చుట్టూ టైఫాయిడ్‌ ఉంది | Study reports a decline in typhoid cases in India | Sakshi
Sakshi News home page

చుట్టూ టైఫాయిడ్‌ ఉంది

Published Thu, Nov 29 2018 12:31 AM | Last Updated on Thu, Nov 29 2018 12:31 AM

Study reports a decline in typhoid cases in India - Sakshi

మనం సురక్షితం అనుకునే ఆహారం శుభ్రత లేని కారణంగా టైఫాయిడ్‌ను వ్యాప్తి చేయవచ్చు. ప్లాస్టిక్‌ తొడుగు ధరించి ఆహారాన్ని అందజేయాలని డిమాండ్‌ చేద్దాం. వీలైతే మన బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక గ్లౌవ్స్‌ జత ఉంచుకుని బండి దగ్గరికి వెళ్లినప్పుడు మనమే వాళ్లకు ఇద్దాం.

ఏం తెలుసు... మనకు టిఫిన్‌ కట్టిచ్చే వ్యక్తి చేతుల నుంచి మనకు టైఫాయిడ్‌ రావచ్చని. ఏం తెలుసు... వీధిలో పొంగుతున్న  డ్రైనేజీలో తడిసిన మన చెప్పులు ఇంట్లోకి  టైఫాయిడ్‌ తేవచ్చునని.  ఏం తెలుసు... బహిరంగ మలవిసర్జన  మనకు టైఫాయిడ్‌ వ్యాప్తి చేస్తుందని. ఏం తెలుసు.. చేతులు శుభ్రంగా  కడుక్కుంటూ ఉంటే టైఫాయిడ్‌ రాదని. ఏం తెలుసు... దూరప్రయాణాలు  చేసేటప్పుడు టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌  వేయించుకుంటే సురక్షితమని. తెలియకుండానే జీవితం గడిపేస్తున్నాం. చుట్టూ టైఫాయిడ్‌ ఉంది. జాగ్రత్త.టైఫాయిడ్‌ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న చాలా సాధారణ జ్వరం. పారిశుధ్ధ్య వసతులు సరిగా లేని చోట చాలా ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుంది. పారిశుద్ధ్య పరిస్థితులు నెలకొన్న పాశ్చాత్య దేశాల్లో దీని ఉనికి బాగా తక్కువేగానీ మన దేశం లాంటి ఆసియా దేశాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మురికివాడల్లో, చెత్త నిండిన నివాస ప్రాంతాల్లో టైఫాయిడ్‌ చాలా ఎక్కువగా బాధిస్తోంది. 

జబ్బు కనిపించడం ఇలా... 
ఒక వ్యక్తి శరీరంలోకి ఈ బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వారం నుంచి రెండు వారాలలో లక్షణాలు కనిపిస్తూ బయటపడుతుంది. అంటే దీని ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ (బ్యాక్టీరియా ఒంటిలోనికి ప్రవేశించి లక్షణాలు బయటపడటానికి మధ్య వ్యవధి) ఒకటి నుంచి రెండు వారాలన్నమాట. ఒకసారి టైఫాయిడ్‌ జ్వరం వస్తే అది 3 – 4 వారాల పాటు బాధిస్తుంది. 
లక్షణాలు... ∙ఆకలి బాగా మందగించడం ∙తలనొప్పి ∙గుండె స్పందనల రేటు బాగా తగ్గడం (బ్రాడీకార్డియా) ∙రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గడం (ల్యూకోపీనియా) ∙నీళ్ల విరేచనాలు (డయేరియా), పొట్టనొప్పి  ∙ఒళ్లంతా నొప్పులు ∙తీవ్రమైన జ్వరం (ఒక్కోసారి 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించి జ్వరం ఉండవచ్చు) ∙తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం ∙చాలామందిలో ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙చాలా అరుదుగా ర్యాష్‌తో పాటు మెడ, పొట్ట మీద గులాబిరంగు మచ్చలు కనిపించవచ్చు.
ఎలాంటి దుష్ప్రభావాలు రాకపోతే మూడు నాలుగు వారాల తర్వాత జ్వరం అదే తగ్గుముఖం పడుతుంది. 

నిర్థారణ 
∙మొదటివారంలో అయితే రక్త 
పరీక్షతో (బ్లడ్‌ కల్చర్‌) నిర్దిష్టంగా దీన్ని కనుగొనవచ్చు. అందుకే మొదటివారంలో నిర్వహించే రక్తపరీక్షను గోల్డ్‌స్టాండర్డ్‌ పరీక్షగా పేర్కొనవచ్చు. 
∙ఇక రెండో
వారంలో వైడాల్‌ టెస్ట్‌ అని పిలిచే సిరొలాజికల్‌ పరీక్ష (రక్తపరీక్ష)తో నిర్ధారణ చేయవచ్చు. (కొన్ని సందర్భాల్లో కొంతమంది డాక్టర్లు మొదటివారమే వైడాల్‌ పరీక్ష చేయిస్తుంటారు. అలా చేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే రోగకారక క్రిమి ఒంట్లోకి ప్రవేశించాక ఒంట్లోని రక్తంలో వాటి యాంటీబాడీస్‌ పుడతాయి. అందుకు ఒక వారం రోజులు పట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో మొదటివారమే పరీక్ష చేయించి తద్వారా వచ్చిన టైటర్‌ ఫలితాలను తప్పుగా వ్యాఖ్యానించడం వల్ల రోగికి నష్టం చేకూరుతుంది. అందుకే ఏదైనా జ్వరం వచ్చి, వారం రోజులు దాటి, రెండో వారంలోకి ప్రవేశించి, దాన్ని టైఫాయిడ్‌గా అనుమానించినప్పుడే వైడాల్‌ టెస్ట్‌ ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గ్రామీణ ప్రాంతపు వైద్యులు సైతం గుర్తించాలన్నది నిపుణుల మాట). 
∙మూడో వారంలో అయితే ఎముక మజ్జ (బోన్‌మ్యారో) కల్చర్‌ పరీక్షతో నిర్థారణ చేస్తారు. ఈ పరీక్షలతో పాటు బయటకు కనిపించే టైఫాయిడ్‌ సాధారణ లక్షణాల సాయంతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. అయితే ఇలాంటి లక్షణాలే చాలా సందర్భాల్లో కనిపిస్తాయి కాబట్టి కేవలం లక్షణాలను బట్టే నిర్ధారణ అంత సులభం కాదు. వైద్యపరీక్షల సాయంతో దీన్ని నూరుపాళ్లు కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు. 

చికిత్స 
టైఫాయిడ్‌ జ్వరానికి చికిత్స తీసుకోని  వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మరణించే అవకాశాలుంటాయి. అందుకే చికిత్స తప్పనిసరి. పైగా 104 డిగ్రీలకు పైగా జ్వరం వచ్చినప్పుడు మరికొన్ని దుష్ప్రభావాలు కూడా కనిపించవచ్చు. అందుకే టైఫాయిడ్‌ రోగులు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. పూర్తి కోర్స్‌ వాడటం కూడా అత్యావశ్యకం. అలా జరగనప్పుడు మళ్లీ మళ్లీ జబ్బు తిరగబెట్టవచ్చు. అది తీవ్రంగా కూడా పరిణమించవచ్చు. 

మల్టీ డ్రగ్‌ రెసిస్టెంట్‌ టైఫాయిడ్‌ 
ఇటీవల మందులకు లొంగని టైఫాయిడ్‌ కూడా వస్తోంది. మనం చిన్న చిన్న సమస్యలకు కూడా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్‌ వాడుతుండటం, అది కూడా సరైన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో ఉపయోగిస్తుండటంతో పాటు ఒక్కోసారి వాడాల్సిన వ్యవధి కంటే చాలా ఎక్కువ రోజుల పాటు ఆ మందుల్ని వేసుకుంటూ ఉండటం వల్ల డ్రగ్‌ రెసిస్టెంట్‌ టైఫాయిడ్‌ విస్తరిస్తోంది.  దీని లక్షణాలు టైఫాయిడ్‌ లక్షణాల్లా కనిపించవు. ఇలాంటి కేసుల్లో రోగికి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వైద్యం అందించాల్సి ఉంటుంది. విచక్షణ రహితంగా యాంటీబయాటిక్స్‌ వాడే వారిలో టైఫాయిడ్‌ వచ్చిందంటే అది ఒక పట్టాన తగ్గక చాలా ఇక్కట్లకు గురిచేస్తోంది. 

టీకా అందుబాటులో... 
టైఫాయిడ్‌కు టీకా అందుబాటులో ఉంది. ఈ టీకా వల్ల 60 నుంచి 70 శాతం వరకు నివారణ సాధ్యమవుతుంది. టైఫాయిడ్‌ టీకాల్లో రకాలు: 
∙ఇన్‌యాక్టివేటెడ్‌ టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌ : ఇందులో టైఫాయిడ్‌ను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను నిర్వీర్యం (ఇన్‌యాక్టివేట్‌) చేసి, ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. 
∙లైవ్‌ టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌ : ఇందులో బలహీన పరచిన టైఫాయిడ్‌ టీకాను నోటి ద్వారా (ఓరల్‌గా) ఇస్తారు. 
దూరప్రయాణాలు చేస్తూ బయటి ఆహారం తీసుకునేవాళ్లు టీకా తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే ఒక్కోసారి టైఫాయిడ్‌ జ్వరం కిడ్నీ ఫెయిల్యూర్, పొట్టలోని అంతర్గత అవయవాల్లో రక్తస్రావం, మెదడు పనితీరును ప్రభావితం చేయడం వంటి తీవ్రమైన లక్షణాలతో మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంది. తమ ప్రయాణాలకు కనీసం రెండు మూడు వారాలకు ముందుగా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఈ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. ఈ టీకాతో కొద్దిమందిలో కాస్తంత జ్వరం, వికారం వంటివి కనిపించినా టైఫాయిడ్‌ టీకా నూరు శాతం సురక్షితమే. రూ. 150 నుంచి రూ. 525 వరకు ధరలతో ఇవి అందుబాటులో ఉన్నాయి. 

ఎలా వ్యాప్తి చెందుతుందంటే...
టైఫాయిడ్‌ జ్వరం కలుషితాహారం వల్ల ఒకరి నుంచి మరొకరికి వస్తుంది. ఇది ‘సాల్మొనెల్లా టైఫీ’ అనే గ్రామ్‌నెగెటివ్‌ బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. మానవ మలం వంటి విసర్జకాలు మంచినీళ్లలో కలిసినప్పుడు లేదా వాటితో తయారైన ఆహారపదార్థాలతో ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దీనిలోనే కాస్తంత తక్కువ తీవ్రత ఉన్న సాల్మొనెల్లా పారాటైఫీ అనే మరో రకం బ్యాక్టీరియా కూడా ఉంది. అయితే అది అంత సాధారణం కాదు. చాలా తక్కువ మందిలోనే కనిపిస్తుంది. అయితే ఇది వచ్చినా దీనికి కూడా  టైఫాయిడ్‌ మాదిరిగానే నిర్ధారణ పరీక్షలు చేయించి, చికిత్స అందించాల్సి ఉంటుంది.  మరికొంతమందిలో ఈ బ్యాక్టీరియా ఎలాంటి లక్షణాలు కలగజేయకుండా నిద్రాణంగా ఉంటుంది. వారి నుంచి ఇతరులకు ఈ జ్వరం వ్యాపించవచ్చు. ఇలాంటి వారిని వైద్యపరిభాషలో క్యారియర్స్‌ అంటారు. అన్నట్టు ఈ జీవికి ఆశ్రయం ఇచ్చే ఒకే ఒక జీవి మానవుడు మాత్రమే. మానవ విసర్జితాలతో తాగు నీరుగానీ, తినే తిండిగానీ కలుషితం కాగానే మళ్లీ బ్యాక్టీరియా మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇలా అది వ్యాప్తి చెందుతుంది. 
క్రానిక్‌ క్యారియర్స్‌  ముందే చెప్పినట్లుగా సాల్మొనెల్లా టైఫీ అనేది మానవుల్లోనే ఆవాసం ఉండే బ్యాక్టీరియా. అయితే లక్షణాలు బయటపడకుండా ఎలాంటి జబ్బూ లేకుండా ఉండే వారిలో అపరిశుభ్రమైన క్యాంటీన్లు, మురికిగా ఉండే హోటళ్లలో  పనిచేసేవారిలో ఇది దీర్ఘకాలం పాటు అంటే దాదాపు ఏడాదికిపైగా వాళ్ల గాల్‌బ్లాడర్‌లో నివాసం ఉంటుంది. వారు విసర్జించే విసర్జకాలు ఆహారంతో కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీళ్లను క్రానిక్‌ క్యారియర్స్‌గా అభివర్ణించవచ్చు. 

మేరీ టైఫాయిడ్‌ 
క్రానిక్‌ క్యారియర్స్‌ విషయంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ‘మేరీ మెలాన్‌’ అనే ఒక హాస్పిటల్‌ వంటగత్తె (కుక్‌). ఆమె ఐర్లాండ్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ ఐరిష్‌–అమెరికన్‌. టీనేజ్‌లో ఉన్నప్పుడు మేరీ మెలాన్‌ ఐర్లాండ్‌ నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు చేరింది. ఎలాంటి లక్షణాలు కనిపించని మొట్టమొదటి అమెరికన్‌ అసింప్టమేటిక్‌ క్యారియర్‌గా  ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆమె ఓ టైఫాయిడ్‌ క్యారియర్‌ అని గుర్తించాక కూడా తనలో ఎలాంటి లక్షణాలూ కనిపించనందున మేరీ ఒంటరిగా ఉండటం (ఐసోలేషన్‌లోకి వెళ్లడం)గానీ, లేదా చికిత్స తీసుకోవడం గానీ చేయలేదు. దాంతో ఆమె ఒకేసారి 51 మందికి తన ద్వారా టైఫాయిడ్‌ను వ్యాప్తిచేసింది. అందులో ముగ్గురు మరణించారు. అలా ఆమె వ్యాప్తి చేసిన టైఫాయిడ్‌కు ఆమె పేరిట ‘మేరీ టైఫాయిడ్‌’ అని పేరు రావడం ద్వారా కొంత అపకీర్తిని మూటగట్టుకుంది పాపం మేరీ మెలాన్‌.

నివారణ  
∙చేతులు కడుక్కునే అలవాటు లేనివారిలో ఇది ఎక్కువగా రావడం కనిపిస్తుంది. అందుకే తినేముందు లేదా తాగే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మల విసర్జన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. 
∙నీటిని వడపోసి కాచి చల్లార్చి తాగడం మంచిది. 
∙నేరుగా పట్టే నీటితో వేడి చేయకుండా తయారు చేసుకునే పదార్థాలతో టైఫాయిడ్‌ వ్యాపించే 
అవకాశాలు ఎక్కువ. అందుకే పానీపూరీ వంటి బయటి ఆహారాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలి.
∙అన్నం, కూరలు వేడివేడిగా ఉండగానే 
తినెయ్యాలి. ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వస్తే చల్లారిపోయాక అస్సలు తినకూడదు. 
అలాగే ఈగలు వాలడంతో కలుషితమయ్యే ఆహారాల వల్ల కూడా టైఫాయిడ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. మలం మీద వాలిన ఈగలు మళ్లీ ఆహారపదార్థాల మీద వాలడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. అందుకే ఈగలు ముసిరే ఆహారాలు, బయటి పదార్థాలను తినకపోవడం మేలు. అలాగే కలుషిత జలాలతో తయారు చేసే ఐస్‌తో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉన్నందున అది కూడా వాడకపోవడం చాలా మంచిది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement