ఇంటింటా జ్వరాలే..
- మంచం పట్టిన ‘గుడివాడ’
- టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలకలతో సతమతం
- జ్వరపీడితులతో కిక్కిరిసిపోతున్న ఆస్పత్రులు
- వాతావరణ మార్పులే కారణమంటున్న వైద్యులు
గుడివాడ మంచం పట్టింది. పట్టణంలో వ్యాధులు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలక, పొంగు వంటి వ్యాధులతో ప్రజలు సతమతమవుతున్నారు. పట్టణంలోని దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులే దీనికి కారణమని తెలుస్తోంది. దాదాపు 15 రోజులుగా వ్యాధుల ప్రభావం ఉండగా, వారం రోజుల నుంచి అంటువ్యాధులు విజృంభిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
గుడివాడ : పట్టణ వాసులు వ్యాధులతో వణికిపోతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా విషజ్వరాలతో పాటు వ్యాధులు విజృంభించాయి. ఏ ప్రాంతంలో చూసినా వ్యాధులతో బాధపడే కుటుంబాలు కనిపిస్తున్నాయి. అనేక వార్డుల్లో విషజ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కి.. వెనువెంటనే చల్లబడిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. మిక్స్‌డ్ వైరస్‌ల కారణంగా వైరల్ జ్వరాలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, కళ్ల కలక, పొంగు వంటి వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పట్టణంలోని పెద ఎరుకపాడులో ప్రతి ఇంట్లో జ్వర బాధితులు ఉన్నారు. ఇంట్లో ఉన్న నలుగురికీ జ్వరాలు రావటంతో జనం ఆర్థికంగా కూడా చితికిపోతున్నారు. ఈ ప్రాంతంలో టైఫాయిడ్ రోగులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పెద ఎరుకపాడు దళితవాడలో దాదాపు 20 కుటుంబాల్లో ఇంట్లో ఉన్న వారంతా జ్వరంతో మంచం పట్టారు. దీనికితోడు కళ్ల కలకలు, పొంగు, మలేరియా వంటి వ్యాధులతో సతమతమౌతున్నారు. పట్టణంలోని గుడ్‌మేన్‌పేట, అరవ పేట, మందపాడు తదితర ప్రాంతాల్లో జ్వరాలతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దాదాపు 15 రోజుల నుంచి ఈ ప్రభావం ఉండగా వారం రోజులుగా అంటువ్యాధుల విజృంభణ మరింత పెరిగిందని వైద్యులు చెబుతున్నారు.
ప్రభుత్వాస్పత్రికి వచ్చినవారు 370 మంది...
అక్టోబర్‌లో జ్వరాలతో బాధపడుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చినవారు 370 మంది ఉన్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. వారిలో టైఫాయిడ్‌కి గురైనవారే 165 మంది ఉన్నారని పేర్కొంటున్నారు. వీరుగాక ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స చేయించుకుంటున్న వారి సంఖ్య ఇంతకు పది రెట్లు అదనంగా ఉండవచ్చని అంచనా. ప్రతిరోజూ గుడివాడలోని ఒక్కో ఆస్పత్రికి నిత్యం వందమందికి పైగా జ్వరపీడితులు వస్తున్నారని చెబుతున్నారు.
మారుతున్న వాతావరణం, తాగునీటి కాలుష్యం కారణంగా విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే విషజ్వరాల వ్యాప్తిని తగ్గించగలమని అంటున్నారు. పరిసరాల పరిశుభ్రత సరిగా లేని కారణంగా కూడా వ్యాధులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇతర అంటువ్యాధులు ఇంట్లో ఒకరి తరువాత మరొకరికి రావటంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నామని, విషజ్వరాలు వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వాతావరణంలో మార్పుల వల్లే
వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లే వ్యాధులు విజృంభిస్తున్నాయి. 18 ఏళ్ల లోపు వారికి ఎక్కువగా టైఫాయిడ్ వస్తోంది. జ్వరం వచ్చిందని బాలింతలు పిల్లలకు పాలివ్వటం మానరాదు. పాలు ఇచ్చి పిల్లల్ని దూరంగా వేరొకరికి ఇవ్వాలి. లేదంటే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడతారు. తల్లికి జ్వరం వచ్చినా పాలు ఇవ్వవచ్చు. జ్వరం వచ్చిందని పిల్లలకు ఆహారం పెట్టకుండా ఉంచరాదు. అలా చేయటం వల్ల బలహీనత ఏర్పడి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఇన్‌ఫెక్షన్లు పెరిగిపోతాయి. తినే ఆహారం, వాతావరణ పరిస్థితులు, పరిసరాల పరిశుభ్రత వంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చు.
- డాక్టర్ సుదేష్‌బాబు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్, గుడివాడ