Telangana: టైఫాయిడ్‌ విజృంభిస్తోంది.. జాగ్రత్త! | Typhoid Cases On Rise In Telangana | Sakshi
Sakshi News home page

Telangana: టైఫాయిడ్‌ విజృంభిస్తోంది.. జాగ్రత్త!

Published Wed, Jul 13 2022 2:42 AM | Last Updated on Wed, Jul 13 2022 7:31 AM

Typhoid Cases On Rise In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపై టైఫాయిడ్‌ పంజా విసురుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టైఫాయిడ్‌ కేసులు పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రతీ జిల్లాలోనూ కేసులు వెలుగుచూ­డటంతో స్థానిక అధికారులను అప్రమత్తం చేసింది. ఈ ఏడాది మే, జూన్, జూలైల్లో ఇప్పటివరకు 5,549 కేసులు నమోదైనట్లు వెల్లడించింది.

అందులో అత్యధికంగా నిర్మల్‌ జిల్లాలో 908, మంచిర్యాల జిల్లాలో 658 కేసులు నమోదయ్యాయి. డెంగీ కంటే ఐదురెట్లు ఎక్కువగా టైఫాయిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. కలుషిత ఆహారం, నీరు కారణంగా టైఫాయిడ్‌ పెరుగుతు­న్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించింది. మరోవైపు ఇదేకాలంలో నీళ్ల విరేచనాల కేసులు(అక్యూట్‌ డయేరియా) 12,620 మేర నమోదయ్యాయి. అందులో ఒక్క హైదరాబాద్‌లోనే 2,089 కేసులు ఉన్నాయి. 

టైఫాయిడ్‌ జ్వరం లక్షణాలు
టైఫాయిడ్‌ను కలిగించే బ్యాక్టీరియా పేగునా­ళాల ద్వారా వ్యాపించి పేగు గోడలలోకి చొచ్చుకొని పోయి రక్తంలో కలుస్తుందని, మలం, రక్త నమూనాల ద్వారా రోగనిర్ధారణ చేయవచ్చని వైద్యులు అంటున్నారు. పిల్లలు ఎక్కువగా దీనికి ప్రభావితమవుతుంటారని, మెరుగైన పారిశుధ్యం, వ్యాధికి యాంటీబయాటిక్స్‌ తప్పనిసరి అని పేర్కొంటున్నారు. ఇది అంటువ్యాధి అయినందున అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టైఫాయిడ్‌ వచ్చినప్పుడు జ్వరం 104 డిగ్రీల ఫారిన్‌హీట్‌ వరకూ చేరుకుంటుందని, విపరీతమైన చమటలు, గాస్ట్రో ఎంటిరైటిస్, విరేచనాలు కూడా సంభవిస్తాయని చెబుతున్నారు.

రెండు వారాల తర్వాత శరీరంపై ఒక్కోసారి దద్దుర్లు, గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయని, కడుపునొప్పి కూడా రావచ్చని, ఈ వ్యాధి సోకినవారు ఎక్కువగా మగతగా ఉంటారని, మూడోవంతు రోగులకు ఛాతీ కింద, పొట్ట మీద గులాబీ రంగు మచ్చలు కనిపిస్తాయని చెబుతున్నారు. అరుదైన సందర్భాల్లో సరైన సమయంలో చికిత్స పొందకపోతే టైఫాయిడ్‌ జ్వరం వల్ల మరణం కూడా సంభవించవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. 

అప్రమత్తం చేశాం
రాష్ట్రంలో డెంగీ కంటే అధికంగా టైఫాయిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో వైద్య యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. టైఫా యిడ్‌ ప్రధానంగా కలుషిత ఆహారం, నీరు వల్లే వస్తుంది. వీధుల్లో తోపుడుబండ్లపై ఉండే ఆహార పదార్థాలు, పానీపూరీ తినడం వల్ల టైఫాయిడ్‌ సంభవించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎక్కువగా నమోదయ్యే టైఫా యిడ్‌ కేసులన్నీ పానీపూరీ కేసులే. టైఫాయి డ్‌ రాకుండా ఉండాలంటే ఆహారం వేడిగా తినాలి. మంచినీళ్లను కాచి వడపోసిన తర్వా తే తాగాలి. పానీపూరీ బండ్లు, తోపుడుబండ్లపై అమ్మే ఆరుబయట ఆహార పదార్థాల ను తినకూడదు. టైఫాయిడ్‌ లక్షణాలుంటే తక్షణమే వైద్యం తీసుకోవాలి.  
–డాక్టర్‌ శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement