈ వైద్యం చేయడం వల్ల ప్రమాదం ఉండదంటున్నారు. ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరల్ ఫీవర్ వచ్చిన వారిలో ఎవరికో ఒకరికి మాత్రమే వ్యాప్తిచెందే అవకాశముందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. రొటా వికటించిందా..? : ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీన్ని మొదటిసారిగా వేయాలని సర్కారు నిర్ణయించింది. రొటా వైరస్ వికటించడం వల్లే ఆ డాక్టర్‌కు జీబీ సిండ్రోమ్ సోకిందన్న చర్చ జరుగుతోంది. అయితే అటువంటిది జరిగే అవకాశం లేదని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంటున్నాయి. జీబీ సిండ్రోమ్ తీవ్రతపై వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సహా పలువురు ఈ సమావేశానికి హాజరయ్యారు. దీని వ్యాప్తి జరగకుండా అప్రమత్తం కావాలని ఆదేశించారు. రెండు, మూడు శాతం కేసుల్లో ప్రాణాపాయం వైరల్ ఫీవర్లు వచ్చి పోయాక జీబీ సిండ్రోమ్ రావడానికి అవకాశముంది. ప్రస్తుతం వైరల్ సీజన్ ఉండటం వల్ల ఈ రెండు, మూడు నెలల్లో ఎవరికో ఒకరికి జీబీ సిండ్రోమ్ రావడానికి కొంతమేర అవకాశం ఉంది. అత్యంత తక్కువ మందిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. 7 నుంచి 10 రోజులపాటు క్రమంగా పెరిగి, తదుపరి చేసే వైద్యంతో తగ్గిపోతుంది. రెండు, మూడు శాతం కేసుల్లో మాత్రమే ప్రాణాపాయం ఉంటుంది. – డాక్టర్ చంద్రశేఖర్,చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో ఆస్పత్రి -
భారత్‌లో రోటావైరస్ వ్యాక్సిన్
♦ చారిత్రక ఘట్టానికి తెరదీసిన కేంద్రం ♦ తొలి విడతగా ఏపీ సహా 4 రాష్ట్రాల్లో భువనేశ్వర్: ఏటా దేశంలో లక్షమంది పిల్లల ప్రాణాలు తీసుకుంటున్న అతిసార నియంత్రణకు కేంద్రం చారిత్రక చర్య చేపట్టింది. శనివారమిక్కడ ఓ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా రోటావైరస్ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు. చిన్నారుల రోగనిరోధక శక్తిని బలపరిచేలా చర్యలు తీసుకోవటం చాలా అవసరమనిచ అందుకోసమే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రొగ్రామ్ (యూఐపీ)లో భాగంగా.. పోలియా, మశూచి, రోటావైరస్, అడల్ట్ జపనీస్ ఎన్సెఫిలిటీస్ వ్యాధులకు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ‘ఇది భారత ఆరోగ్య వ్యవస్థలో మైలు రాయి. ఈ టీకాలతో దేశంలోని 2.7 కోట్ల మంది పిల్లలను 12 ప్రాణాంతకమైన వ్యాధులనుంచి రక్షించటం లక్ష్యంగా పెట్టుకున్నాం. దీంతో పాటు కుష్టు, టీబీ వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తి స్థాయిలో పార దోలేందుకు కృషిచేస్తున్నాం’ అని తెలిపారు. రోటా వైరస్ టీకాను మొదటి విడతగా.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌ల్లోని ప్రజారోగ్య కేంద్రాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నామని.. దశల వారిగా దేశమంతా దీన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అన్ని రాష్ట్రాల కంటే ఒడిశాలో అతిసారం కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఒడిశాలోని మొత్తం వ్యాధులు సోకినవారిలో 9.2 శాతం డయేరియా రోగులే. ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేటు 8, హరియాణాలో 8.5, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో 5.5 శాతంగా ఉంది.