
టైఫాయిడ్‌కి కొత్త టీకా
బయోటెక్నాలజీ కంపెనీ భారత్ బయోటెక్ టైఫాయిడ్ నివారణకు కొత్త టీకా... టైప్‌బార్-టీసీవీని అందుబాటులోకి తెచ్చింది.
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బయోటెక్నాలజీ కంపెనీ భారత్ బయోటెక్ టైఫాయిడ్ నివారణకు కొత్త టీకా... టైప్‌బార్-టీసీవీని అందుబాటులోకి తెచ్చింది. సోమవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఎండీ కృష్ణ ఎల్లా, ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇనిస్టిట్యూట్ (ఐవీఐ) డెరైక్టర్ జనరల్ క్రిస్టియన్ లూక్ దీన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఉన్న టీకాలకు భిన్నంగా.. ఇది ఆరు నెలల చిన్నారులకు కూడా ఉపయోగపడుతుందని, మరింత దీర్ఘకాలం రక్షణ కల్పిస్తుందని ఈ సందర్భంగా కృష్ణ తెలిపారు. వచ్చే రెండు వారాల్లో ధరను నిర్ణయించి, మార్కెట్లో ప్రవేశపెడతామని కృష్ణ ఎల్లా చెప్పారు.
దీన్ని ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ రంగానికి కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇతర టీకాల డోసేజి ధర రూ. 180 దాకా ఉంటుండగా.. కొత్త వ్యాక్సిన్ రేటు అంతకన్నా కాస్త ఎక్కువ గా ఉండగలదన్నారు. క్లినికల్ పరీక్షలకు సంబంధించి విజయవంతమైన టైఫాయిడ్ వ్యాక్సిన్ ప్రపంచంలో ఇదే మొట్టమొదటిదని కృష్ణ చెప్పారు. 65 కోట్ల పెట్టుబడి: సుమారు 8 ఏళ్లుగా టైప్‌బార్-టీసీవీ (టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్) రూపకల్పనపై కసరత్తు చేసినట్లు కృష్ణ తెలిపారు.
ఈ నాలుగోతరం టీకాను అభివృద్ధి చేయడంపై సొంతంగా రూ. 65 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసినట్లు వివరించారు. టైఫాయిడ్ టీకాల విభాగం నుంచి ఆదాయాలు రూ.40-50 కోట్లు ఉంటున్నాయని, కొత్త ఉత్పత్తితో ఈ మొత్తం రూ.100 కోట్లకు పెరగగలదని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానంగా దేశీయ మార్కెట్‌పై దృష్టి పెట్టనున్నామని, అలాగే ఆగ్నేయాసియా తదితర దేశాల మార్కెట్లకు ఎగుమతి చేస్తామని కృష్ణ చెప్పారు. కంపెనీ ప్రస్తుత టర్నోవరు దాదాపు రూ. 300 కోట్లుగా ఉంది.
ఏటా 2 కోట్ల మందికి టైఫాయిడ్
అపరిశుభ్రత, స్వచ్ఛమైన మంచి నీరు లేకపోవడం వంటి సమస్యల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల మందికిపైగా టైఫాయిడ్ బారిన పడుతున్నారని ఐవీఐ డెరైక్టర్ జనరల్ క్రిస్టియన్ లూక్ చెప్పారు. ఇందులో సుమారు, 2,50,000-6,00,000 మంది మరణి స్తుండగా.. వీరిలో అత్యధికులు పిల్లలే ఉంటున్నారని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం ఆసియాలో ప్రధానంగా భారత్, పాకిస్థాన్‌లో టైఫాయిడ్ కేసులు అత్యధికమని లూక్ చెప్పారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాలిశాకరైడ్ తరహా టీకాలు 2 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే పనిచేస్తున్నాయని కృష్ణ చెప్పారు. పైగా వీటి ప్రభావం సుమారు మూడేళ్ల దాకా మాత్రమే ఉంటోందని, అటు పైన మరోసారి టీకా తీసుకోవాల్సి వస్తోందని వివరించారు. కానీ, వీటిని పదే పదే తీసుకున్నందు వల్ల దుష్ఫలితాలకు అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఆవిష్కరించిన టైప్‌బార్-టీసీవీ దీర్ఘకాలం పనిచేస్తుందని కృష్ణ ఎల్లా వివరించారు. దాదాపు 1,200 మందిపై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు చెప్పారు. ఇలా క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైన తొలి టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇదేనని ఆయన పేర్కొన్నారు.