వ్యాధులను నియంత్రిస్తాం | Pin-point perfect program | Sakshi
Sakshi News home page

వ్యాధులను నియంత్రిస్తాం

Published Sun, Jun 8 2014 12:34 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM

Pin-point perfect program

  •      పక్కాగా పిన్‌పాయింట్ ప్రోగ్రాం
  •      అందుబాటులో వైద్యులు, సిబ్బంది
  •      ఎక్కడ నిర్లక్ష్యమున్నా.. శాఖాపరమైన చర్యలు
  •      ఐటీడీఏ పీవో  వినయ్‌చంద్
  • పాడేరు,న్యూస్‌లైన్:  ఏజెన్సీలో ఎపిడమిక్‌ను ఎదుర్కొంటామని, మలేరియాతో పాటు అన్ని సీజనల్‌వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ తెలిపారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యాధుల నియంత్రణకు ఐటీడీఏ, వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. ఏజెన్సీలోని మలేరియా తీవ్రత తగ్గుముఖం పట్టిందన్నారు.

    2010లో జనవరి నుంచి మే నెల వరకు 1498 కేసులు నమోదవ్వగా, గతేడాది 779, ప్రస్తుతం 700 మలేరియా కేసులను గుర్తించారన్నారు. దోమల నివారణ మందు పిచికారీ జరుగుతోందన్నారు. దోమతెరలను గిరిజనులు వినియోగించుకోవాలని కోరారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత లేదన్నారు. 35అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామన్నారు.

    డౌనూరు పీహెచ్‌సీకి అంబులెన్స్ లేదని, నర్సీపట్నం, కేడీపేట పీహెచ్‌సీల అంబులెన్స్‌లను అక్కడకు అనుసంధానం చేస్తున్నామన్నారు. మైదానం నుంచి 16 మంది వైద్యులను డెప్యుటేషన్‌పై ఏజెన్సీలో నియమించామన్నారు. 70 మంది మేల్ హెల్త్ అసిస్టెంట్లు, 36 మంది హెల్త్ సూపర్‌వైజర్లను కూడా ఏజెన్సీలో ఎపిడమిక్ విధులకు వినియోగిస్తున్నామని, వారంతా సోమవారం నాటికి విధులలో చేరుతారన్నారు. అన్ని సీజనల్ వ్యాధుల నియంత్రణకు వారపుసంతల్లో ప్రత్యేక వైద్య శిబిరాలతోపాటు గ్రామాలలో పిన్‌పాయింట్ ప్రోగ్రాంను పక్కాగా అమలు చేస్తున్నామన్నారు.

    హైరిస్క్ గ్రామాలపై మరింత శ్రద్ధ పెడుతున్నామన్నారు. ఎక్కడైనా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే  శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్‌పీహెచ్‌వోలు, మండల ప్రత్యేకాధికారులు నిరంతరం వైద్య ఆరోగ్య కార్యక్రమాలను తనిఖీ చేసి రోజూ నివేదికను తనకు అందజేస్తారన్నారు. పాఠశాలల విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించామన్నారు.

    గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.2 కోట్లతో యాక్షన్ ప్లాన్ కూడా జిల్లా కలెక్టర్‌కు అందజేశామన్నారు. అలాగే 13వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు వచ్చాయని, వాటితో తాగునీరు, పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగించాలని సర్పంచ్‌లను ఆదేశించామన్నారు. తాగునీటి సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు.
     సమావేశంలో ఐటీడీఏ ఏపీవో పీవీఎస్ నాయుడు, జిల్లా మలేరియాశాఖ అధికారి ప్రసాదరావు, ఇన్‌చార్జి ఏడీఎంహెచ్‌ఓ డాక్టర్ లీలాప్రసాద్ పాల్గొన్నారు.
     
    10 నుంచి ఏజెన్సీలో వైద్యశిబిరాలు...
     
    ఈ నెల 10వ తేదిన కొయ్యూరు మండలం యు.చీడిపాలెం, 15న అరకులోయ మండలం సుంకరమెట్ట, 18న పాడేరు మండలం కాశీపట్నం, 29న సీలేరులో ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నామని పీవో తెలిపారు. ఈ వైద్యశిబిరాలను గిరిజనులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
     
    జీకేవీధిలో ఆకస్మిక తనిఖీ

    గూడెంకొత్తవీధి : ఎపిడమిక్ దృష్టా మారుమూల గూడేల్లోని వారు రోగాల బారిన పడకుండా ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ శనివారం వైద్య బృందాలను అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగా  జీకేవీధి మండలంలోని ఆర్వీనగర్, జీకేవీధి పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. తొలుత జీకేవీధి పీహెచ్‌సీలో అన్ని గదులను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.

    సిబ్బంది ఇద్దరు విధులకు హాజరుకాకపోవడంతో అటెండెన్స్ రిజిస్టర్‌లో ఆబ్సెంట్ మార్కు చేశారు. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ల్యాబ్, వైద్యాధికారి గది, రోగుల గదులను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆర్వీనగర్ పీహెచ్‌సీని సందర్శించి అక్కడ రూ.3 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న కొత్త భవనాన్ని కూడా పరిశీలించారు. రికార్డులను, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.
     
    ఆరుగురికి చార్జీమెమోలు

    విధి నిర్వహణలో నిర్లక్ష్యంలో వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ హెచ్చరించారు. శనివారం జీకేవీధి, చింతపల్లి మండలం తాజంగి పీహెచ్‌సీలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన ఆర్వీనగర్ పీహెచ్‌సీ ఫార్మసిస్ట్ ఎంఆర్‌ఎన్ శ్రీనివాసరావు, ఎంపీహెచ్‌డబ్ల్యూ ఎం.అరుణకుమారి, పి.రాజుబాబులకు చార్జిమెమోలు జారీ చేశారు.

    చింతపల్లి మండలం తాజంగి పీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్ వి.ప్రసాదరావు, జీకేవీధి పీహెచ్‌సీలో ఎస్‌ఆర్ రెడ్డి, ఎం.సత్యనారాయణమ్మలు విధులకు గైర్హాజరడంతో చార్జీమెమోలను అందజేశారు. ఆర్వీనగర్, తాజంగి పీహెచ్‌సీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎపిడమిక్‌లో వ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement