ఇది చినుకుల కాలం. వర్షాకాలంలో డ్రైనేజీలు పొంగుతూ... మానవ విసర్జకాలు మంచినీళ్లతో కలవడం మామూలే. ఆ నీళ్లు తాగడం, అలా కలుషితమైన నీళ్లతో వండిన ఆహారాలతో టైఫాయిడ్ రావడం సా«ధారణం. మురికివాడలూ, పారిశుద్ధ్యవసతి అంతగా లేని ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువ. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియమ్ టైఫాయిడ్ జ్వరానికి కారణం. ఇదే జాతికి చెందిన సాల్మొనెల్లా పారాటైఫీ అనే మరో రకం బ్యాక్టీరియా కూడా ఉంది. కాకపోతే దీంతో తీవ్రత కాస్తంత తక్కువ. ఈ సీజన్‌లో టైఫాయిడ్ వచ్చేందుకు అవకాశాలు ఉండటంతో ఈ జ్వరంపై అవగాహన కోసం ఈ కథనం.
టైఫాయిడ్ బ్యాక్టీరియా మనుగడ సాగించేది కేవలం మానవ శరీరంలోనే. కొంతమందిలో దీని లక్షణాలేమీ బయటకు కనిపించవు. కానీ వారి నుంచి ఇతరులకు బ్యాక్టీరియా వ్యాపించినప్పుడు ఇతరుల్లో టైఫాయిడ్ బయటపడవచ్చు. ఇలా లక్షణాలు లేకుండా వ్యాప్తి చేసేవారిని క్యారియర్స్ అంటారు. మురికిగా ఉండే మెస్‌లూ, క్యాంటీన్లు, అపరిశుభ్రమైన హోటళ్లలో పనిచేసేవారిలో ఇది నిద్రాణంగా ఏళ్లతరబడి ఉండే అవకాశం ఉంది. వీళ్ల విసర్జకాలతో ఆహారం కలుషితమై... ఇతరులకు వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశాలు ఎక్కువ. వీళ్లను క్రానిక్ క్యారియర్స్‌గా చెబుతారు. దేహంలోకి బ్యాక్టీరియా ప్రవేశించిన వారం లేదా రెండు వారాలలో లక్షణాలు బయటపడతాయి. టైఫాయిడ్ జ్వరమొచ్చాక అది దాదాపు 3 – 4 వారాల పాటు బాధిస్తుంది.
లక్షణాలు:
► తీవ్రమైన జ్వరం (ఒక్కోసారి 104 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు మించి)
► ఆకలి మందగించడం
► తలనొప్పి
► గుండె స్పందనలు తగ్గడం (బ్రాడీకార్డియా)
► రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య తగ్గడం (ల్యూకోపీనియా)
► కొందరిలో నీళ్ల విరేచనాలు, పొట్టనొప్పి
► ఒంటి నొప్పులు ∙తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం
► కొందరిలో ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం
► చాలా అరుదుగా కొందరిలో ర్యాష్‌తో పాటు మెడ, పొట్ట మీద గులాబీరంగు మచ్చలు కనిపించవచ్చు.
► జ్వరం కారణంగా దుష్ప్రభావాలు కనిపించకపోతే మూడు నుంచి నాలుగు వారాల్లో జ్వరం దానంతట అదే తగ్గుతుంది.
నిర్ధారణ: మొదటివారంలో రక్తపరీక్షతో (బ్లడ్ కల్చర్) కచ్చితంగా కనుగొనవచ్చు. అందుకే మొదటివారంలో చేసే రక్తపరీక్షను గోల్డ్‌స్టాండర్డ్ పరీక్షగా పేర్కొనవచ్చు. రెండోవారంలో వైడాల్ టెస్ట్ అనే రక్తపరీక్షతో నిర్ధారణ చేస్తారు. మూడో వారంలో ఎముక మజ్జ (బోన్‌మ్యారో) కల్చర్ పరీక్షతో నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షలతో పాటు బయటకు కనిపించే టైఫాయిడ్ సాధారణ లక్షణాలను బట్టి దీన్ని నిర్ధారణ చేయవచ్చు గానీ... ఇలాంటి లక్షణాలే చాలా జ్వరాల్లో కనిపిస్తాయి కాబట్టి కేవలం లక్షణాలను బట్టే నిర్ధారణ అంత తేలిక కాదు. వైద్యపరీక్షలతో దీన్ని కచ్చితంగా నిర్ధారణ చేయవచ్చు.
డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్...
ఇటీవల మందులకు లొంగని టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకూ విచక్షణరహితంగా యాంటీబయాటిక్స్ వాడటం, అది కూడా సరైన మోతాదులో కాకుండా ఇష్టం వచ్చిన మోతాదుల్లో వాడుతూ తుండటంతో డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. పైగా దీని లక్షణాలు కూడా టైఫాయిడ్‌లా కనిపించవు. ఇలాంటి కేసుల్లో రోగికి చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా వైద్యం అందించాలి.
గతంలో చాలా సాధారణ మందులతోనే అంటే క్లోరో క్వినలోన్స్ వంటి చాలా ప్రాథమికమైన మందులతోనే టైఫాయిడ్ త్వరగా తగ్గిపోయేది. కానీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ వచ్చిందంటే అది ఒక పట్టాన తగ్గక చాలా రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. మందులు కూడా పనిచేయకపోవడంతో వైద్యులు మరింత శక్తిమంతమైన మందులు వాడాల్సిన పరిస్థితి. అందుకే ఆన్ కౌంటర్ మందులు వద్దని డాక్టర్లు సూచిస్తుంటారు.
టీకా అందుబాటులో...
టైఫాయిడ్ నివారణకు టీకా అందుబాటులో ఉన్నందున... వచ్చాక మందుల వాడకం కంటే ముందుగా టీకాతోనే నివారించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఈ సీజన్‌లో దూర ప్రయాణాలు చేసేవారికి ఇదెంతో మంచిది. నివారణ చర్యలతో, టీకాతో నివారణ తేలికే కాబట్టి దీన్ని నివారించుకోవడమే మేలు.
చికిత్స :
టైఫాయిడ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే... దీని కారణంగా ఇది సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరు మరణించే అవకాశముంటుంది. అలా చూసినప్పుడు ఇది కొంచెం ప్రమాదకరమైన వ్యాధి. అందుకే చికిత్స తప్పనిసరి. పైగా 104 డిగ్రీలకు పైగా జ్వరం కారణంగా మరికొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. చికిత్స అందకపోయినా లేదా తీవ్రత ఎక్కువగా ఉన్నా మెదడును దెబ్బతీసేలా మెనింజైటిస్, గుండెకు నష్టం చేకూరేలా మయోకారై్డటిస్, ప్యాంక్రియాస్‌ను దెబ్బతీస్తూ ప్యాంక్రియాటైటిస్, కొందరిలో పేగుల్లో రంధ్రం పడటం (పెర్‌ఫొరేషన్), పేగుల్లో రక్తస్రావం కావడం, కిడ్నీలు దెబ్బతినడం వంటి అనర్థాలు రావచ్చు. కొన్నిసార్లు చాలా అవయవాలు విఫలం కావడం (మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్) జరగవచ్చు. అందుకే టైఫాయిడ్ రోగులు సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.
ఫ్లూరోక్వినలోన్స్ / సెఫాలోస్పోరిన్స్ వంటి యాంటీబయాటిక్స్‌తో సాల్మొనెల్లా బ్యాక్టీరియా పూర్తిగా చనిపోతుంది. అయితే ఈ యాంటీబయాటిక్స్ పూర్తికోర్స్ వాడటం చాలా అవసరం. లేదంటే జబ్బు తిరగబెట్టవచ్చు. అది మరింత తీవ్రరూపం దాల్చవచ్చు.
నివారణ :
- ఈగలతో దీని వ్యాప్తి చాలా ఎక్కువ. మలం మీద వాలి, అవే మళ్లీ ఆహారపదార్థాల మీద వాలే అవకాశం ఉన్నందున ఈగలను ముసరనివ్వకూడదు.
- ఈ సీజన్‌లో కుండల్లో చాలాకాలం నిల్వ ఉన్న నీటిని ఏమాత్రం తాగకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పట్టిన నీళ్లే తాగాలి. వీలైనంతవరకు నీటిని కాచి, వడపోసి చల్లార్చి తాగడం మంచిది.
- చేతులు కడుక్కునే అలవాటు లేనివారిలో ఇది ఎక్కువగా రావడం కనిపిస్తుంది. అందుకే తినేముందు లేదా తాగే ముందర చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మల విసర్జన తర్వాత తప్పనిసరిగా చేతులు సబ్బుతో కడుక్కోవాలి.
- అన్నం, కూరలు వేడివేడిగా ఉండగానే తినెయ్యాలి.
- వేడి చేయకుండా... నేరుగా నీళ్లను ఉపయోగించే చేసే తినుబండారాలతో టైఫాయిడ్ వ్యాప్తికి అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ సీజన్‌లో వేడిచేయకుండా నేరుగా నీళ్లను వాడే పానీపూరీ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. వీలైనంతవరకు ఈ సీజన్ అంతా బయటి ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వస్తే చల్లారిపోయాక అస్సలు తినకూడదు.
- కలుషిత జలాలతో తయారు చేసే ఐస్‌తో కూడా ఇది వ్యాపించే అవకాశం ఉన్నందున, అలాంటి ఐస్ వాడే చెరుకు రసం వంటి పానీయాలకు దూరంగా ఉండటం చాలా అవసరం.
డాక్టర్ లింగయ్య మిర్యాల
సీనియర్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్
(చదవండి: వర్షాలలో ఎలుకలతో వచ్చే జబ్బు! )
Comments
Please login to add a commentAdd a comment