సాక్షి, విశాఖపట్నం: జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. పల్లె,పట్టణం తేడా లేకుండా మలేరియా, టైఫాయిడ్‌తో జనం అల్లాడిపోతున్నారు. రోజుల తరబడి మంచానపడి విలవిల్లాడుతున్నారు. పట్టించుకునేనాథుడు లేక వైద్యం కోసం అలమటిస్తున్నారు. చిన్నాపెద్దాతేడా లేకుండా మూలుగుతున్నారు. కొన్నిచోట్ల పరిస్థితి విషమించి ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేయకుండా కేవలం జాగ్రత్తలు చెప్పి సరిపుచ్చుతోంది. వెరసి ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంగా మారుతోంది.
వాతావరణంలో మార్పులతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఏజెన్సీలో మలేరియా తీవ్రత లేకున్నప్పటికీ విషజ్వరాలు పీడిస్తున్నాయి. ఈ సమయంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమై దోమల నివారణ మందు పిచికారీ చేయాలి. దోమతెరల పంపిణీతోపాటు ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలి. ప్రభుత్వ ఆస్పత్రులో క్లోరోక్విన్,ప్రైమాక్విన్,ఆర్డీ కిట్లు,ఏసీటీ ప్యాక్‌లు, క్వినైన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలి. కాని ఈశాఖలో 50 శాతం వరకు సిబ్బంది సమ్మెలో ఉండటంతో వైద్య సేవల్లో లోపం ఏర్పడుతోంది. ముఖ్యంగా రావికమతం మండలంలో పరిస్థితి చేయిదాటే వరకు వచ్చింది.
ఇక్కడి గంపవానిపాలెం శివారులోని అంట్లపాలెంలో ప్రతి ఇంటా బాధితులు ఉన్నారు. పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించింది. ఈ కారణంగా దోమలు విపరీతంగా పెరిగి పోయి జ్వరాలు సంక్రమిస్తున్నాయి. ఇటీవల తీవ్ర జ్వరాలతో కన్నంపేటకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆతర్వాత తాపీగా వైద్యాధికారులు గ్రామానికి వెళ్లి కలుషిత తాగునీటి వల్లేనని తేల్చారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధి కళ్లివానిపాలెం యాతపేటలోనూ ఇదే దుస్థితి. ఇక్కడ జ్వరాలు విజృంభించి సుమారు ఎనిమిది మంది వరకు బాధపడుతున్నారు. ఒక్కొక్కరు 20 రోజులుగా మంచానపట్టి అల్లాడుతున్నారు.
సాధారణంగా వచ్చే జ్వరాలే అని కొందరు తేలిగ్గా తీసుకుంటే మరికొందరు చికిత్సలు చేయించుకున్నారు. వీరందరికి మలేరియా ,టైఫాయిడ్ సోకినట్టు నిర్ధారించారు. ఇక్కడ చిన్నపిల్లలు సైతం ఇంటికొక్కరు అన్నట్లు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని బుచ్చెయ్యపేట, రోలుగుంట, నర్సీపట్నం, మాకవరపాలెం, చోడవరం, పాయకరావుపేట,ఎలమంచిలితోపాటు విశాఖనగరంలోను ఈజ్వరాలు రానురాను పెరుగుతున్నాయి.
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు, ప్రాంతీయ కేంద్రాలు, కేజీహెచ్‌కు ఇటువంటి జ్వరం కేసులు రోజుకు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. గతేడాది జిల్లాలో 7,66,041 మందికి రక్త పరీక్షలు నిర్వహిస్తే 7,574 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,701 కేసులు ఒక్క ఏజెన్సీలోనే ఉన్నాయి. అప్పట్లో ఒకరు మాత్రమే జ్వరంతో మతిచెందినట్లు అధికారికంగా నిర్ధారించారు.
అమ్మో... జ్వరం
Published Sat, Sep 14 2013 2:15 AM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
Advertisement