ఆ హామీ ... ఆచరణలో లేదేమీ...?
ఆ హామీ ... ఆచరణలో లేదేమీ...?
Published Wed, Jun 28 2017 11:11 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
- ‘తూర్పు’ ఏజెన్సీలో వరుస మరణాలు
- ప్రతి ఏడాది పునరావృతమవుతున్నా ప్రభుత్వ చర్యలు శూన్యం
- ప్రతిపాదనలు దాటని సీఎం చంద్రబాబు హామీలు
- విలీన మండలాల్లో పరిస్థితి మరింత దారుణం
- ప్రసవం కోసం తెలంగాణ వెళ్లాల్సిందే
సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఏటా మలేరియా, టైఫాయిడ్, అంతుచిక్కని వ్యాధులతో గిరిజనులు మరణిస్తున్నా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడంలేదు. సకాలంలో వ్యాధిని గుర్తించి, చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు మౌలిక వసతులు ఇక్కడ కరువయ్యాయి. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు వచ్చి ఇచ్చిన హామీలు కూడా అమలుకు నోచుకోవడంలేదు. గత ఏడాది ఏప్రిల్ 13వ తేదీన సీఎం చంద్రబాబు విలీన మండలాల పర్యటనకు వచ్చారు. చింతూరులో నిర్వహించిన బహిరంగ సభలో వరాల జల్లు కురిపించారు. అయితే ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటినా పనులు గడప దాటనివిధంగా ఉన్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన వీఆర్ పురం, ఎటపాక, చింతూరు, కూనవరం మండలాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చింతూరు ప్రాథమిక వైద్యశాలను ఏరియా ఆస్పత్రిగా మారుస్తామని, స్పెషలిస్ట్ వైద్యులను నియమించి పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు అందిస్తామని ప్రజల సాక్షిగా అప్పట్లో సీఎం ప్రకటించారు. ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మూడు నెలల్లో ఇవన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఆ హామీలేవీ ఇప్పటికీ అమలుకు నోచలేదు. ఏరియా ఆస్పత్రి కోసం ప్రకటించినా, ఆ భవనం ఇంకా పునాదుల దశలోనే ఉంది. ఆపరేషన్ థియేటర్‌ను పక్కనే ఉన్న స్కూలు భవనంలో ఏర్పాటు చేశారు. కానీ అది బోర్డులకే పరిమితమైంది. అక్కడ ఎలాంటి పరికాలు, సౌకర్యాలు లేవు. సీఎం హామీ ఇచ్చి 14 నెలలవుతున్నా భవనం పూర్తి కాలేదు. ఇక వైద్య పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేయాల్సిన ఉత్తర్వులను ఇప్పటివరకూ విడుదల చేయలేదు.
మరణాలకు అడ్డుకట్ట ఎప్పుడు?
గత ఏడాది విలీన మండలాల్లో అంతుచిక్కని కాళ్లవాపు వ్యాధితో 16 మంది మరణించారు. మాతాశిశు మరణాలతోపాటు టైఫాయిడ్, మలేరియా, విషజ్వరాలతో తరచూ చనిపోతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఏటా వర్షాకాలంలో జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలుతుంటాయి. గత ఏడాది జరిగిన మరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం మిన్నకుంది. ఫలితంగానే వై.రామవరం మండలం చాపరాయిలో 16 మంది మలేరియాతో మరణించారు. తాజాగా చింతూరులో మడివి దేవుడమ్మ (3) అనే గర్భిణి, వీఆర్ పురం మండలంలో తొమ్మిదేళ్ల చిన్నారి జశ్వంత్ మలేరియాతో సోమవారం మరణించారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడానికి వైద్యులు ఆసక్తి చూపడంలేదంటూ ప్రభుత్వం సాకులు చెపుతోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో రూ.1.30 లక్షలు ఇస్తామన్నా ఎవ్వరూ రావడం లేదని జిల్లా వైద్యాధికారులు అంటున్నారు. కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, ఇతర సిబ్బంది పోస్టులను ప్రభుత్వమే నేరుగా భర్తీ చేస్తే ఎందుకు రారన్న ప్రశ్నకు వారివద్ద సమాధానం లేదు.
ముందుగా గుర్తిస్తేనే సమస్యలకు పరిష్కారం...
బాహ్య ప్రపంచానికి దూరంగా ఎలాంటి రహదారి సౌకర్యం లేని ఏజెన్సీ గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. జ్వరాలు, ఇతర వ్యాధులు ప్రబలినప్పుడు వైద్యాధికారులు తక్షణమే గుర్తించి వైద్యసేవలు అందిస్తే ప్రాణాలు దక్కుతాయి. గర్భిణులకు ప్రారంభం నుంచి మంచి పౌష్టికాహారం అందిస్తూ తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తే మాతాశిశు మరణాలను అరికట్టవచ్చు. కానీ ఇక్కడ ఉన్న వైద్యులు, ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండడంతో అవేమీ జరగడం లేదు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 95 సబ్‌సెంటర్ల పరిధిలో 486 పోస్టులున్నాయి. వీటిలో 139 పోస్టులను భర్తీ చేయలేదు. ఇక విలీన మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చింతూరు పీహెచ్‌సీని ఏరియా ఆస్పత్రిగా మార్చినా వైద్య పోస్టులను భర్తీ చేయలేదు. ఏరియా ఆస్పత్రిలో నలుగురు సివిల్ సర్జన్లు, డెంటిస్ట్, గైనకాలజిస్ట్, మత్తు వైద్యుడు వంటి స్పెషలిస్టు పోస్టుల భర్తీ చేపట్టలేదు. స్టాఫ్‌నర్సులను నియమించలేదు. వరరామచంద్రపురం మండలం రేఖపల్లి, కూటూరు పీహెచ్‌సీల్లో వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కూనవరం సీహెచ్‌సీలో 25 మంది సిబ్బందికిగాను 15 మంది మాత్రమే ఉన్నారు. ఫలితంగా గిరిజనులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. దీంతో రంపచోడవరం పరిసర ప్రాంతాల గిరిజనులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి, విలీన మండలాల గిరిజనులు భద్రాచలం ఆస్పత్రికి వెళుతున్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చింతూరులో ఏరియా ఆస్పత్రి నిర్మాణం పూర్తయి, వైద్యాధికారులను నియమించి ఉంటే భద్రాచలం ఆస్పత్రిలో నిండు గర్భిణి మడివి దేవుడమ్మ మలేరియా వల్ల సోమవారం మరణించి ఉండేది కాదు. సిజేరియన్ చేయాలని వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా సోకినట్టు వైద్యులు గుర్తించారు. అదే ప్రారంభంలోనే గుర్తించి ఉంటే వైద్యం అందించి ఉంటే దేవుడమ్మతోపాటు, నెలలు నిండిన గర్భస్థ శిశువు కూడా ప్రాణాలతో ఉండేవారు.
సీఎం హామీల మేరకు ప్రతిపాదనలు పంపాం...
ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. చింతూరులో రెగ్యులర్ పోస్టు ఒక్కటే ఉంది. ఏరియా ఆస్పత్రికి అవసరమైన వైద్య పోస్టులు, సిబ్బంది, యంత్రాల కోసం ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి జీఓ రావాల్సి ఉంది.
- డాక్టర్ టి.రమేష్ కిశోర్, జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయ అధికారి
Advertisement
Advertisement