మన్యాన్ని వణికిస్తున్న జ్వరాలు
పెరిగిన మలేరియా,టైఫాయిడ్ కేసులు
సెరిబ్రల్ మలేరియాతో హుకుంపేట మండలంలో ఇద్దరి మృతి
ఏజె న్సీలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా మలేరియా, టైఫాయిడ్ జ్వర బాధితులు కనిపిస్తున్నారు. పీహెచ్‌సీలు రోగులతో కిటకిటలాడుతున్నాయి. హుకుంపేట మండలంలో సెరిబ్రల్ మలేరియా లక్షణాలతో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు మృత్యువాత పడ్డారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని గిరిజనులు ఆవేదన వ్యక్యంచేస్తున్నారు.
పాడేరు: మన్యంలో మలేరియా మహమ్మారి విజృంభిస్తోంది. గ్రామాల్లో గిరిజనులు జ్వరాల బారిన పడుతున్నారు. మన్యంలోని ఆస్పత్రుల్లో జ్వరబాధితుల తాకిడి పెరుగుతోంది. ఈనెల ఆరంభం నుంచి మన్యంలో వర్షాలు జోరుగా కురుస్తుండటంతో జ్వరాల తీవ్రత అధికమవుతోంది. ప్రస్తుతం మన్యమంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాగునీటి కాలుష్యం వల్ల, దోమల విజృంభణ వల్ల గ్రామాల్లో గిరిజనులను టైఫాయిడ్, మలేరియా వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పాడేరు ఏరియా ఆస్పత్రిలో జూన్ 1 నుంచి మొదలుకొని ఈ 15 రోజుల వ్యవధిలో సుమారు 2 వేల మంది జ్వరబాధితులకు రక్తపరీక్షలు నిర్వహించగా 31 మలేరియా పాజిటివ్ కేసులు, 35 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. చింతపల్లి కమ్యూనిటీ ఆస్పత్రిలో 49 మలేరియా పాజిటివ్ కేసులు, జీకేవీధి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ జూన్ నెల 12 వరకు ఏజెన్సీ 36 పీహెచ్‌సీల్లోనూ ప్లాస్మోడియం వైవేక్స్ కేసులు 14, పాల్సీఫాం మలేరియా కేసులు 217 నమోదయ్యాయి. సెరిబ్రల్ మలేరియా కేసులు కూడా కొన్ని చోట్ల నమోదవుతున్నాయి. ఎక్కువగా మారుమూల ప్రాంతాల నుంచే జ్వరబాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. పాడేరు మండలంలోని ఈదులపాలెం, మినుములూరు పీహెచ్‌సీలు పరిధిలోని గ్రామాల నుంచి, చింతపల్లి మండలంలోని మొండిగెడ్డ, కొమ్మంగి, దామనపల్లి, రింతాడ ప్రాం తాల నుంచి, జీకేవీధి మండలంలో శివా రు గ్రామాల నుంచి వస్తున్న గిరిజనుల్లో వచ్చిన జ్వరబాధితులకు మలేరియా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది.
నివారణ చర్యలు అంతంత మాత్రమే
మన్యంలో ఏటా మలేరియా జ్వరాలు తిరగబెడుతున్నాయి. నివారణ చర్యలు పటిష్టంగా అమలు జరగడం లేదు. మలేరియాతోపాటు ఏజెన్సీలో టైఫాయిడ్ జ్వరాలు కూడా అధికమవుతున్నాయి. గ్రామాల్లో రక్షిత మంచినీటి సౌకర్యాలు మెరుగుపడకపోవడంతోపాటు వైద్య ఆరోగ్య సేవల కల్పనలో నిర్దిష్టమైన చర్యలు చేపట్టకపోవడం వల్ల తరచూ గిరిజనులు జ్వరాల బారిన పడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. తాగునీటి కొరత, పోషకాహార లోపం వల్ల జ్వరాల బారిన పడుతున్న గిరిజనులు త్వరగా కోలుకోలేకపోతున్నారు. సకాలంలో వైద్యసేవలు కూడా పొందలేని పరిస్థితి కొనసాగుతోంది. జ్వరాలు ప్రబలిన తర్వాత గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. మన్యంలో ఏటా ప్రబ లుతున్న మలేరియా నియంత్రణపై మా త్రం ప్రభుత్వం విఫలమవుతోంది. రెండేళ్లుగా దోమతెరల పంపిణీ ప్రతిపాదనలకే పరిమితమైంది. స్ప్రేయింగ్ పనుల్లోనూ అలసత్వం వల్ల మలేరియా నియంత్రణపై ముందస్తు చర్యలు ఎక్కడికక్కడ మలేరియా జ్వరాల తవ్రత అథికమవుతోంది.
పాడేరులో డీఎంఓ ఆఫీసు నామమాత్రం
పాడేరులో జిల్లా మలేరియా అధికారి కార్యాలయం నామమాత్రంగానే ఉంది. మన్యంలో ప్రాణాంతకమైన ఫాల్సీఫాం మలేరియా కేసులు నమోదవుతుండటం, గిరిజనుల మరణాలు సంభవిస్తుండటంతో దశాబ్దకాలం క్రిందట జిల్లా మలేరియా అధికారి కార్యాలయాన్ని పాడేరులోనే ఏర్పాటు చేశారు. ఏజెన్సీలో ఈ శాఖ సేవలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. మలేరియా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ కొరవడింది.