జిల్లాపై జ్వరాల పంజా
♦ జ్వర పీడితులతో కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
♦ ఏజెన్సీ పరిధిలోని వారికి సోకుతున్న మలేరియా
♦ పలు చోట్ల నమోదవుతున్న డయేరియా కేసులు
♦ జ్వరాలతో సతమతమవుతున్న హాస్టల్ విద్యార్థులు
సాలూరు/కురుపాం: జిల్లాపై జ్వరాల పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తుండగా... మైదాన ప్రాంతాల్లో డయేరి యా సైతం విస్తరిస్తోంది. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నారు. ఏ ఆస్పత్రికి వెళ్లినా జ్వరాలతో బాధపడుతున్నవారే దర్శనమిస్తున్నారు. ఇక వివిధ గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు సైతం జ్వరాలతో సతమతమవుతూ రోజూ ఆస్పత్రి బాట పడుతున్నా రు. సాలూరు ఆస్పత్రిలో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఒక్కో మంచానికి ఇద్దరు, ముగ్గురు వంతున సర్దుకుపోవాల్సి వస్తోంది. అయినా సరిపడకపోవడంతో ఆస్పత్రి వార్డుల్లోనున్న బల్లలపైనా కూడా వైద్యసేవలందిస్తున్నారు. ఇక్కడ ఒక్క బుధవారమే ఆస్పత్రికి వచ్చినవారు 64మంది కాగా, వారిలో 25మంది జ్వరాల బారినపడి చికిత్స పొందుతున్నారు. వీరిలో 10మందికి మలేరియా సోకినట్టు వైద్యులు నిర్థారించారు.
హాస్టళ్లలో విస్తరిస్తున్న జ్వరాలు
ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు రోజూ అధిక సంఖ్యలో ఆస్పత్రికి చేరుతుండడం గమనార్హం. సాలూరు మండలంలోని కొత్తవలస హాస్టల్ విద్యార్థి మువ్వల మనీష, పాచిపెంట మండలంలోని పి.కోనవలస హాస్టల్‌కు చెందిన కట్టెల సింహాచలంతోపాటు సాలూరు మండలం డి వెలగవలసకు చెందిన కూనేటి కీర్తన, బట్టివలసకు చెందిన గమ్మెల సింహాద్రి, వి.సంతు, రామభద్రపురం మండలం కొండగుడ్డివలసకు చెందిన నల్లజొన్న చిన్నమ్మ బుధవారం ఆస్పత్రిలో చేరారు.
పెరుగుతున్న మలేరియా బాధితులు
కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి రోజు రోజుకూ మలేరియా జ్వరపీడితుల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలసకు చెందిన గిరిజనులే జ్వరాలతో బారులు తీరుతున్నారు. బుధవారం ఒక్క రోజే పదుల సంఖ్యలో మలేరియా జ్వర పీడితులు ఆస్పత్రిలో చేరడం ఇక్కడి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రస్తుతం కురుపాం సీహెచ్‌సీలో ఏజెన్సీ గ్రామాలకు చెందిన తోయక కృష్ణారావు, చంటి, తోయక నీలయ్య, పువ్వల రోజా, గిరిజన సంక్షేమ వసతిగృహానికి చెందిన మండంగి హరీష్, వాటక రోహిత్ తోపాటు మరో పది మంది వరకు చేరారు.
గతేడాది కంటే ఎక్కువే...
కురుపాం సీహెచ్‌సీలో 2016 జనవరి నుంచి జూన్ వరకు 210 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 606 మలేరియా పాజటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మార్చి నెలలో 158 కేసులు, మేలో 123, జూన్‌లో 151 కేసులు నమోదవ్వడం చూస్తుంటే రోజురోజుకూ మలేరియా విస్తరిస్తోందనే చెప్పాలి.
ఒకే ల్యాబ్ టెక్నీషియన్‌తో రోగుల అవస్థలు
కురుపాం సీహెచ్‌సీలో ఒకే ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉండటంవల్ల నాలుగు గిరిజన మండలాల నుంచి వస్తున్న జ్వరపీడితులు రక్తపరీక్షకోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ముగ్గురు వైద్యాధికారుల్లో రోజుకొకరు చొప్పున షిఫ్ట్ డ్యూటీలు నిర్వహిస్తుండటతో వైద్య సేవలు కూడా అరకొరగానే అందుతున్నాయని గిరిజన వాపోతున్నారు.
కానరాని నివారణ చర్యలు
మలేరియా నివారణే లక్ష్యంగా ఏజన్సీలోని గ్రామాల్లో మలాథియన్ పిచికారి కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నట్టు వైద్య, ఆరోగ్యశాఖ చెబుతున్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చట్లేదని ప్రస్తుతం నమోదవుతున్న కేసులే చెబుతున్నాయి.