వేసవిలో పొంచిన వ్యాధుల ముప్పు
♦ కలుషిత నీటితో డయేరియా, అతిసారం, టైఫాయిడ్
♦ ఇప్పటికే ఆసుపత్రుల్లో పెరుగుతున్న రోగుల సంఖ్య
♦ జాగ్రత్తలు తీసుకోకుంటే అనారోగ్యం తప్పదంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: భానుడి భగభగలకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కూలీలు, వ్యాపారులు, ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడంతో అనేకచోట్ల 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండలో తిరిగేవారికి వాంతులు, విరేచనాలు, హైఫీవర్, చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్, బీపీ పెరగడం, కిడ్నీ, గుండె వంటి ఫెయిల్యూర్, కోమాలోకి వెళ్లడం వంటివి సంభవిస్తాయని వైద్యులు అంటున్నారు. వేసవిలో నీటిఎద్దడి కారణంగా నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువని, నిల్వ ఉంచిన ఆహారపదార్థాల్లో చేరిన బ్యాక్టీరియా స్వల్ప కాలంలోనే తమ సంఖ్యను రెట్టింపు చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రతతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్న రోగులసంఖ్య పెరిగిందని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీ ప్లూయీడ్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో వడదెబ్బ బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు.
తక్షణమే వైద్య చికిత్స
రోజుకు ఐదారుసార్ల కంటే ఎక్కువగా నీళ్ల విరేచనాలు రావడం, వాంతులు, వికారం, మెలిపెట్టినట్లుగా కడుపునొప్పి ఉండటం, 101 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువ జ్వరం ఉండం, ఐదారు గంటలుగా మూత్రవిసర్జన నిలిచిపోవడం, చర్మం పొడిబారి, లాగితే సాగిపోతుండటం, బాగా నీరసించిపోవడం, నాలుక తడారిపోవడం, ఏడ్చినా కన్నీరు రానప్పుడు... ఇవన్నీ ఒంట్లోంచి నీరు గణనీయంగా తగ్గిపోయిందని గుర్తించే లక్షణాలు. అలాగే పిల్లల శరీరంపై దద్దుర్లు రావడం, నుదురు వేడిగా ఉండటం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాలి.
ఐవీ ప్లూయీడ్స్ అందుబాటులో ఉంచాలి
నాలుగైదు గంటలు ఎండల్లో తిరిగితే వడదెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బతో ఆసుపత్రులకు వచ్చేవారికి అవసరమైన ఐవీ ప్లూయీడ్స్‌ను ఇవ్వాలి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ విరివిగా అందుబాటులో ఉంచాలి. ఎండ నుంచి ఇంటికి రాగానే ఏమాత్రం నీరసంగా ఉన్నా ఒక గ్లాసుడు నీటిలో నాలుగు టీస్పూన్ల ఉప్పుతో నిమ్మకాయ రసం తాగాలి. మజ్జిగ, కొబ్బరిబొండాలు తాగించాలి. ఎక్కువ వడదెబ్బ తగిలితే చంకలు, మెడ భాగాల్లో ఐస్ ప్యాక్స్ పెట్టాలి. సాధారణ జిమ్‌లలో అతిగా ఎక్సర్‌సైజ్‌లు చేయకూడదు.
- డాక్టర్ హరిచరణ్, సీనియర్ జనరల్‌సర్జన్,సన్‌షైన్ ఆసుపత్రి, సికింద్రాబాద్