సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డెంగీ, మలేరియా, డయేరియా వంటి విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో ఔషధగుణాలున్న బొప్పాయి పండ్లకు ఎన్నడూ లేనంత గిరాకీ పెరిగింది. మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గట్లు బొప్పాయి సరఫరా లేకపోవడంతో ధరలు అమాంతం పెరిగాయి. అన్ని జిల్లా, మండల ప్రధాన ఆస్పత్రులన్నీ డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులతో నిండిపోతున్నాయి. దీనికితోడు వర్షాల సీజన్ కావడంతో కలుషిత నీటితోనూ ఇతర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో రోగులు బొప్పాయి పండ్లను ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇంకా పలు రకాల మేలు కలుగుతుందని చెబుతున్నారు.
ఎక్కడ నుంచి సరఫరా...
రాష్ట్రంలో పెద్ద సైజు బొప్పాయి పండ్లు అధికంగా ఖమ్మం, జహీరాబాద్, కల్వకుర్తి, అచ్చంపేట, ఒంగోలు నుంచి, చిన్నసైజు బొప్పాయిలు నల్లగొండ, వరంగల్, కర్ణాటకలోని గుల్బర్గా, ఏపీలోని నూజివీడుల నుంచి హైదరాబాద్‌కు వస్తోంది.
ధర.. దడదడ
గత ఏడాది ఇదే సమయానికి గడ్డిఅన్నారం మార్కెట్‌లో హోల్‌సేల్ వ్యాపారులు పెద్దరకం బొప్పాయి కిలో రూ.8 నుంచి రూ.10కి విక్రయించారు. అది కాస్త ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40కి పెరిగింది. దీన్ని రిటైల్ వ్యాపారులు కిలో రూ.80కి అమ్ముతున్నారు. సూపర్ మార్కెట్లలో కిలో రూ.100కి అమ్ముతున్నారు. ఇక జిల్లాల్లో పెద్దరకం బొప్పాయిలు అందుబాటులో లేవు. చిన్నసైజు బొప్పాయి ధర సైతం జిల్లాలో కిలో రూ.80కి తక్కువగా లేదు. అయితే, గడ్డిఅన్నారం మార్కెట్‌కు శుక్రవారం 80 టన్నుల మేర బొప్పాయి పండ్లు వచ్చినట్లు మార్కెటింగ్ వర్గాలు చెబుతున్నారు. ఇదే రీతిన మార్కెట్‌లో బొప్పాయి వస్తేనే ధరలు దిగొచ్చే అవకాశం ఉంది.
మేలు ఇలా..
- శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను నివారిస్తుంది.
- జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేసేందుకు, శరీరంలోని కొవ్వును తగ్గించడానికి దోహదపడుతుంది.
- గుండెపోటు నివారణకు, జలుబు, జ్వరంతో బాధపడేవారికి మంచి ఔషధం.. బొప్పాయి ఆకుల జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది.
- కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. ∙లివర్ సిరోసిస్ వంటి కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment