సెల్ఫీతో కామెర్లను గుర్తించవచ్చు!
రక్తంలోకి బైలిరూబిన్ అనే పదార్థం ఎక్కువగా విడుదల కావడం వల్ల వచ్చే కామెర్ల వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టం. రక్త పరీక్ష చేస్తేగానీ గుర్తించలేని ఈ వ్యాధిని.. కేవలం ఓ సెల్ఫీతో గుర్తించవచ్చట. అదీ ముందుగానే. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించి ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు.
ఈ యాప్‌లోని కెమెరాతో సెల్ఫీ దిగితే.. మనకు కామెర్ల(జాండీస్) వ్యాధి వచ్చే అవకాశముందా? లేదా? అనే విషయాన్ని ముందుగానే గుర్తించి చెబుతుందట. ఈ విషయమై యూనివర్సిటీ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘జాండీస్ రావడానికి ముందు మనిషి కళ్లలో అనేక మార్పులు సంభవిస్తాయి. వాటిని గుర్తించి, విశ్లేషించి వందశాతం సరైన సమాచారం అందించేలా ఈ యాప్‌ను అభివృద్ధి చేశాం. అంతేకాదు పాంక్రియాటిక్ కేన్సర్‌ను కూడా ముందుగానే గుర్తించవచ్చు. గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకుంటే ప్రాణహాని తప్పుతుంది’ అని ఆయన అన్నారు.