సీజనల్ వ్యాధులపై అలక్ష్యం వద్దు
- అధికారులతో సమీక్షలో మంత్రి అయ్యనపాత్రుడు
విశాఖపట్నం : ఏజెన్సీలో మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పంచాయితీరాజ్ , గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు వ్యవహరించాలన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జిల్లా అధికారులు, ఏజెన్సీ వైద్యాధికారులుతో సీజనల్ వ్యాధులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వచ్చే నెల నుంచి అంటువ్యాధులు ప్రబలే వాతావరణం ప్రారంభం కానున్నందున అధికారులు ముందుగానే రంగంలోకి దిగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలన్నారు. ఏజెన్సీలో వైద్యులు కొరత, సిబ్బంది కొరత ఉన్నందున ఈ సీజన్ పూర్తయ్యే వరకూ మైదాన ప్రాంతాల్లో ఉన్న వైద్యులను వీలైనంత వరకూ ఏజెన్సీకి డెప్యుటేషన్ మీద పంపాలన్నారు.
పాడేరు ఏజెన్సీలో బోర్లు, వాటర్ ట్యాంకులు ఎన్ని ఉన్నాయి.. ఎన్ని పని చేస్తున్నాయి. అనే సమాచారాన్ని 24 గంటల్లో తనకు అందచేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్‌ఈ) శాంతానాథ్‌ను మంత్రి అయ్యన్న ఆదేశించారు. బోర్ల మరమ్మతులకు ప్రత్యేక టీంలను నియమించాలని సూచించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మాట్లాడుతూ ఏజెన్సీలో వైద్యుల కొరత సమస్యను సత్వరం పరిష్కరించాలని మంత్రి నికోరారు.
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ కొయ్యూరు మండలం యు.చీడిపాలెంలో ఏర్పాటు చేసిన పిహెచ్‌సీ ప్రజలకు అందుబాటులో లేనందున దాన్ని పలకజీడికి తరలించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మలేరియా, సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఏజెన్సీలో వైద్యసేవల గురించి పాడేరు ఐటీడీఏ పీఓ వినయ్ చంద్ మంత్రికి వివరించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ మహేశ్వర్‌రెడ్డి, అదనపు జాయింట్ కలెక్టర్ నర్శింహారావు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిని డాక్టర్ ఆర్.శ్యామల, వైద్య ఆరోగ్య శాఖ ఆర్డీ సోమయాజులు పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్దికి నిధులు కావాలి
రాష్ట్రాభివృద్ధికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖమంత్రి సిహెచ్.అయ్యన్న పాత్రుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ అతిథిగృహంలో భూగర్భజల శాఖాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు పరిశీలించి చట్టపరిధిలోకి లోబడి అనుమతులు మంజూరు చేయాలన్నారు. తద్వారా రాష్ట్రాభివృద్దికి నిధులు సమకూరుతాయన్నారు.
చెరువుల్లో మట్టి తవ్వకాలను ఆపొద్దని చెరువుల్లో మట్టిని తీయడం వల్ల నీటి నిల్వల సామర్ద్యం పెరుగుతుందన్నారు. గత ఐదేళ్ల సీనరీ మొత్తం వివరాలు నివేదిక రూపంలో అందిస్తే జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, భూగర్భ గనుల శాఖ ఉపసంచాలకులు వై.భగవత్‌రెడ్డి, సహాయ సంచాలకులు ఎస్.వెంకటేశ్వర్లు, జి.శివాజి, ఎస్.వి.రమణారావు పాల్గొన్నారు.