మలేరియా, టైఫాయిడ్ తో విద్యార్థి మృతి
♦ హాస్టల్ అధికారుల నిర్లక్ష్యమే
♦ కారణమని గ్రామస్తుల మండిపాటు
బషీరాబాద్: మలేరియా, టైఫాయిడ్‌తో గురువారం ఓ విద్యార్థి మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లికి చెందిన నర్సమ్మ, కిష్టప్ప దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు బ్రహ్మానందం(15) ఉన్నా డు. బాల్యంలోనే అతడి తండ్రి చనిపోయాడు. నర్సమ్మ పిల్లలను పోషించుకుంటోంది. బాలుడు బషీరాబాద్‌లోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ 10వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు ముగియడంతో ఈనెల 18న అతడు హాస్టల్‌కు వచ్చాడు. గతనెల 28 నుంచి ఆ బాలుడికి జ్వరం రావడంతో స్కూల్‌కు వెళ్లకుండా వసతిగృహంలోనే ఉన్నాడు. జ్వరం తీవ్రమవడంతో స్వగ్రామానికి వెళ్దామని భావించాడు. చేతిలో డబ్బులు లేకపోవడంతో బుధవారం నడుచుకుంటూ బయలుదేరాడు.
మార్గమధ్యంలో నవల్గ గ్రామం వద్ద గ్రామస్తులు ఆ బాలుడిని గమనించి విషయం ఆరా తీశారు. బ్రహ్మానందంను హాస్టల్‌కు తీసుకెళ్లగా వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో స్వగ్రామానికి తీసుకెళ్లారు. కుటుంబీకులు బాలుడిని బుధవారం రా త్రి తాండూరులోని ఆస్పత్రికి తరలించా రు. వైద్యులు పరీక్షలు చేసి మలేరియా, టైఫాయిడ్ సోకిందని నిర్ధారించారు. నిరుపేద కుటుంబం కావడంతో నర్స మ్మ డబ్బులు సర్దుబాటు చేస్తుండగానే.. పరిస్థితి విషమించి గురువారం ఉద యం బ్రహ్మానందం మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకుపైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్న నర్సమ్మ.. బ్రహ్మానందం మృతితో గుండెలుబాదుకుంటూ రోదించింది. హాస్టల్‌లో సరైన సదుపాయాలు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతోనే బాలు డు మృత్యువాత పడ్డాడని నీళ్లపల్లి సర్పంచ్ ఉమ సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.