గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు. లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి. – హేమంత్‌కుమార్, శ్రీకాకుళం
కాలేయం పెరగడానికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. మీ లేఖలో మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా లేదా తెలియజేయలేదు. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ. ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. మీకు వస్తున్న కడుపులో నొప్పి ఎడమవైపు ఛాతీ కింది భాగంలో వస్తోంది కాబట్టి ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి.
లివర్‌కూ, కిడ్నీకీ సంబంధం ఏమిటి?
నా వయసు 58 ఏళ్లు. నేను ‘సిర్రోసిస్ ఆఫ్ లివర్’ అనే వ్యాధితో బాధపడుతున్నాను. కడుపులో నీరు వచ్చి చేరుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే ‘మీ కిడ్నీ సరిగా పనిచేయడం లేద’న్నారు. కిడ్నీ పనితీరుకూ కడుపులో నీరు చేరడానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. కడుపులో నీరు తగ్గేదెలా? – డి. రామమూర్తి, ఒంగోలు
మీరు చెబుతున్న లక్షణాలు బట్టి చూస్తే మీ కాలేయం పూర్తిగా చెడిపోయిన దశలో ఉన్నారు. కాలేయం చెడిపోవడం వల్ల కడుపులో నీరు చేరడం, కాళ్లల్లో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యకు తొలిదశలో ఉప్పు తక్కువగా వాడటం, మూత్రం ఎక్కువగా వచ్చేటట్లు చేసే మందులు వాడాలి. కానీ మీ డిడ్నీ వ్యవస్థ సరిగా లేనందున ఆ మందులు వాడటం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రెండువారాలకు ఒకసారి కడుపులో నీరు తీయించుకోవడమే గాక... కొన్ని ఇంజెక్షన్స్ చేయించుకోవాలి. దీనివల్ల మీరు కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. దీంతోపాటు ఉప్పును పూర్తిగా తగ్గించుకోవాలి. నీరు కూడా జాగ్రత్తగా తక్కువగా తాగడం మంచిది. ఈ సమస్యకు కాలేయమార్పిడి శస్త్రచికిత్సే మంచి పరిష్కారం. కాలేయ మార్పిడి వల్ల మీకు ఉన్న సమస్యను పూర్తిగా తొలగించవచ్చు. కాబట్టి మీరు కాలేయ మార్పిడి వైద్యుడిని కలిసి మాట్లాడి తగిన నిర్ణయం తీసుకోండి.
అప్పటి వ్యాధి ఇప్పుడు తిరగబెట్టిందా?
నా వయసు 47 ఏళ్లు. కొన్నేళ్ల కిందట నాకు ఆపరేషన్ చేసి ఎడమవైపు రొమ్ము తొలగించారు. ఇంతకాలంగా నాకు ఎలాంటి సమస్యా లేదు. కానీ నెల రోజుల నుంచి కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. ఆకలి తగ్గింది. నీరసంగా ఉంటోంది. అప్పుడప్పుడూ కడుపులో నొప్పి వస్తోంది. గతంలో రొమ్ముకు వచ్చిన వ్యాధి ఇప్పుడు కడుపులోకి పాకిందంటారా? నాకు తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరి, హైదరాబాద్
మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే క్యాన్సర్ కారణంగా గతంలో మీకు రొమ్ము తొలగించారని అర్థమవుతోంది. ప్రస్తుతం మీరు కామెర్లతో బాధపడుతున్నారు. గతంలో ఉన్న రొమ్ముక్యాన్సర్ ప్రభావం కాలేయంపైన కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్, కాలేయానికి సంబంధించిన రక్తపరీక్షలు చేయించుకోండి. ఈ పరీక్షల్లో మీ సమస్య బయటపడుతుంది. ఒకవేళ క్యాన్సర్ వల్ల మీ లివర్ ప్రభావితమైతే, దీన్ని వీలైనంత త్వరగా గుర్తించి, వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంత త్వరగా దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించి, అవసరమైన చికిత్స తీసుకోగలరు.
బాబు కళ్లు పచ్చ బారుతున్నాయి... ఏం చేయాలి?
మా బాబు వయసు పదకొండేళ్లు. ఎనిమిదేళ్ల వయసప్పుడు అతడికి పచ్చకామెర్లు వచ్చాయి. అవి నెలలోపు వాటంతట అవే తగ్గిపోయాయి. మళ్లీ రెండు వారాల క్రితం నుంచి కళ్లు పచ్చగా కనిపిసర్తున్నాయి. దయచేసి సలహా ఇవ్వగలరు. – ప్రకాశ్‌రావు, నిజామాబాద్
మీ అబ్బాయి వయసులోని వారికి ప్రధానంగా హైపటైటిస్ ఎ, హెపటైటిస్ ఈ అనే వైరస్‌ల వల్ల కామెర్లు రావడానికి అవకాశం ఉంటుంది. మీవాడికి ఇంతకుముందు కూడా ఒకసారి కామెర్లు వచ్చాయంటున్నారు. కాబట్టి ఈ వైరస్ వల్ల మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా అరుదు. ఒకసారి పై ఇన్ఫెక్షన్లు సోకితే వాటి పట్ల వ్యాధి నిరోధకశక్తి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే మీ బాబు కామెర్లకు ఇతర కారణాలు అంటే... విల్సన్ డిసీజ్ వంటివి ఉండవచ్చు. మీ బాబుకు దురద, రక్తహీనత వంటి లక్షణాలు ఉన్నాయా, లేవా అన్న విషయం మీరు రాయలేదు. మీరు ఆందోళన చెందకుండా దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు చూపించుకుని అవసరమైన పరీక్షలు చేయించండి.
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment