Selphi
-
సెల్ఫీతో కామెర్లను గుర్తించవచ్చు!
రక్తంలోకి బైలిరూబిన్ అనే పదార్థం ఎక్కువగా విడుదల కావడం వల్ల వచ్చే కామెర్ల వ్యాధిని ముందుగా గుర్తించడం కష్టం. రక్త పరీక్ష చేస్తేగానీ గుర్తించలేని ఈ వ్యాధిని.. కేవలం ఓ సెల్ఫీతో గుర్తించవచ్చట. అదీ ముందుగానే. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇందుకు సంబంధించి ఓ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్‌లోని కెమెరాతో సెల్ఫీ దిగితే.. మనకు కామెర్ల(జాండీస్) వ్యాధి వచ్చే అవకాశముందా? లేదా? అనే విషయాన్ని ముందుగానే గుర్తించి చెబుతుందట. ఈ విషయమై యూనివర్సిటీ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘జాండీస్ రావడానికి ముందు మనిషి కళ్లలో అనేక మార్పులు సంభవిస్తాయి. వాటిని గుర్తించి, విశ్లేషించి వందశాతం సరైన సమాచారం అందించేలా ఈ యాప్‌ను అభివృద్ధి చేశాం. అంతేకాదు పాంక్రియాటిక్ కేన్సర్‌ను కూడా ముందుగానే గుర్తించవచ్చు. గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకుంటే ప్రాణహాని తప్పుతుంది’ అని ఆయన అన్నారు. -
విహారయాత్రలో విషాదం
♦ జలాశయంలో ఈతకు దిగి కప్పరాడ వాసి గల్లంతు ♦ జాడ లేని శివరామకృష్ణ ♦ కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు వారంతా కుటుంబ సభ్యులతో సరదాగా విహారానికి బయలుదేరారు. మార్గమధ్యలో సెల్ఫీలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా ప్రయాణం సాగించారు. ఇంతలోనే కళ్యాణపు లోవ వచ్చింది. ఎంతో ఉత్సాహంతో రిజర్వాయర్, చుట్టుపక్కల ప్రాంతాలు చూసి ముగ్ధులయ్యారు. సరదాగా ఈత కొట్టేందుకు రిజర్వాయర్‌లోకి దిగారు. అంతే వీరిలో ఓ వ్యక్తి గల్లంతు కావడంతో విషాదం అలుముకుంది. రావికమతం (చోడవరం): కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళ్లిన బృందంలో ఓ వ్యక్తి కళ్యాణపులోవ జలాశయంలో గల్లంతు కావడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కంచరపాలెంలోని కప్పరాడ ప్రాంతానికి చెందిన బిక్కవోలు శివరామకృష్ణ (26) జలాశయంలో గల్లంతయ్యాడు. శివరామకృష్ణ ఆయన సోదరి బంధువులు అడ్డురోడ్డు నుంచి కొరిబిల్లి రాజు, కాండ్రేగుల దొరబాబు, పలివెల అభిజ్ఞ, వరలక్ష్మి, రామలక్ష్మిలతో కలిసి రావికమతం మండలం కళ్యాణపులోవ రిజర్వాయర్‌కు ఆదివారం విహార యాత్రకు బయలుదేరారు. వారం రోజులు క్రితం జోగుంపేటలోని అమ్మగారింటికి వెళ్లిన భార్య పార్వతిని రమ్మని శివరామకృష్ణ చెప్పాడు. మూడు ప్రాంతాల నుంచి వేర్వేరుగా వచ్చిన వీరు నర్సీపట్నంలో కలుసుకుని అక్కడ నుంచి కళ్యాణపులోవ రిజర్వాయర్ ప్రాంతానికి ఆటోలో పయనమయ్యారు. జలాశయం వద్ద పోతురాజుబాబు ఆలయాన్ని, రిజర్వాయర్ పరిసరాలను సందర్శించారు. అనంతరం శివరామకృష్ణ జలాశయంలో ఈతకని దిగాడు. అతనితో వచ్చిన వారు జలాశయంలో లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలో స్నానాలు చేస్తున్నారు. ఇంతలోనే శివరామకృష్ణ జలాశయం క్లస్టర్ గేట్లు వద్ద గల ప్రాంతంలో ఉన్న నీటిలో స్నానం చేస్తానని భార్యకు, వెంట వచ్చిన వారికి చెప్పి అక్కడికి వెళ్లాడు. క్లస్టర్ గేట్లు వద్ద స్నానం చేయడం ప్రమాదమని, లోతు, నీటి మట్టం అధికంగా ఉంటుందని భార్య పార్వతి భర్తకు వివరించింది. అయితే తనకు ఈత వచ్చని, ఏమి కాదని చెప్పి క్లస్టర్ గేట్లుపై నుంచి నీటిలోకి దూకాడు. మొదటిసారి బయటకు వచ్చిన శివరామకృష్ణ రెండోసారి కుడా గేట్లపై నుంచి నీటిలోకి దూకాడు. అంతతోనే నీటిలో మునిగిపోతుండడంతో తన భర్తను రక్షించాలని భార్య పార్వతి, బంధువులు కేకలు వేశారు. దీంతో స్థానికులు వచ్చేలోగానే శివరామకృష్ణ నీటిలో మునిగిపోయాడు. వారు ఎంతగా జలాశయంలో వెదికినా శివరామకృష్ణ జాడ లభించలేదు. దీంతో భార్య పార్వతి, బంధువుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. శివరామకృష్ణ 2013లో జోగుంపేటకు చెందిన పార్వతిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల బాబు చందు ఉన్నాడు. గల్లంతైన సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ వంజరి గంగరాజు, వీఆర్వో ఎ.ఎస్.నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సమాచారాన్ని కొత్తకోట పోలీసులకు తెలిపారు -
సెల్ఫీ దిగాలంటే..‘పేటీఎం’ చేయాల్సిందే!
వినూత్న రీతిలో ఓ కళాకారుడి విరాళాల సేకరణ హైదరాబాద్: భుజాన క్రికెట్ బ్యాట్‌తో హుషారుగా మెట్లు దిగుతున్న ఇతని పేరు నూకాజీ. చదువుకున్నది గ్రాడ్యుయేషన్. అయినా కళల పట్ల మక్కువతో దాన్నే జీవనాధారంగా చేసుకున్నాడు. ఇటీవల ఏర్పడిన నగదు కొరతతో రాబడి తగ్గిపోవడంతో ఓ ఉపాయంగా ‘పేటీఎం’ద్వారా ఆన్లైన్ విరాళాలు స్వీకరిస్తున్నాడు. ప్రతి ఆదివారం హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నెక్లెస్ రోడ్డులో ఇలా వివిధ వేషధారణలతో పేటీఎం ట్యాగ్‌తో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తు్తన్నాడు. ఇతనితో దిగే మొదటి సెల్ఫీ ఉచితం. తరువాత దానికి మాత్రం పేటీఎం ద్వారా పేమెంట్ చేయాల్సిందే. మూసాపేట మెట్రో రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం కనిపించిన దృశ్యం ఇది.. -
ఆ ప్రశ్న వింటే నాకు ఒళ్లు మంట
ఫస్ట్ లవ్.. ఫస్ట్ బైక్/కార్.. ఫస్ట్ జాబ్.. ఇలా జీవితంలో తొలిసారి జరిగే ముఖ్యమైన విషయాలు మనకు తీపి గుర్తు అవుతాయి. అందుకే మొదటి లవ్ గురించి, మొదటి వాహనం, ఉద్యోగం గురించి అడిగితే టకీమని సమాధానం చెప్పేస్తారు. అదే, ఈ మధ్య చివరిగా ఎప్పుడు అబద్ధం ఆడారు? ఫలానా వర్క్ లాస్ట్ టైమ్ ఎప్పుడు చేశారు? అని అడిగితే ఠక్కున సమాధానాలు చెప్పేవారు ఎంత మంది ఉంటారు? కష్టమే కదూ! ప్రియాంకా చోప్రా మాత్రం ఫటాఫట్ చెప్పేశారు. మరో పది రోజుల్లో ఈ ఏడాదికి టాటా చెప్పేయడానికి రెడీ అవుతోన్న ప్రియాంకా చోప్రా... ‘2016 లాస్ట్ థింగ్స్’ పేరిట చెప్పిన కబుర్లు చదవండి. ► ‘షూటింగ్ లేట్ కావడంతో రాత్రి ఆలస్యంగా నిద్రపోయా. అందువల్లే ఉదయం లేటుగా నిద్రలేచా’ – నేను లేటుగా లేచిన ప్రతిసారీ ఈ అబద్ధం చెబుతుంటా. బహుశా ఈ ఏడాది నేను చెప్పే చివరి అబద్ధం ఇదే అవుతుందేమో. వచ్చే ఏడాది నిజాలే చెబుతారా? అని అడగకండి. ఇప్పుడే చెప్పలేను. ► నేను ఓ ఫొటోషూట్‌కి వెళితే అక్కడ నా చుట్టూ ఓ కుక్కపిల్ల తిరిగింది. ఆ పప్పీని వదలడం ఇష్టం లేక ఇంటికి తీసుకెళ్లా. దాన్ని దత్తత తీసుకున్నా. డయానా అని పేరు పెట్టా. భలే ముద్దు ముద్దుగా ఉంటుంది తెలుసా. డయానాతో ఫొటోలు తీసుకోవడం నాకో అలవాటుగా మారింది. చివరగా తనతోనే ఓ ఫొటో (సెల్ఫీ) తీసుకున్నా. ► నేను ప్రముఖ హాలీవుడ్ నటి ఇవా మెండిస్లా ఉన్నానని అంటుంటారు. ఈ మధ్య నన్నొకరు ఆమెతోనే పోల్చారు. ఆ తర్వాత ఎవరూ పోల్చలేదు. సో.. ఇవా మెండిస్‌తో నన్ను పోల్చడం ఇదే చివరిసారి అవుతుందేమో. ► 2005 లేదా 2006లో నిద్రలేకుండా షూటింగ్స్ చేసిన రోజులున్నాయి. ఎందుకంటే ఒకేసారి నాలుగైదు సినిమాలు అంగీకరించా. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది ఆ పరిస్థితి వచ్చింది. ఇండియాలో ‘బాజీరావ్ మస్తానీ ప్రమోషన్లు, అమెరికాలో ‘క్వాంటికో’ టీవీ సిరీస్ షూటింగ్.. ఇలా ఈ ఏడాది ప్రారంభంలో కంటిన్యూస్‌గా వర్క్ చేశా. అప్పుడు నిద్రలేని రాత్రులు గడిపా. ఇండియా, అమెరికాల మధ్య చక్కర్లు కొట్టా. ఒక్కోసారి ఫ్లైట్‌లోనే చిన్నపాటి కునుకు తీసేదాన్ని. నిద్ర లేకుండా పని చేయడం ఇదే చివరిసారి అయితే బాగుంటుందనుకుంటున్నా. ► వరుస చిత్రీకరణలు, ప్రయాణాలతో ఈ ఏడాదంతా క్షణం తీరిక లేకుండా గడిపా. కానీ, లాస్ట్ టైమ్ షాపింగ్ చేసినప్పుడు నాకోసం నేను ఓ డైమండ్ నెక్లెస్ కొనుక్కున్నా. త్వరలో ఆ నెక్లెస్‌ను మీకు చూపిస్తా! ► సాధారణంగా చాలామంది ప్రతి సందర్భంలోనూ ‘ఎలా ఉన్నారు?’ అనే ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న అంటే నాకు చిరాకు. ఆ ప్రశ్న వింటే కోపం వచ్చేస్తుంది. అప్పుడు నేను ‘ఆకలి వేస్తుందనో, చలిగా ఉందనో’ చెబుతుంటా. చివరిసారిగా కోపం వచ్చింది కూడా ఎవరో ఈ ప్రశ్న అడిగినప్పుడే. ► ఈ ఇయర్ ఎండింగ్లో దేవుడు నన్నో కోరిక కోరుకోమంటే ఈ వయసులోనే ఓ వారం రోజులు ఉంచేయమంటా. ఇప్పుడు నాకు 34 ఏళ్లు. ఈ ఏడాదంతా గొప్పగా గడిచింది. -
నలుగురు తమ్ముళ్లు.. ఓ అన్నయ్య... సూపర్ సెల్ఫీ
మెగా బ్రదర్స్ ముగ్గురిలో చిన్నోడు పవన్‌కల్యాణ్. రియల్ లైఫ్‌లోనే ఆయన తమ్ముడు. కొత్త సినిమాలో పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారు పవన్. నలభై రోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోన్న షూటింగ్ చివరికి వచ్చేసిందట! పొల్లాచ్చి షెడ్యూల్లో పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ, అజయ్, చైతన్యకృష్ణ, కమల్ కామరాజులు కూడా పాల్గొంటున్నారు. మంగళవారం లంచ్ టైమ్‌లో తమ్ముళ్లతో కలసి ఓ సెల్ఫీ తీసుకున్నారు పవన్. ఫొటోలో మీరు చూస్తున్నది ఆ సెల్ఫీనే. ‘‘పవన్ చూపించే ప్రేమ, ఆప్యాయతలకు హ్యాట్సాఫ్. ఆయన్ను కలసిన తర్వాత అభిమానించకుండా ఉండలేం. నలభై రోజులుగా ఆయనతో కలసి షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైతన్యకృష్ణ పేర్కొన్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరకర్త. -
సెట్స్‌లో సందడి గురూ!
‘‘వెంకటేశ్‌గారితో కలసి నటిస్తుండడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నిజంగా ‘విక్టరీ’నే. ‘గురు’ షూటింగ్లో వెంకీతో ఓ సెల్ఫీ’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు ముంతాజ్ సోర్కర్. ఎవరీ ముంతాజ్ అనుకుంటున్నారా? ఇక్కడ వెంకటేశ్ పక్కన ఆరెంజ్ కలర్ జెర్సీలో కళ్లజోడు పెట్టుకుని సెల్ఫీ తీసుకున్న అమ్మాయే. సుధా కొంగర దర్శకత్వంలో వెంకటేశ్ హీరోగా నటిస్తున్న ‘గురు’లో హీరోయిన్ రితికా సింగ్‌కి సిస్టర్‌గా నటిస్తున్నారు. మాధవన్ హీరోగా సుధా కొంగర తీసిన ‘సాలా ఖడూస్’కి తెలుగు రీమేక్ ఈ ‘గురు’ అనే సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్లో కూడా ముంతాజ్ హీరోయిన్ సిస్టర్‌గా నటించారు. ప్రస్తుతం విశాఖలో ‘గురు’ షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం లొకేషన్‌కి వచ్చిన అభిమానులతో వెంకీ ఫొటోలు దిగారు. వైనాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్లో పూర్తవుతుంది. -
సింగంతో ఓ సెల్ఫీ
వన్.. టు.. త్రీ.. మొన్నటివరకూ శ్రుతీహాసన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. అదే ‘సింగం-3’. సూపర్ హిట్ ‘సింగం’ ఫ్రాంచైజీలో రూపొందు తోన్న మూడో చిత్రమిది. ‘యముడు’, ‘సింగం’ చిత్రాలతో సూర్యకు సూపర్ సక్సెస్ అందించిన దర్శకుడు హరి, ఈ మూడో చిత్రానికి సైతం దర్శకత్వం వహిస్తున్నారు. జార్జియా లో సూర్య, శ్రుతీలపై చిత్రీకరించిన పాటతో షూటింగ్ మొత్తం పూర్తయిందని సమాచారం. ‘‘సింగం 3’ షూటింగ్ పూర్తి చేశా, తర్వాతి సినిమా కోసం ఎదురు చూస్తున్నా’’ అని శ్రుతీహాసన్ ట్వీట్ చేశారు. ఈ సినిమా గుర్తుగా సూర్యతో ఓ సెల్ఫీ తీసుకున్నారు. అనుష్క మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నవంబర్‌లో పాటల్ని, డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీపావళి కానుకగా టీజర్ విడుదల చేయనున్నారు. -
చలపతి.. అరుణ..ఓ సెల్ఫీ
ఫొటో వెలుగులోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్కౌంటర్ సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలంగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న కోరాపుట్-శ్రీకాకుళం డివిజినల్ కమిటీకి డిప్యూటీ కమాండర్‌గా వ్యవహరించిన చలపతి, ఈస్ట్ డివిజన్ సెక్రటరీగా పని చేసిన ఆయన భార్య అరుణ తాజా ఫొటోలు ‘సెల్ఫీ’ ద్వారానే పోలీసులకు చిక్కాయి! సోమవారం ఏవోబీలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరణించిన 24 మందిలో వీరిద్దరూ ఉన్నారు. చలపతి తలపై రూ.20 లక్షలు, అరుణపై రూ.5 లక్షల రివార్డు ఉంది. వారి తాజా ఫొటోల కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఈ కారణంగానే భార్యాభర్తలు ఇద్దరూ పలు సందర్భాల్లో ఏజెన్సీ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరగగలిగారు. అప్పట్లో వీరి కదలికలపై సమాచారం ఉన్నా.. గుర్తింపు సమస్య వల్లే పోలీసుల బలగాలు ఏమీ చేయలేకపోయాయి. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగించినట్లు అనుమానిస్తున్న చలపతి ఓ సందర్భంలో తన భార్యతో కలిసి దట్టమైన అటవీ ప్రాంతంలో సెల్ఫీ దిగాడు. దీన్ని అరుణ సోదరుడైన ఆజాద్ తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుచుకున్నాడు. ఈ ఏడాది మే 4న విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం మర్రిపాకలు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్‌తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు కిట్ బ్యాగ్, ఆయుధాలతోపాటు ల్యాప్‌టాప్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌ను విశ్లేషించిన పోలీసు వర్గాలకు ఈ సెల్ఫీ లభించింది. దీని ఆధారంగా భారీ సంఖ్యలో చలపతి, అరుణ పోస్టర్లు ముద్రించి పోలీసులు ఏజెన్సీ మొత్తం ప్రచారం చేశారు. దీంతో షాక్‌కు గురైన మావోయిస్టు కేంద్ర కమిటీ స్మార్ట్ ఫోన్ల వినియోగం, సెల్ఫీలు సహా ఫొటోలు తీసుకోవడంపై దాదాపు నిషేధం విధించింది. రెండు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన చలపతి, అరుణల సెల్ఫీ వెలుగులోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్కౌంటర్ అయ్యారు. సోమవారం ఎన్కౌంటర్ స్థలంలో వీరిద్దరినీ గుర్తిచడంలోనూ ఈ సెల్ఫీనే కీలక ఆధారంగా మారినట్టు సమాచారం. -
భక్తుడితో భగవంతుడి సెల్ఫీ!
ఏడు కొండల వెంకటేశ్వరుడి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది. వెంటనే భక్తుడితో కలసి ఓ సెల్ఫీ దిగాలనుకున్నారు. స్వామివారు స్వయంగా అడగడంతో భక్తుడు కూడా సంతోషంగా సెల్ఫీకి పోజిచ్చారు. స్వామివారి శంఖుచక్రాలు, కిరీటం, ఆభరణాలు ఎక్కడ? భక్తుడి నుదుట నామాలు ఏవి? పైగా, ఇద్దరూ కళ్లజోడు పెట్టుకున్నారేంటి? అనుకుంటున్నారా..!! షూటింగ్ పూర్తయింది కదా, మేకప్ తీసేశారు. అక్కినేని నాగార్జున వెంకటేశ్వరుడి భక్తుడు హాథీరామ్ బాబాగా.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇందులో బాలీవుడ్ నటుడు సౌరభ్ జైన్ వెంకటేశ్వర స్వామిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసిన తర్వాత నాగార్జున, సౌరభ్ జైన్లు సరదాగా ఓ సెల్ఫీ దిగారు. అదండీ సంగతి! మహాబలేశ్వరంలో షెడ్యూల్ ముగించుకున్న చిత్ర బృందం ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చింది. త్వరలో తాజా షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. వెంకన్న భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తున్న ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏ.మహేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
సెల్ఫీ... సో స్పెషల్!
శ్రద్ధగా మేకప్ చేసుకున్నప్పుడు సెల్‌ఫోన్‌తో ఓ సెల్ఫీ తీసుకుని, తీపి గుర్తుగా దాచుకోవాలనుకుంటాం. విహార యాత్రకు వెళ్లినప్పుడు అందమైన లొకేషన్స్‌లో సెల్ఫీ తీసుకుంటాం. చానాళ్ల తర్వాత స్నేహితులను కలిసినప్పుడు వాళ్లతో సెల్ఫీ దిగుతాం. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ సెల్ఫీకి అనర్హం. సినిమా తారలు ట్విట్టర్స్, ఫేస్‌బుక్స్‌లో ఇలాంటి సెల్ఫీలు చాలా కనిపిస్తాయి. అలా గత వారంలో హల్చల్ చేసిన సెల్ఫీల్లో రామ్‌చరణ్, వరుణ్‌తేజ్ కలిసి దిగిన సెల్ఫీ ఓ హైలైట్. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి నేడు బెంగళూరులో జరగనున్న విషయం తెలిసిందే. వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణంలో చరణ్, వరుణ్ సెల్ఫీ దిగారు. ఆదివారం చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా తాము దిగిన సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి, ‘హ్యాపీ బర్త్‌డే అన్నా.. లవ్ యు’ అని పేర్కొన్నారు వరుణ్ తేజ్. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులో మెరిసే శ్రుతీహాసన్ ‘సింగమ్ 3’ చిత్రం కోసం పట్టుచీర కట్టుకున్నారు. అందుకని మురిపెంగా సెల్ఫీ దిగి, ఫేస్బుక్లో పెట్టారు. తల్లితో కలిసి రకుల్ ప్రీత్‌సింగ్ అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లారు. అక్కడ టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో తల్లితో కలిసి సెల్ఫీ దిగారు. హిందీ చిత్రం ‘పింక్’ షూటింగ్ స్పాట్లో షాట్ గ్యాప్‌లో కో-స్టార్స్‌తో కలిసి తాప్సీ ఓ సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీలు సో... స్పెషల్‌గా ఉన్నాయి కదూ! -
సెల్ కొనేది ‘సెల్ఫీ’ కోసమే..!
♦ మారుతున్న వినియోగదారుల ధోరణి ♦ హైపవర్ ఫ్రంట్ కెమెరాలతో కంపెనీల మోడళ్లు ♦ స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 50% సెల్ఫీ ఆధారితమే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ‘సెల్ఫీ లేలే రే’ అంటూ బజరంగీ భాయ్‌జాన్ సినిమాలో సల్మాన్‌ఖాన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. పాటే కాదు... ఇపుడు సెల్ఫీ పోటీలూ పుట్టుకొచ్చాయి. రోజుకో సెల్ఫీ తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం.. వీటికి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో తీసుకున్న సెల్ఫీలు తోడవటం... స్నేహితులు, బంధువులు, ఆప్తులు ఒకచోట కలిసినా, అందమైన ప్రదేశానికి వెళ్లినా.. అపురూప క్షణాలను, జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలన్నా.. ‘ఒక్క సెల్ఫీ’ క్లిక్మనిపించటం... అంతా సాధారణమైపోయింది. ఇంతలా ఇండియా మొత్తం సెల్ఫీమయమైపోవటంతో మొబైల్ ఫోన్ కంపెనీలూ రంగంలోకి దిగాయి. పోటాపోటీగా హై రిసొల్యూషన్ ఫ్రంట్ కెమెరాలతో మారె ్కట్ను చేజిక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫ్లాష్, ఆటో ఫోకస్ ఫీచర్లనూ చేరుస్తున్నాయి. హై రిసొల్యూషన్తో.. గతంలో ఎక్కువ సామర్థ్యమున్న బ్యాటరీ, హై రిసొల్యూషన్ బ్యాక్ కెమెరా, అధిక ర్యామ్ వంటి ఫీచర్లే కస్టమర్ల తొలి ప్రాధాన్యాలుగా ఉండేవి. కంపెనీలు అందుకు అనుగుణంగా ఈ ఫీచర్లపైనే ఎక్కువ ఫోకస్ చేసేవి. ఈ జాబితాలోకిపుడు ఫ్రంట్ కెమెరా కూడా చేరింది. గతంలో వీడియో కాల్స్‌కే పరిమితమైన ఫ్రంట్ కెమెరాలు... ఇపుడు సెల్ఫీ సెంటర్లయిపోయాయి. దీంతో హై రిసొల్యూషన్తో 13 మెగా పిక్సెల్ వరకు వచ్చేశాయి. సోని, హెచ్‌టీసీ, ఆసస్, ఇన్ఫోకస్లు ఈ స్థాయి కెమెరాలతో మోడళ్లను విక్రయిస్తున్నాయి. సెల్కాన్ వీటి సరసన చేరగా... లెనొవో రెండు ఫ్రంట్ కెమెరాలతో వైబ్ ఎస్1 మోడల్‌ను రూపొందించింది. ఎల్జీ వీ10కు 5 ఎంపీతో రెండు ఫ్రంట్ కెమెరాలున్నాయి. ఇక 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో గూగుల్ నెక్సస్, ఎల్జీ, హువావె, జెడ్‌టీఈ, ప్యానసోనిక్, జియోనీ, షావొమీ, వన్‌ప్లస్, లెనొవో, లావా, ఇంటెక్స్, కార్బన్, ఓపో, హానర్, ఏసర్ పోటీపడుతున్నాయి. రూ.8 వేల నుంచే ఈ ఫోన్లు లభిస్తుండటం విశేషం. బేసిక్ ఫోన్లలోనూ... సెల్ఫీ క్రేజ్ బేసిక్ ఫోన్లకూ పాకింది. నోకియా ఎల్ఈడీ ఫ్లాష్‌తో 2 ఎంపీ కెమెరాతో 230 మోడల్‌ను ప్రవేశపెట్టింది. సెల్కాన్ కాస్త వినూత్నంగా ఫ్లాష్‌తో కూడిన రొటేటబుల్ కెమెరా ఫోన్స్‌ను చార్మ్ స్పిన్, సీ360 ట్విస్ట్ పేరుతో విజయవంతంగా విక్రయిస్తోంది. అలాగే సెల్ఫీ కెమెరాతో సీ225 స్టార్, సీ289 మోడళ్లను తీసుకొచ్చింది. హువావె, ఇంటెక్స్, కార్బన్, జెన్, వీడియోకాన్ సైతం ఫ్రంట్ కెమెరాతో బేసిక్ ఫోన్లను ప్రవేశపెట్టాయి. కాగా, ‘సెల్ఫీ’ ఫోన్లంటూ దాదాపు అన్ని కంపెనీలు బ్రాండింగ్ చేసుకుంటున్నాయి. రిటైల్ ఔట్లెట్లలో సెల్ఫీ మోడళ్లు బెస్ట్ సెల్లర్స్‌గా నిలుస్తున్నాయని బిగ్ సి చైర్మన్ బాలు చౌదరి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సెల్ఫీ కెమెరానే ప్రాధాన్యత.. యూత్ అంతా ఇప్పుడు సెల్ఫీ మోడళ్లకే సై అంటున్నారని సెల్కాన్ సీఎండీ వై.గురు తెలిపారు. ప్రస్తుతం 8 ఎంపీ మోడళ్లను తెచ్చామని, త్వరలో 4జీలో 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా మోడల్‌ను ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు సమయంలో కస్టమర్లలో 50-60 శాతం మంది సెల్ఫీ గురించి మాట్లాడుతున్నారని టెక్నోవిజన్ ఎండీ సికందర్ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీలదే హవా అంటూ.. సెల్ఫీ స్టిక్స్‌కు కూడా క్రేజ్ పెరిగిందన్నారు. భారత్‌లో జనవరిలో మొత్తం 2 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇందులో స్మార్ట్ఫోన్ల వాటా 70 శాతం. విక్రయమైన స్మార్ట్ఫోన్లలో 50 శాతం సెల్ఫీ ఆధారిత మోడళ్లున్నాయని లాట్ మొబైల్స్ ఈడీ కృష్ణ పవన్ తెలిపారు. -
స్కూబా.. అబ్బా...!
కాదేదీ సెల్ఫీకి అనర్హం అన్నట్లుగా ఉంది. కంటికీ, మనసుకీ నచ్చితే చాలు సెల్ఫీ దిగేస్తుంటారు. సెల్ఫీ కోసం కొంతమంది రిస్కులు కూడా తీసుకుంటున్నారు. సోనాక్షీ సిన్హా కూడా ఇటీవల ఓ రిస్క్ తీసుకున్నారు. అయితే, అది సెల్ఫీ కోసం కాదులెండి. వేరే ఏదో రిస్క్ తీసుకుని, పనిలో పనిగా సెల్ఫీగా కూడా దిగారామె. ఈ బ్యూటీకి ఈ మధ్య కాస్త తీరిక చిక్కింది. అంతే... స్కూబా డైవింగ్ చేయాలనే తన కోరికను తీర్చేసుకోవాలనుకున్నారు. స్కూబా అంటే నీటి లోపల ఈతకొట్టడం అన్నమాట. ఈ సాహసం చేయాలంటే దమ్ము కావాలి. సోనాక్షి సో బోల్డ్ కాబట్టి, చేసేశారు. ఈత కొట్టడం మాత్రమే కాదు... నీటి లోపల కనిపించే స్టార్ ఫిష్‌లను పట్టుకుని సెల్ఫీ దిగారు. నీటి లోపల ఫొటోలు దిగడమా? కెమెరా తడిచిపోదూ? అనుకుంటే అమాయకత్వం అవుతుంది. టెక్నాలజీ పెరిగిపోయింది కదా... ఇకపోతే సోనాక్షి తన స్కూబా డైవింగ్‌కి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పెట్టారు. అవి చూసిన ఆమె అభిమానులు.. ‘అబ్బా.. సోనా స్కూబా ఏం చేసిందబ్బా?’ అని ముద్దుగా మెచ్చుకుంటున్నారు. -
ఇక్కడ సెల్ఫీ కాస్త కాస్ట్లీ గురూ...!
మెక్సికోలో టులుమ్ జాతీయ పార్కులో మయన్ నాగరికత సంబంధించిన కట్టడాలున్నాయి. ఇది బాగా ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం. ఏటా దాదాపు 20 లక్షల పైచిలుకు పర్యాటకులు ఈ పార్కును సందర్శిస్తారు. ఆదాయం పెంచుకోవడంపై రకరకాల ఆలోచనలు చేస్తున్న నిర్వాహకులకు ఎవరి చేతిలో చూసినా సెల్ఫీ స్టిక్‌లు, స్మార్ట్ఫోన్లు కనపడటంతో వెంటనే ఓ ఐడియా తట్టింది. ఈ ప్రాంతంలో సెల్ఫీ తీసుకోవాలంటే... రెండున్నర డాలర్లు (దాదాపు 170 రూపాయలు) కట్టాలని తీర్మానించేశారు. ఇదెక్కడి చిత్రమైన బాదుడంటూ పర్యాటకులు గొణుక్కుంటున్నారట. -
ఉద్యోగాలు తీసిన సెల్ఫీ
సెల్ఫీల మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం, ప్రాణాలు పొగొట్టుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడదే సెల్ఫీ పిచ్చితో బ్రిటన్‌లో ఇద్దరు పోలీసు అధికారులు ఏకంగా ఉద్యోగాలనే పొగొట్టుకున్నారు. ఆగస్టు 22న సోరేహమ్ ఎయిర్‌షోలో పాల్గొంటున్న హంటర్ జెట్ ఒకటి హైవేపై కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలవ్వగా, మరో 16 మంది గాయపడ్డారు. పేర్లు బయటకు రాలేదుగాని వరుసగా 23, 24 ఏళ్ల వయసున్న ఇద్దరు ప్రొబేషనరీ పోలీసు ఆఫీసర్లు ఘటనాస్థలికి చేరిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొనకుండా ముందు సెల్ఫీలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. అవతల ప్రాణాలు పోతుంటే వీళ్ల సెల్ఫీల పిచ్చి ఏంటని ఒళ్లు మండిన ఎవరో దాన్ని వీడియో తీసి... ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అధికారులు వీరిద్దరూ బాధ్యతారహితంగా వ్యవహరించారని, బాధితుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారని తేల్చారు. వీరిద్దరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని సిఫారసు చేశారు. విషయం తెలుసుకున్న ఈ ప్రొబేషనరీ పోలీసు అధికారులు తామే రాజీనామా చేసి వెళ్లిపోయారు. -
నో ఫొటోస్... సెల్ఫీస్ ప్లీజ్!
సల్మాన్ ఖాన్ అభిమానులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్. ఆయన ఇక అపరిచిత వ్యక్తులతో సెల్ఫీలు, ఫొటోలు దిగకూడదని డిసైడయ్యారట. అవును నిజమే. ‘లే లే లే...సెల్ఫీ రే’ అంటూ ‘బజరంగీ భాయ్‌జాన్’ సినిమాలో సందడి చేసిన కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇలా అంటున్నారేంటి అనుకుంటున్నారా! అవును ఈ ఫొటోలు, సెల్ఫీల వల్ల ఆయన ఇబ్బందుల్లో పడుతున్నారట. అసలు విషయంలోకి వెళితే... సల్మాన్ ఖాన్ ఎక్కడైనా కనబడితే ఆయన అభిమానులు ఎగబడి మరీ సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారట. సల్లూ భాయ్ కూడా తనను ఎంతో ఇష్టంగా కలిసే అభిమానులను నిరాశ పరచకూడదనే ఉద్దేశంతో అలా తీసుకోవడానికి అనుమతినిస్తున్నారు. కానీ, కొంత మంది వ్యక్తులు మాత్రం ఈ ఫొటోలను తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇటీవలే ఒక అమ్మాయి సల్మాన్‌తో సెల్ఫీ దిగి, తానే సల్మాన్ కొత్త గాళ్ఫ్రెండ్నంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలానే కొంతమంది వ్యక్తులు సల్మాన్‌భాయ్ ఫొటోలను ఫేస్బుక్ ఖాతాలో పెట్టి, తాము సల్లూ కొత్త సినిమా కోసం న టీనటులను వెతుకుతున్నామంటూ ప్రచారం చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్ ‘అలాంటిదేమీ లేదు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు’ అని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. చివరకి వీటితో విసుగొచ్చిన సల్మాన్ నో ఫొటోస్, సెల్ఫీస్ ప్లీజ్ అంటున్నారు. -
ఆటోగ్రాఫ్‌కి బై.. సెల్ఫీకి జై
ఆటోగ్రాఫ్‌లపై అభిమానుల అనాసక్తి ఫ్యాన్స్‌తో సెలబ్రిటీల తిప్పలు ఆ జ్ఞాపకం.. పదిలం.. ‘సెల్ఫీ ప్లీజ్’.. ఈ రిక్వెస్ట్ ఇప్పుడు సినీ, గ్లామర్ రంగాల ప్రముఖులకు మామూలైపోయింది. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ కావాలంటూ అట్టముక్క నుంచి ఆచ్ఛాదన లేని వీపు దాకా.. అభిమానించే వారి సంతకానికి వేదిక చేసేవారు. ఇప్పుడు ఈ సరదా కనుమరుగవుతోంది. సెల్ఫీ క్రేజ్.. ఆటోగ్రాఫ్ మోజును తుంచేసింది. సేకరించిన ఆటోగ్రాఫ్ బుక్స్ పట్టుకుని తిరిగిన సిటీజనులు.. ఇప్పుడు సెలబ్రిటీలతో తీసుకున్న సెల్ఫీలను ఫేస్‌బుక్‌లోనో వాట్సప్‌లోనో పోస్ట్ చేయడానికి, లైకుల్ని అందుకోవడానికి తాపత్రయపడుతున్నారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి ఒకప్పుడు అభిమానించేవారి సంతకాల కోసం తంటాలు పడేవారు. తర్వాత తర్వాత ఆటోగ్రాఫ్స్ తీసుకునే తీరులో సరదాలు చోటు చేసుకున్నాయి. సినిమా తారలు కనబడితే హృదయం మీదో, మరో చోటో, క్రీడాకారులైతే బ్యాట్స్, బాల్స్ తీసుకెళ్లి వాటిపై సంతకం చేయమని రిక్వెస్ట్ చేసేవారు. స్మార్ట్‌ఫోన్ విజృంభణతో ఈ సంతకాల సేకరణ మోజు తగ్గి, సెలబ్రిటీలతో ఫొటోలు దిగే ట్రెండ్ మొదలైంది. సెల్ఫీలు వచ్చేశాక ఆటోగ్రాఫ్ అటకెక్కింది. సెలబ్రిటీతో సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, లైకుల్ని లెక్కేసుకోవడం ఇప్పుడు లేటెస్ట్ అండ్ హాటెస్ట్ హాబీ. సిటీలోని స్టేషనరీ స్టోర్స్‌లో కూడా ఆటోగ్రాఫ్ బుక్స్ సేల్స్ తగ్గిపోయాయి. ఒకప్పుడు ప్రతి స్టూడెంట్ తనతో వీటిని తప్పక క్యారీ చేయాల్సిన బుక్‌గా భావించేవారని సెల్ఫీస్ కారణంగా ఆ ధోరణి కనుమరుగైందని శ్రీనగర్‌కాలనీలోని ఒక స్టోర్ యజమాని సుధీర్ అంటున్నారు. ఆటో‘గ్రాఫ్’ పడిపోయింది ‘ఒకప్పుడు నా ఆటోగ్రాఫ్స్ కోసం వచ్చిన రిక్వెస్ట్‌లకు రిప్లై ఇవ్వడానికి నా సెక్రటరీ ఓవర్‌టైమ్ పనిచేయాల్సి వచ్చేది. ఇప్పుడు అసలు నేను లాస్ట్‌టైమ్ ఎప్పుడు ఆటోగ్రాఫ్ ఇచ్చానో నాకే గుర్తులేదు’ అంటోంది బాలీవుడ్ నటి రీతూపర్ణ సేన్ గుప్తా. అంటే ఆమె పాపులారిటీ కోల్పోయిందని కాదు.. ఆమె అభిమానులు తమ రూట్ మార్చుకున్నారని. ఆమె ఒక్కరే కాదు దాదాపు టాప్‌స్టార్స్ అందరిదీ ఇదే మాట. తారలకు ‘సెల్ఫీ’ సంకటం.. ఏదైనా మితిమీరితే మింగుడు పడదనేది తెల్సిందే. అభిమానం పేరుతో సెల్ఫీలు డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్.. తారల్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు. సిటీని సందర్శించే బాలీవుడ్ తారలైతే వీరి ధాటికి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇటీవల సినిమా ప్రమోషన్లో భాగంగా బాలీవుడ్స్టార్ వరుణ్‌ధావన్ సిటీకి వచ్చినప్పుడు సెల్ఫోన్లను ముఖం మీదకు పెట్టేసి సెకన్లలో దాన్ని తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్‌లో అప్డేట్ చేసేయడానికి పోటీపడ్డారు. దీంతో వరుణ్ని వారి బారి నుంచి తప్పించడానికి బౌన్సర్స్ పాట్లుపడ్డారు. ‘ఫ్యాన్స్‌తో ఫొటో దిగడం నాకు ఇష్టమే. నేనిప్పుడున్న స్థాయి నాకు వాళ్లిచ్చిందే అని కూడా నాకు తెలుసు. అయితే, అభిమానులు మరీ దగ్గరగా వచ్చేసి కొంచెం కూడా స్పేస్ లేకుండా సెల్ఫీస్ తీసుకోవడం నాకు నచ్చడం లేదు’ అని తరచుగా నగరానికి వస్తున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ అంటోంది. ‘ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కెమెరా ఫోన్ ఉంది. పర్మిషన్ కూడా అడగకుండా కొందరు పక్కకు వచ్చేసి క్లిక్ చేస్తుంటారు. అది నాకు చాలా సెల్ఫిష్ అనిపిస్తుంది’ అంటాడు టాలీవుడ్ హీరో సిద్ధార్థ. ప్రియాంక చోప్రాతో సెల్ఫీ దిగుతున్న అభిమాని (ఫైల్) ఆటోగ్రాఫ్లైనా కాపీ చేసినట్టు అనుమానించవచ్చునేమో కాని సెల్ఫీ అయితే తిరుగులేని రుజువు అనడంలో సందేహం లేదు. ‘ఆటోగ్రాఫ్ ఇవ్వడం అనేది సక్సెస్‌ని ఎంజాయ్ చేయడంలో భాగంగా ఉండేది. అయితే సాంకేతిక విప్లవం ఆ అనుభూతిని మాకు దూరం చేస్తోంది’ అని ఓ సినీతార ఆవేదన. 1987 వరల్డ్‌కప్ టైమ్‌లో తన అభిమాన క్రికెటర్ల ఆటోగ్రాఫ్స్ తాను సేకరించానని, అవి ఇప్పటికీ తన వద్ద భద్రంగా ఉన్నాయని ఆ సంతోషమే వేరంటారామె. ‘మన రాత ఐదువేల ఏళ్ల నాటిది. మన సంస్కృతిలాగే ఇప్పటికీ అది మనగలుగుతోంది. ఆటోగ్రాఫ్ కూడా అంతే’ అంటారు అమితాబ్. తనకు సెల్ఫీస్ కోసం వచ్చే వినతులు పెరిగాయంటున్నారాయన. లైకులే లైకులు.. నాకు ఆరేళ్లప్పుడు మిలింద్ సోమన్ ‘మేడిన్ ఇండియా’ చూసి మ్యాడైపోయా. తనతో సెల్ఫీ తీసుకున్న క్షణం.. వావ్ అనిపించింది. దీనికి ఎఫ్బీలో బోలెడన్ని లైక్స్ వచ్చాయి. - మలిహ అలియా, వరుణ్ ధావన్‌లను కలిసి, సెల్ఫీ తీసుకోవడం సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఈ ఫొటోకి 750 పైగా లైక్స్ వచ్చాయి. - సిద్ధాంతి సిటికి వచ్చిన చాలా మంది సెలబ్రిటీలతో సెల్ఫీ తీసుకున్నా. లైక్స్ గురించి అని కాదు గాని.. అవి అద్భుతమైన మెమొరీగా ఉండిపోతాయి. - సుశీలా బొకాడియా -
ఫొటో అంటే చాలు...!!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏదైనా చెప్పాలని, చెప్పుకోవాలని ప్రయత్నిస్తే ఆయన వినడం లేదా? అయితే దానికో కిటుకుందట. ఆ కిటుకు ఏంటంటారా? ఏమీలేదు ఆయన తో ఫొటో దిగటమే. అదేంటి...? ఫొటో దిగడం వల్ల ప్రయోజనమేంటి? మనం చెప్పేది ఎలా వింటారని అనుకుంటున్నారా. ఈ మధ్య కాలంలో ఎక్కడికెళ్లినా చాలా మంది బాలకృష్ణను చుట్టుముట్టి మరీ ఫొటోలు దిగుతున్నారట. అలాగే ఏ దేశం వెళ్లినా ప్రధానమంత్రితో చాలా మంది సెల్ఫీలు దిగుతున్నారట. ఆ విషయం గమనించిన చంద్రబాబు తానేం తక్కువ అనుకున్నారేమో... ఫోటో దిగాలని ఎవరైనా అడగ్గానే ఎగిరి గంతేస్తున్నారట. అసలే ఫొటోలు దిగడం ఆయనకు పెద్ద సరదా. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత గతంలో మాదిరిగా నిత్యం పార్టీ కార్యాలయంలో లేదంటే సచివాలయంలో సంద ర్శకులను కలుసుకోవటం తగ్గించేశారు. ఒకవేళ కలుసుకున్నా వారు చెప్పేది ఏమాత్రం వినిపించుకోవడం లేదు. దీనికి పరిష్కారం ఏమిటా అని పలుమార్లు ఆయనతో తమ బాధ ను చెప్పుకునేందుకు ప్రయత్నించి విఫలమైన నేతలు ఈ కిటుకును గమనించారు. అదేమంటే ఆయనతో ఫొటో దిగటమేనట. ఫొటో దిగుతామంటే ఎంత హడావుడిలో ఉన్నా సరే చంద్రబాబు అడిగిన వారికి లేదనకుండా భుజం మీద చేయివేసి...! ఏయ్...! ఫొటోగ్రాఫర్ ఎక్కడ అంటారు. మనమేదైనా చెబుతామంటే ఎలాగూ వినడం లేదని గమనించిన వారంతా ఈ మధ్య కాలంలో సార్...! మీతో ఒక ఫోటో దిగుతామని అడుగుతున్నారట. అలా అడగ్గానే సరే అంటూ చంద్రబాబు వచ్చిన వారి భజం మీద చెయ్యి వేస్తున్నారు. అలా చెయ్యి వేసినప్పుడు ఫొటోగ్రాఫర్ క్లిక్ మనిపించేలోగా వారు తామొచ్చిన పనేంటో చెవిలో వేస్తున్నారట. ఇటీవలి కాలంలో కనిపెట్టిన నేత ఒకరు కలసి వారందరికీ ఈ కిటుకు చెబుతున్నారు. అదీ ఫొటో మహాత్మ్యం. -
మీ ఫొటో ‘స్మార్ట్’గా తీసుకోవచ్చు...!
వాషింగ్టన్:చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో తన ఫొటో తానే తీసుకోవడాన్ని ‘సెల్ఫీ’అంటారనేది మనకు తెలిసిందే...కానీ, అలా చేయడం వల్ల మనం అనుకున్నరీతిలో ఫొటో రాదు.. అయితే ఈ సమస్యను అమెరికాకు చెందిన ఐ-స్టాటెజీ ల్యాబ్ అనే సంస్థ ‘స్మార్ట్’గా పరిష్కరించింది. వీళ్లు రూపొందించిన స్మార్ట్ మిర్రర్‌కు ఎవరైనా ఎదురుగా నిలబడి నవ్వితే చాలు... అది తనంతట తానుగా ఫొటో తీసుకుంటుంది. సెల్ఫీ (సెల్ఫ్ ఎన్చాన్సింగ్ లైవ్ ఫీడ్ ఇమేజ్ ఇంజిన్)గా పిలిచే ఈ మిర్రర్లో ఒక కెమెరా, మనుషులను గుర్తుపట్టే సాఫ్ట్వేర్, వెబ్‌క్యామ్‌తో పాటు ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఈ సెల్ఫీ మిర్రర్‌ను కెమెరాలతో పాటు మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లలోనూ అమర్చుకోవచ్చు. ఇది తనంతట తానుగా ఫొటో తీసేయడమే కాదు...తీసిన చిత్రాన్ని వెంటనే ట్విట్టర్లో కూడా అప్లోడ్ చేస్తుంది.