సాక్షి, హైదరాబాద్: టైఫాయిడ్ నుంచి ఏళ్లపాటు రక్షణ కల్పించే సరికొత్త వ్యాక్సిన్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. సంప్రదాయ యాంటీబయాటిక్ మందులకు లొంగని టైఫాయిడ్‌ను కూడా నయం చేయగల ఈ మందు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. అవకాశాలు కల్పిస్తే భారత్ ఎవరికీ తీసిపోదనేందుకు పూర్తిగా దేశీయ సాంకేతికతతో తయారైన ‘టైఫ్‌బార్–టీసీవీ’నిదర్శనమని పేర్కొన్నారు. తాజాగా అందరికీ పంపిణీ చేసేందుకు ఈ వ్యాక్సిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అర్హత సాధించింది. ఈ సందర్భంగా బుధవారం వ్యాక్సిన్ వివరాలను కృష్ణ ఎల్లా వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
అంత సామాన్యమైనది కాదు..
టైఫాయిడ్ అంటే ఒకట్రెండు ఇంజెక్షన్లు వేసుకుని నాలుగు మాత్రలు వాడితే తగ్గిపోయే వ్యాధి అన్నది చాలామందిలో ఉన్న అభిప్రాయం. అయితే వాస్తవ పరిస్థితులు అలా లేవు. కలుషిత ఆహారం, తాగునీటిలోని సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది. జ్వరం, తలనొప్పి, అతిసారం వంటి లక్షణాలుండే టైఫాయిడ్ సోకితే మూడు రోజుల నుంచి 25 రోజుల పాటు ఉంటుంది. వ్యాధి చికిత్సకు ప్రస్తుతం మూడు రకాల యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. ఎస్.టైఫీ బ్యాక్టీరియా ఈ మూడింటితో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన నాలుగో తరం యాంటీబయాటిక్ మందుకూ నిరోధకత పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ సంస్థల లెక్కల ప్రకారం టైఫాయిడ్ కారణంగా 2016లో దాదాపు 1.3 లక్షల మంది మరణించారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. భారత్ బయోటెక్ 2001లోనే సరికొత్త వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఐదేళ్ల తర్వాత ప్రపంచంలోనే మొదటి కాంజుగేట్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వ్యాక్సిన్ పనితీరు, సమర్థతను పూర్తిస్థాయిలో అంచనా వేసింది. పిల్లలు, పెద్దలను కలిపి దాదాపు 15 వేల మందిపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి మెరుగైన ఫలితాలు సాధించాం.
సొంతడబ్బుతో పరిశోధనలు..
టైఫ్‌బార్–టీసీవీ వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్ సొంత డబ్బుతో పరిశోధనలు చేసిందని.. మొత్తం తాము రూ.150 కోట్ల వరకు ఖర్చు చేశామని కృష్ణ తెలిపారు. 6 నెలల పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఈ వ్యాక్సిన్ వాడొచ్చని.. దాదాపు 25 మైక్రోగ్రాముల డోసుతో టైఫాయిడ్‌కు దూరం కావొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఒక్కో డోసుకు రూ.1,500 వరకు ఖర్చు అవుతుందని.. వాడకం పెరిగిన కొద్దీ ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాలిచ్చే నిపుణుల బృందం కూడా ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయాల్సిందిగా సూచించిందని వివరించారు. జనాభా మొత్తానికి వేర్వేరు వ్యాధుల నుంచి టీకాల ద్వారా రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన ‘గావీ’సంస్థ వచ్చే ఏడాది దాదాపు 8.5 కోట్ల డాలర్లతో టైఫాయిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు భారత్ బయోటెక్ యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, టైఫాయిడ్ వ్యాక్సిన్ కన్సార్షియం, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, పాథ్, గేట్స్ ఫౌండేషన్‌ల భాగస్వామ్యంతో నేపాల్, మలావీ, బంగ్లాదేశ్‌లలో ఈ వ్యాక్సిన్‌పై మరిన్ని పరీక్షలు చేసేందుకు ప్రయత్నిస్తోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment