టైఫాయిడ్ టెన్షన్
Published Thu, Oct 3 2013 10:58 PM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
సాక్షి, ముంబై: నగరవాసులను టైఫాయిడ్ వణికిస్తోంది. ఇప్పటికే వివిధ వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ముంబైకర్లకు టైఫాయిడ్ తీవ్రత పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశముంటుందని బీఎంసీ ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది సెప్టెంబర్ నెలతో పొల్చుకుంటే ఈ సంవత్సరం టైఫాయిడ్ రోగుల సంఖ్య మూడింతలు పెరిగిందని చెప్పారు. గతసారి 65 మంది టైఫాయిడ్ బారిన పడితే ఈసారి 167కు చేరిందన్నారు. ఈ వ్యాధి బారినపడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యాధికారి ఓం శ్రీవాస్తవ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లోని ఆహార పదార్థాలను భుజించరాదని, కలుషిత నీటిని సేవించరాదని కోరారు.
తక్కువ నాణ్యత, చాలా రోజులుగా నిలువ చేసిన నూనెతో తయారు చేసిన పదార్థాలను తినడం వల్ల టైఫాయిడ్ సోకుతుందన్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. కలుషితమైన ఆహారాన్ని భుజించడం, సేవించడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకి ఈ వ్యాధిబారిన పడుతున్నారని ఆయన తెలిపారు. కుర్లాలోని కోహినూర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ షాహిద్ బర్మర్ మాట్లాడుతూ...ప్రతి వారం టైఫాయిడ్ బారినపడిన నలుగురు రోగులకు చికిత్స అందిస్తున్నానన్నారు.కేవలం వర్షాకాలంలోనే కాకుండా ఏడాదిపాటు నగరవాసులు ఈ వ్యాధిబారిన పడుతున్నారని ఆయన తెలిపారు. అయితే వేసవిలో వేడి తాపాన్ని తట్టుకోవడం కోసం పానీయాలలో ఎక్కువగా మంచు గడ్డ ఉపయోగిస్తూ ఉంటామని, దీనివల్ల పానీయాలు కలుషితమై ఇన్ఫెక్షన్ వచ్చి ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని తెలిపారు.
చల్లటి పదార్థాలైన ఐస్‌క్రీమ్‌లలో కూడా టైఫాయిడ్‌కు చెందిన బాక్టీరియా ఉంటుందన్నారు. ఇదిలాఉండగా చాలామంది నగరవాసులు టైఫాయిడ్‌కు చెందిన వ్యాక్సిన్ వేసుకోలేదని ప్రజా ఆరోగ్య నిపుణులు విచారం వ్యక్తం చేశారు.ఈ వ్యాక్సిన్ వేసుకుంటే 70 శాతం ఇన్ఫెక్షన్ తగ్గి ఉండేదని తెలిపారు. దీని ప్రభావం మూడేళ్ల వరకు ఉంటుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 15 నుంచి 20 మంది టైఫాయిడ్ రోగులకు చికిత్స చేశామన్నారు. టైఫాయిడ్ వ్యాధి బారినపడిన వారు వీలైనంత త్వరగా చికిత్సను పొందాలని, లేకపోతే బ్యాక్టీరియా ఇతర అవయవాలకు సోకే అవకాశం ఉందని తెలిపారు. దీంతో బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో పాటు కిడ్నీపై ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఇదిలాఉండగా సెప్టెంబర్‌లో నగరవ్యాప్తంగా 900 మంది మలేరియా రోగులు, 168 మంది డెంగీ రోగులకి చికిత్స అందించామని డాక్టర్ సామ్‌దాని తెలిపారు.
Advertisement
Advertisement