- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
- అర్బన్ ప్రాంతాల్లో ప్రచార వాహనాలు ప్రారంభం
విజయవాడ (లబ్బీ పేట) : రాష్ట్రంలో ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధులపై పూర్తి అవగాహన కలిగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. అందులో భాగంగా ప్రజలు చేయాల్సిన, చెయ్యకూడని చర్యలను తెలిపేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రవేశపెట్టిన ప్రచార వాహనాలను మంత్రి కామినేని శ్రీనివాస్ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సోమవారం జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 242 వాహనాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయన్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు ఒక వాహనం చొప్పున ఏర్పాటు చేశామని ప్రకటించారు. అందులో భాగంగా కృష్ణా జిల్లాలో 22 వాహనాలను కేటాయించామని, వాటిలో విజయవాడ పరిధిలో 14, ఇతర పట్టణాల్లో 8 పర్యటిస్తాయని తెలిపారు. రక్తంలో ప్లేట్‌లెట్స్ తగ్గిన కేసులను డెంగ్యూగా ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. డెంగ్యూ లక్షణాలతో ఉన్న రోగులకు సరైన చికిత్స అందించి నయం చేయొచ్చన్నారు.
జిల్లాలో 102 కేసులు నమోదవగా, విజయవాడలో 26, మచిలీపట్నంలో 15 మందిని గుర్తించి చికిత్స చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని పేర్కొన్నారు. ప్రయివేటు ఆస్పత్రిల్లో డెంగ్యూ లక్షణాలతో చేరిన రోగుల వివరాలు ప్రభుత్వాస్పత్రికి తప్పనిసరిగా తెలపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో ఎలీజ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మేయర్ కోనేరు శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఆర్.నాగమల్లేశ్వరి, అదనపు డీఎం అండ్ హెచ్‌వొ డాక్టర్ టీవీఎస్‌ఎన్ శాస్త్రి పాల్గొన్నారు.
'డెంగ్యూ, మలేరియాపై అప్రమత్తత అవసరం'
Published Mon, Sep 19 2016 7:11 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
Advertisement
Advertisement