సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
వ్యాధుల కాలం వచ్చేసింది. ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తాగునీరు, ఆహారం కలుషితమై భయంకరమైన డయేరియా, అతిసార, వైరల్ ఫీవర్ సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే అంటువ్యాధుల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు.
♦ పొంచి ఉన్న భయంకరమైన అంటువ్యాధులు
♦ డయేరియా, అతిసార ప్రబలే అవకాశం
♦ వైరల్ ఫీవర్లు రావచ్చంటున్న వైద్యులు
♦ జాగ్రత్తలు తప్పనిసరి
లబ్బీపేట : ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం చిత్తడిగా మారింది. డ్రెయినేజీలు పొంగి మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. మంచినీటి పైపులైన్ లీకేజీలు ఏర్పడుతున్నాయి. భయంకరమైన ఈ వాతావరణంతో తాగునీరు కలుషితమై అంటువ్యాధులు సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం కారణంగా డయేరియా, అతిసార వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈ కొలైన్, సాల్మోనెల్లా, రోటా వైరస్ అనే వేల రకాల వైరస్‌లు, బ్యాక్టీరియాలు నీరు, ఆహారంలో కలిసినప్పుడు అతిసార, డయేరియా సోకుతాయి. కొన్ని రకాల వైరస్‌ల కారణంగా నీళ్ల విరేచనాలతో పాటు రక్త విరేచనాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
రోడ్డు వెంట.. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో.. ఈగలు వాలుతున్న ఆహార పదార్థాలు తినడం వల్ల కూడా అంటువ్యాధులు సోకే అవ కాశం ఉందంటున్నారు. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వర్షంలో తడవటం వంటి కారణాలతో జలుబుతో పాటు వైరల్ ఫీవర్ కూడా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించకుంటే ప్రాణాపాయస్థితి ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆయా వ్యాధుల ఠమొదటిపేజీ తరువాయి లక్షణాలు, వాటి ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వాస్పత్రి పిడియాట్రిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎన్‌ఎస్ విఠల్‌రావు ‘సాక్షి’కి వివరించారు.
డయేరియా
వ్యాధికి కారణాలు : కలుషిత నీరు, కలుషిత ఆహారం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం
లక్షణాలు : నీళ్ల విరేచనాలు అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు విరేచనం అయితే డయేరియాగా భావించాలి.
చికిత్స : ఎక్కువసార్లు విరేచనాలు కావడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు. పొటాషియం, గ్లూకోజ్ తగ్గి షాక్‌లోకి వెళ్లిపోతారు. బీపీ పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు, మూడు నీళ్ల విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి.
అతిసార
వ్యాధి కారణాలు : కలుషిత నీరు, ఆహారంతో పాటు తాగునీటిలో విరేచనం కలవడం
లక్షణాలు : రోజులో 10 నుంచి 20సార్లు నీళ్ల విరేచనాలతో పాటు వాంతులు కూడా అవుతుంటాయి. కలుషిత నీటి వల్ల వచ్చే ఈ వ్యాధి కుటుంబ సభ్యులందరితో పాటు ఆ ప్రాంతంలోని చాలామందికి ఒకేసారి సోకుతుంది. రోగి త్వరగా డీహైడ్రేషన్‌కు గురై షాక్‌లోకి వెళ్లిపోతాడు. ఈ వ్యాధి చిన్నారులు, మధుమేహ రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కళ్లు లోతుకుపోవడం, నీరసించి పోవడం, చురుకుదనం తగ్గిపోయి మాట్లాడలేకపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రం కూడా తగ్గడంతో ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది.
చికిత్స : అతిసారకు గురైన వారిని ఎంత త్వరగా ఆస్పత్రి తీసుకెళ్తే అంత మంచిది.
రక్త విరేచనాలు
వ్యాధి కారణం : ఫుడ్ పాయిజన్
లక్షణాలు : తీవ్రమైన కడుపునొప్పితో రక్త విరేచనాలు అవుతుంటాయి. రక్తంతో కూడిన విరేచనం కావడం వల్ల ఇతర వ్యాధులని ప్రజలు అపోహ పడుతుంటారు. వీరితో మల పరీక్ష చేసి, వ్యాధి కారకాన్ని గుర్తించడం జరుగుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
♦ డయేరియా సోకిన రోగికి మామూలు వ్యక్తులు, చిన్నపిల్లలు దూరంగా ఉండాలి. లేకుంటే వారికి కూడా సోకే అవకాశం ఉంది.
♦ రోగిని పట్టుకున్నప్పుడు చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా వ్యాధి సోకకుండా 90 శాతం అరికట్టవచ్చు.
♦ వ్యాధి సోకిన రోగికి కొబ్బరినీళ్లు, మజ్జిగ, బార్లీనీళ్లు, కూల్‌డ్రింక్స్, ఓఆర్‌ఎస్ ద్రావణం ఇవ్వాలి.
♦ విరేచనాలు అవుతున్నప్పుడు పాలు, పండ్లు, ఆకుకూరలు ఇవ్వకూడదు. వేయించిన బ్రెడ్, లైట్ టీ, దోరగా పండిన అరటి పండు (బాగా పండినది తినకూడదు), అన్నం, పప్పు తీసుకోవచ్చు.
♦ ఈ సీజన్‌లో సాధ్యమైనంత వరకూ బయట ఆహారం తినకుండా ఉండటం, కాచి చల్లార్చిన నీరు తాగడం మంచిది.
♦ విరేచనం తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవాలి. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు.
♦ విరేచనాలు అవుతున్నప్పుడు ఒక లీటర్ నీటిలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్‌ను కలిపి 3 నుంచి 4 గంటల వ్యవధిలో మొత్తం తాగాలి.
సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండండి
విజయవాడ సెంట్రల్ : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎం.గోపీనాయక్ సూచించారు. తన చాంబర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఉత్పత్తి అయ్యి మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, మెదడువాపు, అతిసార, పచ్చకామెర్లు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పారు.
వ్యాధులపై అవగాహన కలిగించేందుకు ప్రతి శుక్రవారం డ్రైడే ర్యాలీలు, మంగళవారం మాస్ మీటింగ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాంతులు, విరేచనాలు అయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ను సంప్రదించాలని సూచించారు. చెత్తను సైడ్ డ్రెయిన్లలో పడేయడం వల్ల పారిశుధ్యం క్షీణించే అవకాశం ఉందని, నిల్వ ఉన్న, మాంసాహారాన్ని తినడం మంచిది కాదని పేర్కొన్నారు. ఏఎన్‌ఎం, కమ్యూనిటీ ఆర్గనైజర్లు రోజూ ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ ఇక్బాల్ హుస్సేన్, మలేరియా విభాగం అధికారి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.